NEET PG 2026 : నీట్ పీజీ అభ్యర్థులకు అలర్ట్- ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి, మరిన్ని కీలక మార్పులు కూడా..
NEET PG 2026 registration : నీట్ పీజీ 2026 పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కోసం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. పరీక్ష కేంద్రాల కేటాయింపు, ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్‌తో పాటు అప్లికేషన్ ప్రక్రియలో చేసిన మార్పుల వివరాలు ఇక్కడ చూడండి..
మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘నీట్ పీజీ 2026’ రాసే అభ్యర్థులకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఈసారి అప్లికేషన్ ప్రక్రియ నుంచి పరీక్షా కేంద్రంలో వెరిఫికేషన్ వరకు పలు కీలక మార్పులను బోర్డు ప్రవేశపెట్టింది. అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించే ముందు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను పూర్తిగా చదవాలని స్పష్టం చేసింది.

'ఫస్ట్ కమ్-ఫస్ట్ సర్వ్' విధానానికి స్వస్తి!
సాధారణంగా దరఖాస్తులు మొదట సబ్మిట్ చేసిన వారికి నచ్చిన పరీక్షా కేంద్రాలు వస్తాయనే నమ్మకం అభ్యర్థుల్లో ఉంటుంది. అయితే, ఈసారి నీట్ పీజీ పరీక్షకు ఈ విధానాన్ని ఎన్‌బీఈఎమ్ఎస్ రద్దు చేసింది. పరీక్ష రాసే సిటీ లేదా సెంటర్ల కేటాయింపు 'ఫస్ట్ కమ్- ఫస్ట్ సర్వ్' అనే ప్రాతిపదికన జరగదని బోర్డు స్పష్టం చేసింది. కాబట్టి అభ్యర్థులు అప్లికేషన్లు పెట్టడానికి కంగారు పడాల్సిన అవసరం లేదని, పూర్తి వివరాలు సరిచూసుకుని నిమ్మళంగా అప్లై చేయవచ్చని తెలిపింది.
పరీక్షా కేంద్రాల ఎంపిక ఇలా..
అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లో మూడు ప్రాధాన్యత కలిగిన రాష్ట్రాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.
మొదటి ఆప్షన్: అభ్యర్థి అప్లికేషన్‌లో పేర్కొన్న కరస్పాండెన్స్ అడ్రస్ (ప్రస్తుత నివాస చిరునామా) ఉన్న రాష్ట్రమే తప్పనిసరిగా మొదటి ఛాయిస్ కావాలి.
మిగతా రెండు ఆప్షన్లు: మొదటి రాష్ట్రానికి పొరుగున ఉన్న (సరిహద్దు) రాష్ట్రాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.
కరస్పాండెన్స్ అడ్రస్‌కు సంబంధించి చెల్లుబాటు అయ్యే చిరునామా పత్రాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ‘ఎడిట్ విండో’లో కూడా ఈ అడ్రస్‌ను లేదా టెస్ట్ స్టేట్ ఆప్షన్లను మార్చుకోవడానికి వీలుండదని బోర్డు ఖరాకండిగా చెప్పేసింది.
ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి.. చేతులకు మెహందీ వద్దు!
నీట్ పీజీ పరీక్షలో అవకతవకలను అడ్డుకునేందుకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్, వెరిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు.
"పరీక్షా కేంద్రానికి వచ్చే ముందే అభ్యర్థులు తమ ఆధార్ కార్డ్ అన్‌లాక్ అయి ఉండేలా చూసుకోవాలి. అలాగే చేతులకు గోరింటాకు (మెహందీ), రంగులు, ఇంక్, పెయింట్ వంటివి అస్సలు పెట్టుకోకూడదు. వీటివల్ల బయోమెట్రిక్ వేలిముద్రలు పడకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి," అని బోర్డు హెచ్చరించింది.
ఒకవేళ ఆధార్ అథెంటికేషన్ విఫలమైతే ఐరిస్ ఆధారిత వెరిఫికేషన్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపయోగిస్తారు. సెక్యూరిటీ, బయోమెట్రిక్ తనిఖీలకు సమయం పడుతుంది కాబట్టి, అభ్యర్థులు పరీక్ష సమయానికంటే చాలా ముందే సెంటర్లకు చేరుకోవాలని, ట్రావెల్ ప్లాన్స్ కాస్త వెసులుబాటుగా ఉంచుకోవాలని సూచించింది.
ఫోటోలు, వివరాల నమోదులో జాగ్రత్త..
అభ్యర్థులు తమ అప్లికేషన్‌లో మూడు నెలల కంటే పాతది కాని సరికొత్త పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను, సంతకాన్ని గైడ్‌లైన్స్ ప్రకారం అప్‌లోడ్ చేయాలి. బ్లర్‌గా ఉన్నా, మార్ఫింగ్ చేసినా లేదా తప్పుడు ఫోటోలు పెట్టినా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి. అప్లికేషన్ ఫైనల్ సబ్మిట్ చేసే ముందే కేటగిరీ, పుట్టిన తేదీ, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ సరిచూసుకోవాలి. ఎందుకంటే ఈ వివరాలనే తదుపరి కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియలో కూడా ఉపయోగిస్తారు కాబట్టి తర్వాత మార్పులకు అవకాశం ఉండదు.
మోసగాళ్ల బారిన పడకండి!
అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, ఆధార్ వివరాలు, మొబైల్ నంబర్ వంటి రహస్య సమాచారాన్ని అనధికార వ్యక్తులతో పంచుకోవద్దని బోర్డు గట్టిగా హెచ్చరించింది. మార్కులు పెంచుతామని, సీటు ఇప్పిస్తామని నమ్మించే మోసగాళ్లు ఈ సమాచారాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మకుండా, కేవలం ఎన్‌బీఈఎమ్ఎస్ అధికారిక వెబ్‌సైట్, వారి అధికారిక వాట్సాప్ ఛానల్ ద్వారా వచ్చే అప్‌డేట్స్‌ను మాత్రమే ఫాలో అవ్వాలని సూచించింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


