నీట్ పేపర్ లీక్ గుట్టు రట్టు: బ్యూటీ పార్లర్ కేంద్రంగా కుట్ర.. ఎన్టీఏ అధికారుల హస్తం
22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న నీట్ యూజీ (NEET-UG 2026) పేపర్ లీక్ వెనుక షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. పరీక్షా పత్రాలను భద్రపరచాల్సిన వారే.. కంచే చేను మేసిన చందంగా పేపర్లను బయటకు అమ్మేసిన వైనాన్ని సీబీఐ వెలుగులోకి తెచ్చింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సీబీఐ (CBI), ఈ కుట్ర వెనుక ఉన్న మూడు అంచెల వ్యవస్థను ఛేదించింది. కేవలం మధ్యవర్తులే కాకుండా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) లోపల ఉన్న కీలక వ్యక్తులే ఈ దందాకు తెరలేపడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ లీకేజీ కారణంగా జూన్ 21న దేశవ్యాప్తంగా రీ-ఎగ్జామ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎన్టీఏ గర్భాలయం నుంచే లీక్
నీట్ ప్రశ్నపత్రాలను రూపొందించే కమిటీ సభ్యులే ఈ పాపానికి ఒడిగట్టారు. పుణెకు చెందిన సీనియర్ బాటనీ టీచర్ మనీషా గురునాథ్ మాంధరే, లాతూర్ కు చెందిన పీవీ కులకర్ణిలను సీబీఐ అరెస్ట్ చేసింది.
వీరిద్దరినీ ఎన్టీఏ నిపుణులుగా నియమించింది. మనీషాకు బాటనీ, జువాలజీ పేపర్లకు యాక్సెస్ ఉండగా.. కులకర్ణికి కెమిస్ట్రీ పేపర్ పై పట్టు ఉంది.
ఏప్రిల్ నెలలోనే, అంటే పరీక్షకు కొన్ని వారాల ముందే మనీషా తన ఇంట్లోనే రహస్య కోచింగ్ సెషన్లు నిర్వహించింది. అక్కడ విద్యార్థులతో ప్రశ్నలను నోట్ పుస్తకాల్లో రాయించి, పాఠ్యపుస్తకాల్లో సమాధానాలను మార్క్ చేయించింది. "ఆమె చెప్పిన ప్రశ్నలే మే 3న జరిగిన అసలు పరీక్షలో వచ్చాయి" అని దర్యాప్తు సంస్థ నిర్ధారించింది.
బ్యూటీ పార్లర్ లింక్.. అసలు కుట్ర ఇక్కడే
ఈ కేసులో అత్యంత ఆసక్తికరమైన మలుపు పుణెలోని ఒక బ్యూటీ పార్లర్ యజమాని మనీషా వాఘ్మరే అరెస్ట్. ఈమె కేవలం పార్లర్ నడపడమే కాకుండా, ఎన్టీఏ అధికారులకు, విద్యార్థులకు మధ్య వారధిగా పనిచేసింది. అభ్యర్థులను పోగు చేయడం, వారిని లీకైన పేపర్లు ఉన్న కోచింగ్ సెంటర్లకు పంపడంలో ఈమె కీలక పాత్ర పోషించింది. ఏప్రిల్ 27 నాటికే ఈమెకు ప్రశ్నపత్రం చేతికి అందిందని సీబీఐ గుర్తించింది.
పీడీఎఫ్ ఫైళ్లు.. రూ. 10 లక్షల బేరం
లోపల లీకైన సమాచారం బయట మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లేసరికి ఒక భారీ వ్యాపారంగా మారింది.
హ్యాండ్ రిటన్ నోట్స్: ముందుగా మనీషా మాంధరే ఇంట్లో విద్యార్థులు రాసుకున్న నోట్స్ పీడీఎఫ్ ఫైళ్లుగా మారాయి.
డిజిటల్ సర్క్యులేషన్: సుమారు 500 నుంచి 600 ప్రశ్నలతో కూడిన ఈ పీడీఎఫ్ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో వైరల్ అయ్యింది.
బేరసారాలు: నాసిక్‌కు చెందిన శుభమ్ ఖైర్నార్ ద్వారా ఈ సమాచారం గురుగ్రామ్‌లోని యశ్ యాదవ్‌కు చేరింది. అక్కడి నుంచి రాజస్థాన్‌కు చెందిన మాంగీలాల్ బివాల్‌కు రూ. 10 లక్షలకు ఈ పేపర్ అమ్ముడుపోయింది. కనీసం 150 ప్రశ్నలు ఒరిజినల్ పేపర్లో కలిస్తేనే డబ్బులు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు.
మూడు అంచెల నెట్‌వర్క్
సీబీఐ దర్యాప్తు ప్రకారం ఈ కుట్ర మూడు స్థాయిల్లో సాగింది:
మొదటి అంచె (Insiders): పేపర్లను యాక్సెస్ చేయగలిగే ఎన్టీఏ అధికారులు.
రెండవ అంచె (Recruiters): బ్యూటీ పార్లర్ యజమాని లాంటి వారు, వీరు విద్యార్థులను వేటాడి పట్టుకుంటారు.
మూడవ అంచె (Middlemen): పేపర్లను పంపిణీ చేసి, వసూళ్లకు పాల్పడే మధ్యవర్తులు.
ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో 9 మందిని సీబీఐ అరెస్ట్ చేసింది. పేపర్ సెట్టింగ్ కమిటీలోని ఇతర సభ్యుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిందితులకు 10 రోజుల సీబీఐ కస్టడీ విధించింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది?
పేపర్ లీక్ నేపథ్యంలో రద్దయిన పరీక్షను తిరిగి జూన్ 21, 2026న నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
2. ఈ కేసులో ప్రధాన నిందితులు ఎవరు?
ఎన్టీఏ పేపర్ సెట్టింగ్ కమిటీ సభ్యులు మనీషా మాంధరే, పీవీ కులకర్ణి ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరితో పాటు బ్యూటీ పార్లర్ యజమాని మనీషా వాఘ్మరే కీలక మధ్యవర్తిగా వ్యవహరించారు.
3. ప్రశ్నపత్రం ఎలా లీక్ అయింది?
ఎన్టీఏ లోపల ఉన్న అధికారులే ప్రశ్నలను బయటకు తెచ్చి, వాటిని హ్యాండ్ రిటన్ నోట్స్‌గా మార్చి, ఆ తర్వాత పీడీఎఫ్ రూపంలో వాట్సాప్ ద్వారా సర్క్యులేట్ చేశారు.
4. ఎంతమంది విద్యార్థులపై ఈ ప్రభావం పడింది?
దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థులు ఈ లీకేజీ కారణంగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు మరియు మళ్లీ పరీక్ష రాయాల్సి వస్తోంది.s
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


