Nepal floods reason : భూకంపం కాదు! నేపాల్​లో​ ఆకస్మిక వరదల బీభత్సానికి అసలు కారణం ఇది..

Nepal floods : నేపాల్-టిబెట్ సరిహద్దులను ముంచెత్తిన ఘోర వరదలకు భూకంపం కారణం కాదని యూఎస్​జీఎస్ స్పష్టం చేసింది. కొండపైన గ్లేసియర్ ఒక్కసారిగా కూలిపోవడం వల్లే భోటే కోశి నది ఉప్పొంగిందని వెల్లడించింది. ఈ ప్రమాదంలో 157 మందికి పైగా బలయ్యారు. గల్లంతైన వేలాది మంది ప్రజల్లో 300మంది భారతీయులు ఉన్నారు.

Published on: Aug 27, 2026, 09:59:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో 157 మందికి పైగా ప్రాణాలు తీసి, అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన ఆకస్మిక జలప్రళయం వెనుక ఉన్న అసలు కారణాన్ని సైంటిస్టులు బయటపెట్టారు. బుధవారం ఉదయం ఆ ప్రాంతంలో సంభవించిన తీవ్రమైన ప్రకంపనలు భూకంపం వల్ల వచ్చినవి కావని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్​జీఎస్) అధికారికంగా ధృవీకరించింది. అది భూకంపం కాదని, మంచు కొండ (గ్లేసియర్) విరిగిపడి, లోయలోకి భారీ ఎత్తున కొండచరియలు విరుచుకుపడటంతో ఏర్పడిన భయానక ఘటన అని స్పష్టం చేసింది.

నౌవకోట్ జిల్లాలో కొనసాగుతున్న సహాయక చర్యలు.. (REUTERS)
నౌవకోట్ జిల్లాలో కొనసాగుతున్న సహాయక చర్యలు.. (REUTERS)

శాటిలైట్ చిత్రాల్లో బయటపడ్డ నిజాన్ని వివరించిన శాస్త్రవేత్తలు..

ప్లానెట్ ల్యాబ్స్ ఉపగ్రహ చిత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత యూఎస్‌జీఎస్ శాస్త్రవేత్తలు ఒక ప్రకటన విడుదల చేశారు. చైనా-నేపాల్ సరిహద్దులోని రసువాగధికి ఈశాన్యంగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'ల్హెండే' నది ఎగువన భారీ స్థాయిలో మంచు, రాళ్లు కూలిపడ్డాయి. ఈ కొండచరియల విధ్వంసం ఎంత తీవ్రంగా ఉందంటే, భూగర్భంలో రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం వస్తే ఎలాంటి ప్రకంపనలు వస్తాయో సరిగ్గా అంతే స్థాయిలో ప్రకంపనలు నమోదయ్యాయి. మొదట దీనిని 4.4 తీవ్రతతో కూడిన భూకంపంగా భావించినప్పటికీ, ఎలాంటి భూ ప్రకంపనలు సంభవించలేదని, కేవలం గ్లేసియర్ కూలిన ధాటికే భూమి కంపించిందని పరిశోధకులు తేల్చారు.

టిబెట్ నుంచి విరుచుకుపడ్డ మృత్యు తరంగం!

ల్హెండే నది ప్రవాహం చైనా నుంచి నేపాల్‌లోకి ప్రవహించే భోటే కోశి నదిలో కలిసింది. కొండచరియలతో పాటు లక్షలాది టన్నుల బురద, మంచు నీరు ఒక్కసారిగా భోటే కోశి నదిలోకి దూసుకురావడంతో ఉదయం 9 గంటల ప్రాంతంలో జలప్రళయం సంభవించింది. టిబెట్ సరిహద్దును ఆనుకుని ఉన్న రసువా, ధాడింగ్, నువాకోట్ జిల్లాలు ఈ వరద ధాటికి విలవిలలాడాయి. చైనా వైపు ఉన్న గైరోంగ్ ప్రాంతంలోనూ ఆకస్మికంగా వచ్చిన బురద ప్రవాహంలో భవనాలు, వాహనాలు కొట్టుకుపోతున్న దృశ్యాలు సీసీటీవి కెమెరాల్లో నమోదయ్యాయి. అక్కడ ముగ్గురు మరణించగా 265 మంది ఆచూకీ లభించకుండా పోయిందని చైనా మీడియా వెల్లడించింది.

అంధకారంలో సహాయక చర్యలు..!

వరద ఉధృతికి జలవిద్యుత్ కేంద్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమవడంతో ప్రభావిత ప్రాంతాలు చీకట్లో అల్లాడుతున్నాయి. విద్యుత్ లేకపోవడంతో ఆర్మీ క్యాంప్‌ల బయట పోలీసులు సెల్ ఫోన్ టార్చ్ లైట్ల వెలుగులోనే గల్లంతైన వారి పేర్లను నమోదు చేసుకుంటున్నారు. మరోవైపు ఆర్మీ హెలికాప్టర్లు నిరంతరం ఆకాశంలో తిరుగుతూ చిక్కుకుపోయిన వారిని కాపాడుతున్నాయి.

మరోవైపు వేల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారని, వీరిలో 300కుపైగా మంది భారతీయులు ఉన్నారని నేపాల్ విదేశాంగ శాఖ వెల్లడించింది. గల్లంతైన భారతీయుల్లో 133మంది మానస సరోవర యాత్రకు వెళ్లినవారు ఉన్నారని స్పష్టం చేసింది. అంతేకాదు అదే యాత్రలో ఉన్న అనేక మంది అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా దేశాలకు చెందిన విదేశీ టూరిస్టుల ఆచూకీ సైతం లభించడం లేదని పేర్కొంది.

నేపాల్ ప్రధాని బా లేంద్ర షా ప్రభుత్వ యంత్రాంగాన్నంతటినీ బాధితుల రక్షణ కోసం రెస్క్యూ రంగంలోకి దించారు. బురదలో కూరుకుపోయిన మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. అదే సమయంలో భారత్ నుంచి వెళ్లిన ఎయిర్ ఫోర్స్ విమానం 10 టన్నుల అత్యవసర సహాయక సామగ్రి, మందులను అందించి సహాయక చర్యల్లో పాలుపంచుకుంటోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More