Hero Impulse : హీరో ఇంపల్స్ రీ- ఎంట్రీ ఫిక్స్! లాంచ్‌కు రెడీ అవుతున్న ఆఫ్‌రోడ్ బైక్
భారత టూవీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్ తన పాపులర్ డ్యూయల్ స్పోర్ట్ బైక్ 'ఇంపల్స్'ను మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఎక్స్‌పల్స్ కంటే సరసమైన ధరలో, రోజూవారీ ప్రయాణాలకు అనువుగా ఉండేలా ఈ కొత్త బైక్‌ను రూపొందిస్తోంది. దీని ఇంజిన్, డిజైన్ వివరాలు ఇక్కడ చూడండి..
ఒకప్పుడు భారతీయ ఆఫ్‌రోడ్ బైక్ ప్రియుల మనసు దోచుకున్న ‘హీరో ఇంపల్స్’ మళ్లీ సరికొత్త రూపంలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది! దేశీయ మార్కెట్లో ఆఫ్‌రోడింగ్ సంస్కృతికి పునాది వేసిన ఈ ఐకానిక్ మోడల్‌ను హీరో మోటోకార్ప్ పునరుద్ధరిస్తున్నట్లు సమాచారం. ఇటీవల రహదారులపై పరీక్షలు జరుపుకుంటున్న సమయంలో ఈ బైక్ ప్రొడక్షన్ వెర్షన్ కెమెరా కంటికి చిక్కింది. ఫలితంగా కొన్ని కీలక విషయాలు తెలిశాయి. వాటి గురించి ఇక్కడ చూసేయండి..

ఎక్స్‌పల్స్ కంటే సులువైన రైడింగ్ ఎక్స్పీరియన్స్!
ప్రస్తుతం విక్రయాల్లో ఉన్న ఎక్స్‌పల్స్ 200 సిరీస్ బైక్‌లు ఎత్తు ఎక్కువగా ఉండటంతో, సాధారణ ఎత్తు ఉన్న రైడర్లు కాస్త ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యను అధిగమిస్తూ, కొత్త ఇంపల్స్‌ను అందరికీ అందుబాటులో ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఎక్స్‌పల్స్‌లో ఉండే 21 ఇంచుల ఫ్రంట్ వీల్ స్థానంలో, ఈ కొత్త బైక్‌లో 19 ఇంచుల వీల్‌ను అమర్చారు. దీనివల్ల నగరాల్లో ప్రతిరోజూ చేసే ప్రయాణాలకు, అలాగే వారాంతాల్లో లాంగ్ డ్రైవ్‌లకు ఇది సరైన ఎంపికగా మారుతుంది.
సస్పెన్షన్ ట్రావెల్, గ్రౌండ్ క్లియరెన్స్ 180 నుంచి 200 ఎంఎం పరిధిలో ఉండనున్నాయి. సీటు ఎత్తు కూడా సుమారు 800 ఎంఎం మాత్రమే ఉండే అవకాశం ఉండటంతో, తక్కువ ఎత్తు ఉన్న రైడర్లు కూడా కాలు నేలకు సులువుగా ఆనించి రైడ్ చేయవచ్చు.
శక్తివంతమైన 160 సీసీ ఇంజిన్
ఈ కొత్త డ్యూయల్ స్పోర్ట్ మోటార్‌సైకిల్‌లో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ మోడల్‌లో వాడే 163.2 సీసీ, సింగిల్ సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎక్స్‌ట్రీమ్ బైక్‌లో ఈ ఇంజిన్ 16.9 బీహెచ్‌పీ పవర్, 14.6 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.
అయితే, ఇంపల్స్ శైలి బైక్ కోసం ఈ ఇంజిన్‌ను ప్రత్యేకంగా రీ-ట్యూన్ చేస్తున్నారు. నగర ట్రాఫిక్‌లో తక్కువ వేగం వద్ద కూడా మెరుగైన శక్తిని అందించేలా హీరో ఇంజనీర్లు మార్పులు చేస్తున్నారు.
సరసమైన ఫీచర్లు.. తక్కువ నిర్వహణ వ్యయం
కస్టమర్లకు బైక్ ధరను అందుబాటులో ఉంచడమే కాకుండా, నిర్వహణ భారం తగ్గించేలా హీరో ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో సింగిల్-ఛానల్ ఏబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్ అందించనున్నారు. ఖరీదైన టిఎఫ్‌టి డిస్‌ప్లేకి బదులుగా, స్పష్టమైన సమాచారాన్ని ఇచ్చే ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నారు.
హీరో ఇంపల్స్ బైక్‌లో ఎల్‌ఈడీ టర్న్ ఇండికేటర్లు, సెల్ఫ్ స్టార్టర్‌తో పాటు కిక్ స్టార్టర్ కూడా ఇస్తుండటం విశేషం.
గ్లోబల్ అరంగేట్రం ఎప్పుడు?
హీరో మోటోకార్ప్ భారత్‌లోనే కాకుండా లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, ఐరోపా దేశాలకు పెద్ద ఎత్తున బైక్‌లను ఎగుమతి చేస్తోంది. ఆయా దేశాల్లో ఇలాంటి బడ్జెట్ డ్యూయల్-స్పోర్ట్ బైక్‌లకు మంచి డిమాండ్ ఉంది. అందుకే ఈ కొత్త ఇంపల్స్ మోడల్‌ను అంతర్జాతీయ ప్రదర్శన అయిన ఈఐసీఎంఏ 2026 ఆటో షోలో తొలిసారి ప్రదర్శించి, ఆ తర్వాత భారత షోరూమ్‌లలోకి తీసుకువచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


