H-1B Visa : 1998 నాటి హెచ్-1బీ వీసా రూల్స్ మార్పునకు అమెరికాలో బిల్లు! భారతీయులపై ప్రభావం ఎంత?
అమెరికాలో హెచ్-1బీ వీసా మినహాయింపు జీత పరిమితిని 60,000 డాలర్ల నుంచి ఏకంగా 1,40,000 డాలర్లకు పెంచేలా యూఎస్ కాంగ్రెస్‌లో కొత్త బిల్లు ప్రవేశపెట్టారు. భారత్‌తో పాటు తెలుగు ఐటీ నిపుణులపై దీని ప్రభావం ఎలా ఉండనుందో విశ్లేషణ.
భారతీయ ఐటీ నిపుణుల కలల గమ్యస్థానమైన అమెరికాలో హెచ్-1బీ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టీమ్ పనిచేస్తోంది! హెచ్-1బీ వీసా నిబంధనలకు సంబంధించి అదనపు రక్షణల నుంచి మినహాయింపు లభించే కనీస వేతన పరిమితిని ప్రస్తుతం ఉన్న 60,000 డాలర్ల నుంచి ఏకంగా 1,40,000 డాలర్లకు పెంచేందుకు ఉద్దేశించిన నూతన బిల్లును అమెరికా చట్టసభ సభ్యులు ప్రవేశపెట్టారు.
రిపబ్లికన్ పార్టీకి చెందిన విస్కాన్సిస్ రిప్రజెంటేటివ్ గ్లెన్ గ్రోత్మ్యాన్, ఒహాయో సెనేటర్ జాన్ హస్టెడ్లు 'ప్రొటెక్టింగ్ అమెరికన్ వర్కర్స్ త్రూ హెచ్-1బీ మోడర్నైజేషన్ యాక్ట్' (Protecting American Workers Through H-1B Modernization Act) పేరుతో ఈ చట్ట సవరణను ముందుకు తెచ్చారు.
1998 నాటి నిబంధనలకు స్వస్తి!
ప్రస్తుతం అమల్లో ఉన్న అమెరికా చట్టాల ప్రకారం.. తమ వద్ద పనిచేసే సిబ్బందిలో ఎక్కువ శాతం హెచ్-1బీ వీసాదారులు ఉన్న కంపెనీలను 'హెచ్-1బీ డిపెండెంట్ ఎంప్లాయర్స్'గా పరిగణిస్తారు. ఇటువంటి కంపెనీలు కొత్తగా విదేశీ నిపుణులను నియమించుకునే ముందు స్థానిక అమెరికన్లను రిక్రూట్ చేసుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చామని స్పష్టం చేయాల్సి ఉంటుంది.
అయితే, సదరు విదేశీ ఉద్యోగి వార్షిక వేతనం కనీసం 60,000 డాలర్లు ఉన్నా లేదా మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యా అర్హత కలిగి ఉన్నా ఈ అదనపు నిబంధనల నుంచి నియామక సంస్థలకు మినహాయింపు లభిస్తుంది. ఈ 60,000 డాలర్ల పరిమితిని 1998లో నిర్ణయించారు. పాతికేళ్లకు పైగా ఈ నిబంధన మారకపోవడంతో ప్రస్తుత వేతన స్థాయిలకు అనుగుణంగా రూల్స్‌ని సవరించాలని అమెరికా ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.
1,40,000 డాలర్ల పరిమితి అంటే ఏంటి?
కొత్త ప్రతిపాదన ప్రకారం, స్థిరమైన 60,000 డాలర్ల పరిమితి స్థానంలో అమెరికా సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ తెలిపే జాతీయ సగటు వేతన సూచీకి రెట్టింపు మొత్తాన్ని లెక్కగడతారు. వర్తమాన వేతన గణాంకాల ప్రకారం ఈ మొత్తం సుమారు 1,40,000 డాలర్లకు చేరనుంది.
అమెరికాలో పనిచేసే ప్రతి హెచ్-1బీ వీసాదారుడికి ఇది వర్తించే సార్వత్రిక కనీస వేతనం కాదని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కేవలం అదనపు నియామక నిబంధనల నుంచి విశ్రాంతి పొందాలనుకునే హెచ్-1బీ ఆధారిత కంపెనీలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. సగటు వేతన సూచీ ఆధారంగా ఈ మినహాయింపు పరిమితి ప్రతి ఏటా మారుతుంటుంది.
బిల్లు ప్రక్రియ ఏ దశలో ఉంది?
ఈ ప్రతిపాదన ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. సెనేట్‌లో దీనికి సంబంధించిన బిల్లుకు రెండుసార్లు రీడింగ్ పూర్తయి, అక్టోబర్ 14న సెనేట్ జ్యుడీషియరీ కమిటీ సమీక్షకు పంపారు. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రజాప్రతినిధుల సభ, సెనేట్ రెండింటి ఆమోదం పొంది, ఆపై దేశాధ్యక్షుడు సంతకం చేసిన తర్వాతే ఈ బిల్లు అధికారిక చట్టంగా మారుతుంది.
భారతీయ, తెలుగు ఐటీ రంగానికి పరిణామాలు!
అమెరికా హెచ్-1బీ వీసాలు పొందుతున్న వారిలో 70 శాతానికి పైగా భారతీయ టెక్కీలే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా వేలాది మంది ఐటీ ఇంజనీర్లు అమెరికాలో స్థిరపడుతున్నారు.
ఈ బిల్లు చట్టంగా మారితే, భారతీయ ఐటీ సర్వీస్ కంపెనీలు తక్కువ వేతనాలతో విదేశీ ఉద్యోగులను అమెరికా ప్రాజెక్టులకు పంపడం కష్టతరం కానుంది. స్థానిక అమెరికన్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడం లేదా నిపుణులకు 1.4 లక్షల డాలర్ల స్థాయి వేతనాలు చెల్లించడం తప్పనిసరి అవుతుంది. ఇది ఐటీ కంపెనీల నిర్వహణ వ్యయాన్ని పెంచే అవకాశం ఉన్నప్పటికీ, అత్యున్నత నైపుణ్యాలు ఉన్న టెక్కీలకు ఎక్కువ జీతాలు లభించే మార్గం సుగమం కానుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


