Nissan Gravite vs Renault Triber : మధ్యతరగతి ప్రజల కోసం రెండు 7 సీటర్ ఎంపీవీలు- ఏది బెస్ట్?
నిస్సాన్ గ్రావైట్ వర్సెస్ రెనాల్ట్ ట్రైబర్- ఈ రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ, 7 సీటర్ ఎంపీవీల మధ్య తేడాలు ఏంటి? ఎందులో ఫీచర్లు ఎక్కువ? దేని ధర తక్కువ? పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
జపనీస్ ఆటో దిగ్గజం నిసాన్ భారత మార్కెట్లో తన పట్టును పెంచుకునేందుకు సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. బడ్జెట్ ధరలో, మధ్యతరగతి కుటుంబాలకు సరిపోయేలా 'గ్రావైట్' పేరుతో బీ-సెగ్మెంట్, త్రీ-రో, 7-సీటర్ ఎంపీవీని ఇటీవలే లాంచ్ చేసింది. మాగ్నైట్ విజయం తర్వాత నిసాన్ నుంచి వస్తున్న అత్యంత సరసమైన కారు ఇదే కావడం విశేషం. ప్రస్తుతం నిసాన్ ఇండియా పోర్ట్‌ఫోలియోలో మాగ్నైట్, ఎక్స్-ట్రైల్ తర్వాత ఈ గ్రావైట్ మూడొవ కారుగా చేరింది. అయితే నిసాన్-రెనాల్ట్ భాగస్వామ్యం కారణంగా, ఈ గ్రావైట్ మోడల్ తన ఫ్రెంచ్ ప్రత్యర్థి అయిన 'రెనాల్ట్ ట్రైబర్' బాడీ డిజైన్‌ను పోలి ఉంటుంది.

మరి ఈ రెండింటిలో ఏది మెరుగైనదో ఇప్పుడు వివరంగా చూద్దాము..
నిస్సాన్ గ్రావైట్ వర్సెస్ రెనాల్ట్ ట్రైబర్- ఇంజిన్ సామర్థ్యం..
నిసాన్ గ్రావైట్ ఎంపీవీలో 1.0 లీటర్, త్రీ-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 72 హెచ్‌పీ పవర్‌ని, 96 ఎన్ఎం టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా ఈజెడ్ షిఫ్ట్ ఏఎంటీ ఆప్షన్లు ఉన్నాయి.
రెనాల్ట్ ట్రైబర్ విషయానికి వస్తే.. ఇందులో కూడా సరిగ్గా అదే 1.0 లీటర్ త్రీ-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది కూడా 72 హెచ్‌పీ పవర్, 96 ఎన్ఎం టార్క్‌ను ఇస్తుంది. ఇందులోనూ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ సౌకర్యాలు ఉన్నాయి.
గమనించాల్సిన విషయం ఏంటంటే.. మాగ్నైట్‌లో ఉండే 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ (100 హెచ్‌పీ, 160 ఎన్ఎం) ఈ 7 సీటర్ ఫ్యామిలీ ఎంపీవీ గ్రావైట్లో అందుబాటులో లేదు. అలాగే ట్రైబర్‌లో కూడా టర్బో ఇంజిన్ ఆప్షన్ లేదు.
నిస్సాన్ గ్రావైట్ వర్సెస్ రెనాల్ట్ ట్రైబర్- డైమెన్షన్స్..
డైమెన్షన్స్ పరంగా ఈ రెండు ఎంపీవీలు దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ, స్వల్ప తేడాలు ఉన్నాయి.
నిసాన్ గ్రావిటీ: పొడవు 3,987 ఎంఎం, వెడల్పు 1,734 ఎంఎం, ఎత్తు 1,644 ఎంఎం. దీని వీల్‌బేస్ 2,636 ఎంఎం కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 182 ఎంఎం.
రెనాల్ట్ ట్రైబర్: పొడవు 3,985 ఎంఎం, వెడల్పు 1,734 ఎంఎం, ఎత్తు 1,643 ఎంఎం. దీని వీల్‌బేస్ 2,636 ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 182 ఎంఎం.

నిస్సాన్ గ్రావైట్ వర్సెస్ రెనాల్ట్ ట్రైబర్- ఎక్స్‌టీరియర్ డిజైన్..
7 సీటర్ నిసాన్ గ్రావైట్ ఇక్కడ తన ప్రత్యేకతను చాటుకుంది. ముందు భాగంలో రెండు హెడ్‌ల్యాంప్‌లను కలుపుతూ క్రోమ్ స్ట్రిప్‌తో కూడిన ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉన్నాయి. బోనెట్‌పై 'GRAVITE' అని రాసి ఉన్న క్రోమ్ లెటరింగ్ దీనికి అగ్రెసివ్ లుక్‌ను ఇచ్చాయి. హనీకోంబ్ గ్రిల్, బంపర్ కింది భాగంలో ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ ఉన్న సీ-షేప్ క్రోమ్ ఇన్సర్ట్స్ దీనికి ఎస్యూవీ తరహా రూపాన్ని తెచ్చిపెట్టాయి. వెనుక వైపు ఈఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ మధ్య క్రోమ్ స్ట్రిప్, దాని మధ్యలో నిసాన్ లోగో ఉన్నాయి.
మరోవైపు, 7 సీటర్ ఫ్యామిలీ ఎంపీవీ రెనాల్ట్ ట్రైబర్ ఫ్రంట్ గ్రిల్ కొత్తగా వర్టికల్ స్లాట్స్‌తో వచ్చింది. ఇది డ్యూయల్ టోన్ పెయింట్ జాబ్ కలిగి ఉంది. అయితే, డోర్ హ్యాండిల్స్ క్రోమ్‌కు బదులుగా బ్లాక్ కలర్‌లో ఉన్నాయి. కొత్త గ్రిల్, శిల్పంలా ఉండే కొత్త బోనెట్, రిఫ్రెష్డ్ బంపర్, కొత్త ఈఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, కొత్త ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ ఇందులో ప్రధాన ఆకర్షణలు. వెనుక వైపు కూడా కొత్త బంపర్, అప్‌డేటెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, కొత్త స్కిడ్ ప్లేట్ ఉన్నాయి.
నిస్సాన్ గ్రావైట్ వర్సెస్ రెనాల్ట్ ట్రైబర్- ఇంటీరియర్, ఫీచర్లు..
లోపలి భాగంలో రెండు కార్లు దాదాపు ఒకే తరహా సౌకర్యాలను అందిస్తున్నాయి.
నిసాన్ గ్రావైట్: ఇది బ్లాక్-అండ్-బీజ్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌ను కలిగి ఉంది. 8-ఇంచ్ డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి. అంతేకాకుండా, అప్పర్ గ్లోవ్‌బాక్స్, లోయర్ కూల్డ్ గ్లోవ్‌బాక్స్, సెకండ్ రో కోసం 12వీ పవర్ అవుట్‌లెట్, అన్ని పవర్ విండోలు, వైర్‌లెస్ ఛార్జర్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
రెనాల్ట్ ట్రైబర్: ట్రైబర్ ఇంటీరియర్ కూడా గ్రావైట్‌ని పోలి ఉంటుంది. బ్లాక్-అండ్-బీజ్ డ్యూయల్ టోన్, 8-ఇంచ్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్ వంటి అన్ని ఫీచర్లు ఇందులోనూ ఉంటాయి.
నిస్సాన్ గ్రావైట్ వర్సెస్ రెనాల్ట్ ట్రైబర్- ధరల వివరాలు..
ధర విషయంలో నిసాన్ ఆకర్షణీయమైన ఎత్తుగడ వేసింది.
నిసాన్ గ్రావిటీ: మొదటి 1,001 మంది కస్టమర్ల కోసం దీనిని రూ. 5.65 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేశారు.
రెనాల్ట్ ట్రైబర్: దీని ప్రారంభ ధర రూ. 5.76 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది.
ప్రశ్నలు- సమాధానాలు :-
ప్రశ్న- నిసాన్ గ్రావైట్, రెనాల్ట్ ట్రైబర్ మధ్య ఉన్న ప్రధాన తేడా ఏమిటి?
సమాధానం- ఈ రెండు కార్లు ఒకే ప్లాట్‌ఫామ్, ఇంజిన్‌ను పంచుకున్నప్పటికీ, డిజైన్- లుక్స్ పరంగా ప్రధాన తేడాలు ఉన్నాయి. నిసాన్ గ్రావైట్ హనీకోంబ్ గ్రిల్, క్రోమ్ లెటరింగ్, అగ్రెసివ్ ఎస్యూవీ తరహా బాడీ లైన్లతో మోడ్రన్‌గా కనిపిస్తుంది. రెనాల్ట్ ట్రైబర్ క్లాసిక్ డిజైన్, డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లతో లభిస్తుంది. అలాగే ప్రారంభ ధరలో గ్రావిటీ కొంత తక్కువగా ఉంది.
ప్రశ్న- ఈ కార్లలో టర్బో ఇంజిన్ ఆప్షన్ అందుబాటులో ఉందా?
సమాధానం- ప్రస్తుతానికి నిసాన్ గ్రావైట్, రెనాల్ట్ ట్రైబర్ రెండింటిలోనూ కేవలం 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మాత్రమే అందుబాటులో ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


