Nissan Tekton : సేఫ్టీలో తోపు! సరికొత్త నిస్సాన్ టెక్టాన్ ఎస్‌యూవీకి 5- స్టార్ రేటింగ్..
Nissan Tekton safety rating : జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ ఇండియా మార్కెట్లోకి తీసుకొచ్చిన సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘టెక్టాన్’ భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌ల్లో అత్యుత్తమ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఈ కారు భద్రతా ప్రమాణాల పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాము..
భారతదేశంలో కొత్త కారు కొనాలనుకునే సగటు వినియోగదారుడు ఇప్పుడు మైలేజ్, లుక్స్‌తో పాటు భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో కస్టమర్ల ఆలోచనలకు తగ్గట్లే కార్ల కంపెనీలు కూడా సేఫ్టీ ప్రమాణాల్లో అస్సలు రాజీ పడటం లేదు. తాజాగా జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్.. సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'టెక్టాన్'ను పూర్తి సురక్షితమైన వాహనంగా భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది! దేశీయంగా కార్ల భద్రతను పరీక్షించే ‘భారత్ ఎన్‌సీఏపీ’ క్రాష్ టెస్ట్‌ల్లో నిస్సాన్ టెక్టాన్ అద్భుత ప్రదర్శన కనబరిచి, పర్‌ఫెక్ట్ 5-స్టార్ రేటింగ్‌ను దక్కించుకుంది.

నిస్సాన్ టెక్టాన్ క్రాష్ టెస్ట్ ఫలితాలను ఇక్కడ లోతుగా తెలుసుకుందాము..
నిస్సాన్ టెక్టాన్- పెద్దల రక్షణలో తిరుగులేని స్కోరు..
భారత్ ఎన్‌సీఏపీ నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో పెద్దల రక్షణ విభాగంలో నిస్సాన్ టెక్టాన్ అద్భుతమైన పట్టుత్వాన్ని ప్రదర్శించింది. మొత్తం 32 పాయింట్లకు గాను ఈ ఎస్‌యూవీ ఏకంగా 30.49 పాయింట్లను సాధించింది. ముందు వైపు నుంచి జరిగే ప్రమాద తీవ్రతను పరీక్షించే 'ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్'లో 16 పాయింట్లకు గాను 14.49 స్కోరును నమోదు చేసింది. అలాగే కారు పక్క భాగం నుంచి జరిగే ప్రమాదాలను అంచనా వేసే 'సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్'లో 16 మార్కులకు గాను 16కి 16 పాయింట్లు సాధించి వంద శాతం సురక్షితమైన కారుగా నిలిచింది.
నిస్సాన్ టెక్టాన్- పిల్లల భద్రతలోనూ టాప్..
కుటుంబంతో కలిసి ప్రయాణించేటప్పుడు వెనుక సీట్లో ఉండే చిన్న పిల్లల రక్షణకు ఈ ఎస్‌యూవీలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో ఈ కారు 49 పాయింట్లకు గాను 45 పాయింట్లు సాధించింది. ఇందులో డైనమిక్ స్కోరులో 24కు 24 పాయింట్లు, చైల్డ్ రీస్ట్రైంట్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్‌లో 12కు 12 పాయింట్లు రాబట్టింది.
టెస్టింగ్ సమయంలో 18 నెలల వయసున్న చిన్నారి, మూడేళ్ల వయసున్న పిల్లల భద్రతను పరీక్షించగా.. ముందు వైపు క్రాష్‌లో 8కి 8 పాయింట్లు, సైడ్ క్రాష్‌లో 4కి 4 పాయింట్లు సాధించి చిన్నారులకు ఈ కారు ఒక సురక్షితమైన కోట అని నిరూపించింది.
కారు బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు అన్నింటికీ ఈ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ వర్తిస్తుందని భారత్ ఎన్‌సీఏపీ స్పష్టం చేసింది.
నిస్సాన్ టెక్టాన్- ప్రాణాలు కాపాడే సేఫ్టీ ఫీచర్లు ఇవే..
నిస్సాన్ టెక్టాన్ కారులో ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ కల్పించే అత్యాధునిక హార్డ్‌వేర్ ఫీచర్లను అమర్చారు.
ఎయిర్‌బ్యాగుల లైనప్: డ్రైవర్, కో-ప్యాసింజర్ల కోసం ఫ్రంటల్ ఎయిర్‌బ్యాగులతో పాటు సైడ్ ఛెస్ట్ ఎయిర్‌బ్యాగులు, వెనుక సీటు ప్రయాణికులకు కూడా రక్షణనిచ్చేలా సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగులను ప్రాండ్‌గా అందించారు.
బెల్ట్ టెక్నాలజీ: ప్రమాద సమయాల్లో ప్రయాణికులు ముందుకు పడిపోకుండా సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్, బెల్ట్ లోడ్ లిమిటర్ టెక్నాలజీలు ఇందులో ఉన్నాయి.
చైల్డ్ సేఫ్టీ: వెనుక సీట్లలో పిల్లల సీట్లను సురక్షితంగా అమర్చడానికి 'ISOFIX' అంకర్ పాయింట్లను ఇచ్చారు.
నిస్సాన్ టెక్టాన్- వేరియంట్లు, ఇంజన్ ఆప్షన్లు..
ఈ సరికొత్త నిస్సాన్ టెక్టాన్ ఎస్‌యూవీ మొత్తం రెండు పవర్‌ఫుల్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. మొదటిది 1.0 లీటర్, 3-సిలిండర్ టర్బోచార్జ్డ్ టీ160 పెట్రోల్ ఇంజన్ కాగా, రెండోది మరింత పవర్‌ఫుల్ 1.3 లీటర్, 4-సిలిండర్ టర్బోచార్జ్డ్ టీ280 పెట్రోల్ ఇంజన్.
వినియోగదారులు తమ బడ్జెట్, అవసరాలకు తగ్గట్లు ఎంచుకోవడానికి వీలుగా టెక్టాన్ కారును విసియా, విసియా+, అసెంటా, ఎన్-కనెక్టా, టెక్నా, టెక్నా+ అనే 6 వేరియంట్లలో తీసుకొచ్చారు.
ట్రాన్స్మిషన్ విషయానికొస్తే, T160 ఇంజన్ అన్ని వేరియంట్లలోనూ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. పవర్‌ఫుల్ టీ280 ఇంజన్ మాన్యువల్ ఆప్షన్ కేవలం ఎన్-కనెక్టా, టెక్నా వేరియంట్లలోనే అందుబాటులో ఉంటుంది. అయితే, స్మూత్ డ్రైవింగ్ కోరుకునే వారి కోసం 6-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (డీసీటీ) గేర్‌బాక్స్‌ను అసెంటా, ఎన్-కనెక్టా, టెక్నా, టెక్నా+ వేరియంట్లలో నిస్సాన్ అందిస్తోంది.
ప్రస్తుతం భారత్‌లో విపరీతమైన డిమాండ్ ఉన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఈ కారు అడుగుపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో విరివిగా అమ్ముడయ్యే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతీ సుజుకీ విక్టోరిస్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైక్రాస్, రెనాల్ట్ డస్టర్ వంటి మోడళ్లకు నిస్సాన్ టెక్టాన్ గట్టి సవాలు విసరనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


