...
...
Next Story

'రాజ్ భవన్' ఇకపై ‘లోక్ భవన్’- గవర్నర్ల అధికార నివాసాల పేరు మార్పు..

గవర్నర్ల అధికార నివాసాల పేర్లను కేంద్రం మారుస్తోంది! 'రాజ్ భవన్' ఇకపై ‘లోక్ భవన్’గా మారనున్నాయి. ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోని రాజ్​ భవన్​లు ఇప్పటికే లోక్​ భవన్​లుగా మారాయి. దీనికి కారణాన్ని బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Published on: Dec 2, 2025, 05:35:54 IST
Advertisement

గవర్నర్ల అధికారిక నివాసాలైన రాజ్ భవన్ పేర్లను ఇకపై లోక్ భవన్​గా మార్చబోతున్నారు! 'ప్రజా సేవ' అనే ప్రభుత్వ నినాదానికి అనుగుణంగా ఈ మార్పు చేయాలని కేంద్రం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

కోల్​కతాలోని రాజ్​ భవన్​..
కోల్​కతాలోని రాజ్​ భవన్​..

ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఆయా రాజ్ భవన్‌ల పేర్ల లోక్​ భవన్​లుగా మార్చారు. ఈ మార్పులకు సంబంధించిన ప్రకటనలను చాలా వరకు ఆయా రాష్ట్ర గవర్నర్లే స్వయంగా సోషల్​ మీడియాలో ప్రకటించారు.

పేరు మార్చిన కోల్‌కతా లోక్​ భవన్ (గతంలో రాజ్​భవన్) ఎక్స్ (X) హ్యాండిల్ నుంచి వచ్చిన ఒక పోస్ట్ ఇలా ఉంది:

"ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పరివర్తనాత్మక, స్ఫూర్తిదాయక నాయకత్వానికి అనుగుణంగా, వికసిత్ భారత్ వైపు అద్భుతమైన పయనాన్ని దృష్టిలో ఉంచుకుని, దేశంలోని రాజ్ భవన్లు, రాజ్ నివాస్‌లను ఇక లోక్ భవన్, లోక్ నివాస్ అని ఏకరీతిగా పేరు మార్చాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2025 నవంబర్ 25న నోటిఫికేషన్ జారీ చేసింది."

ప్రజా సేవ లక్ష్యంగా..

ఇది ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతలో భాగమని, ఇది ప్రజా సేవకు ప్రాధాన్యత ఇస్తుందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వర్గాలు సూచించాయి.

గతంలో దశాబ్దాలుగా ఉన్న ప్రధాని నివాసం పేరును మార్చడంతో ఈ ప్రక్రియ మొదలైంది. అంతకుముందు ప్రధాని అధికారిక నివాసం పేరు 7 రేస్ కోర్స్ రోడ్​గా ఉండేది. అయితే, ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత దాన్ని లోక్ కల్యాణ్ మార్గ్​గా మార్చారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో, 'విధులు', 'పారదర్శకత' సందేశాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలకు పేర్లు మార్చారు.

అప్పటి నుంచి, దేశ రాజధాని నడిబొడ్డున ఉన్న అత్యంత ప్రసిద్ధ రహదారి అయిన రాజ్‌పథ్ పేరును కర్తవ్యపథ్​గా మార్చారు. అలాగే, కొత్త ప్రధాన మంత్రి కార్యాలయ సముదాయాన్ని సేవా తీర్థ్​గా పిలవనున్నారు.

అన్ని మంత్రిత్వ శాఖలను ఒకే చోటికి తరలిస్తున్న అనేక భవనాల సముదాయం అయిన సెంట్రల్ సెక్రటేరియట్​ను ఇప్పుడు కర్తవ్య భవన్​గా పిలుస్తున్నారు. ప్రజా సేవ అనేది ఒక పదవి కాదు, నిబద్ధత అని గుర్తు చేయడమే దీని ఉద్దేశం.

ఈ మార్పులు కేవలం 'సంకేతాత్మకంగా' కనిపించినప్పటికీ, నిశితంగా పరిశీలిస్తే ఇది ఒక పెద్ద సైద్ధాంతిక మార్పును ప్రతిబింబిస్తుందని ఓ బీజేపీ నాయకుడు అభిప్రాయపడ్డారు. భారత ప్రజాస్వామ్యం ఇప్పుడు 'అధికారం' కంటే 'బాధ్యత'కు, 'హోదా' కంటే 'సేవ'కు విలువ ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు.

‘పేర్లు మారిస్తే సరిపోదు’!

దేశవ్యాప్తంగా రాజ్ భవన్‌లు, రాజ్ నివాస్‌ల పేర్లను లోక్ భవన్, లోక్ నివాస్‌లుగా మార్చాలనే ప్రతిపాదనకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందనే మీడియా నివేదికలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. పేర్లు మారిస్తే సరిపోదని, ఆలోచనా విధానంలో మార్పు అవసరం అని ఆయన అన్నారు.

"ప్రజల వేదికకు గౌరవం ఇవ్వని వారు, దానికి లోక్ భవన్ అని పేరు మార్చడం కంటి తుడుపు చర్య కాదా?," అని ఆయన సోషల్​ మీడియా వేదికగా ప్రశ్నించారు.

"ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు, ప్రజల ఆశయాలను నెరవేర్చే రాష్ట్ర శాసనసభకు గౌరవం ఇవ్వడమే ఈ రోజు అవసరం. ఆలోచనలో, ఆచరణలో అది లేనప్పుడు, ఈ పేరు మార్పు కూడా అనవసరం," అని స్టాలిన్ అన్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks