...
...
Next Story

ఎన్ఆర్‌ఐలకు ఎన్‌పీఎస్ రూల్స్: పన్ను మినహాయింపులు, ఉపసంహరణ నిబంధనలు ఇవే

విదేశాల్లో ఉండే భారతీయులు (ఎన్ఆర్‌ఐలు) తమ రిటైర్మెంట్ కోసం జాతీయ పింఛను విధానంలో (ఎన్‌పీఎస్) పెట్టుబడి పెట్టవచ్చు. ఎన్ఆర్‌ఐలకు ఎన్‌పీఎస్ అర్హతలు, పన్ను మినహాయింపులు, ఖాతా తెరిచే విధానం, విత్‌డ్రాయల్ నిబంధనల వివరాలు ఈ కథనంలో పరిశీలిద్దాం.

Published on: Aug 7, 2026, 15:12:16 IST
Advertisement

విదేశాల్లో స్థిరపడినప్పటికీ, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కోసం సొంత దేశంలోనే సురక్షితమైన పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాలని చాలామంది ఎన్ఆర్‌ఐలు (NRIs) భావిస్తుంటారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 'జాతీయ పింఛను విధానం' (NPS) ఒక అద్భుతమైన అవకాశం. ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లు, ఈక్విటీలలో క్రమబద్ధంగా పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మెరుగైన నిధిని ఏర్పాటు చేసుకోవడానికి ఎన్‌పీఎస్ దోహదపడుతుంది. అయితే ఎన్ఆర్‌ఐలు ఎన్‌పీఎస్‌లో ఖాతా తెరవడానికి ఎలాంటి నిబంధనలు అమల్లో ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

అర్హత ఎవరికి ఉంది?

ఎన్ఆర్‌ఐలకు ఎన్‌పీఎస్ రూల్స్: పన్ను మినహాయింపులు, ఉపసంహరణ నిబంధనలు ఇవే
ఎన్ఆర్‌ఐలకు ఎన్‌పీఎస్ రూల్స్: పన్ను మినహాయింపులు, ఉపసంహరణ నిబంధనలు ఇవే

ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టడానికి విదేశాల్లో నివసిస్తున్న భారత పౌరులు (NRIs) మాత్రమే కాకుండా, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCI) కార్డుదారులు కూడా అర్హులు. ప్రస్తుతం పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (PIO) కార్డుదారులకు ఎన్‌పీఎస్‌లో చేరే అవకాశం లేదు.

ఎన్‌పీఎస్ ఖాతా ప్రారంభించడానికి చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్, నివాస ధ్రువీకరణ, కేవైసీ (KYC) పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్ఆర్‌ఈ (NRE) లేదా ఎన్ఆర్‌ఓ (NRO) బ్యాంక్ ఖాతాల ద్వారా నిధులను పెట్టుబడిగా మళ్లించవచ్చు.

టైర్-1 ఖాతాకే అనుమతి.. రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపు

ఎన్ఆర్‌ఐలు కేవలం ఎన్‌పీఎస్ 'టైర్-1' (Tier-I) ఖాతాను మాత్రమే తెరవడానికి వీలుంది. ఇది ప్రాథమిక రిటైర్మెంట్ ఖాతా. సాధారణ స్వదేశీ చందాదారులకు అందుబాటులో ఉండే ఐచ్ఛిక సేవింగ్స్ ఖాతా 'టైర్-2'ని (Tier-II) ఎన్ఆర్‌ఐలు ప్రారంభించడానికి ప్రస్తుత నిబంధనలు అంగీకరించవు.

పాత పన్ను విధానాన్ని (Old Tax Regime) ఎంచుకున్న ఎన్ఆర్‌ఐలు ఎన్‌పీఎస్ టైర్-1 డిపాజిట్లపై గణనీయమైన పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.

సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది. సెక్షన్ 80CCD(1B) కిందదనంగా మరో రూ. 50,000 వరకు అదనపు మినహాయింపు క్లెయిమ్ చేయవచ్చు.

భారతీయ పన్ను చట్టాల ప్రకారం ఎన్‌పీఎస్ 'EEE' (Exempt-Exempt-Exempt) వర్గంలోకి వస్తుంది. చందాదారుడికి 60 ఏళ్లు నిండిన తర్వాత జమ అయిన మొత్తం నిధి నుంచి గరిష్టంగా 60 శాతాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనిపై భారతదేశంలో ఎలాంటి పన్ను ఉండదు. మిగిలిన 40 శాతం మొత్తంతో విధిగా 'యాన్యుటీ' (Annuity) కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ యాన్యుటీ ద్వారా ప్రతి నెలా వచ్చే పింఛను ఆదాయంపై సదరు వ్యక్తి పన్ను స్లాబ్‌ ఆధారంగా పన్ను వర్తిస్తుంది.

ఒకవేళ 60 ఏళ్ల వయస్సు రాకముందే ఎన్‌పీఎస్ నుంచి నిష్క్రమించాలనుకుంటే (Premature Exit), నిధిలోని 20 శాతాన్ని మాత్రమే ఉపసంహరించుకోవడానికి వీలుంటుంది. మిగిలిన 80 శాతం సొమ్మును యాన్యుటీలో పెట్టుబడి పెట్టాలి. ఖాతా తెరిచిన మూడేళ్ల తర్వాత పిల్లల చదువులు, వైద్య అత్యవసరాలు, వివాహ ఖర్చుల కోసం తమ సొంత డిపాజిట్లలో గరిష్టంగా 25 శాతం వరకు ముందస్తుగా విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంది.

నివాస దేశంలోని పన్ను నిబంధనలపై దృష్టి పెట్టాలి

అనుకోని పరిస్థితుల్లో చందాదారుడు మరణిస్తే, ఎన్‌పీఎస్ ఖాతాలోని మొత్తం సొమ్మును నామినీకి బదిలీ చేస్తారు. దీనికి భారతదేశంలో పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే, ఎన్ఆర్‌ఐలు నివసిస్తున్న దేశాలలోని పన్ను చట్టాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం అవసరం. పింఛను లేదా విత్‌డ్రాయల్స్‌పై ఆయా దేశాల్లో వేర్వేరు పన్ను నిబంధనలు అమల్లో ఉండే అవకాశం ఉంది.

విదేశాల్లో ఉంటూనే భారతదేశంలో సురక్షితమైన, క్రమబద్ధమైన రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకోవడానికి ఎన్‌పీఎస్ ఒక చక్కని మార్గంగా ఉపయోగపడుతుంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe