...
...
Next Story

అమెరికాలో ఫ్యామిలీతో ఉండాలంటే ఎంత సంపాదించాలి? ఎన్‌ఆర్‌ఐ సంచలన లెక్కలు! షాక్ అవుతారు..

అమెరికాలో హెచ్‌-1బీ వీసాతో జీవిస్తూ నాలుగు సభ్యుల కుటుంబంతో ప్రశాంతంగా గడపాలంటే ఎంత జీతం అవసరమో ఒక ఎన్‌ఆర్‌ఐ లెక్కలతో సహా వివరించారు. పెరిగిన జీవన వ్యయం, ద్రవ్యోల్బణం నేపథ్యంలో అమెరికన్ డ్రీమ్ వెనుక ఉన్న అసలు నిజాలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి..

Published on: Sep 23, 2026, 05:59:52 IST
Advertisement

అమెరికా వెళ్లడం, డాలర్లలో సంపాదించడం తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది ఐటీ నిపుణుల కల. అయితే హెచ్-1బీ వీసాపై కుటుంబంతో కలిసి అమెరికాలో నివసించడం నేడు అంత తేలికైన విషయమేమీ కాదు! అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తీసుకొస్తున్న కఠిన రూల్స్​తో పాటు రోజురోజుకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆకాశాన్నంటుతున్న జీవన వ్యయం అక్కడ ఉండే ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది. సరిగ్గా ఇదే అంశంపై 10 ఏళ్లపాటు అమెరికాలో ఉండి ఇటీవల భారత్‌కు తిరిగి వచ్చిన ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త అనిరుద్ధ అంజనా షేర్ చేసిన సంచలన లెక్కలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

50/30/20 సూత్రంతో పక్కా బడ్జెట్..

అమెరికాలో జీవన వ్యయంపై వైరల్​ పోస్టు..
అమెరికాలో జీవన వ్యయంపై వైరల్​ పోస్టు..

హెచ్‌-1బీ వీసాపై ఇద్దరు పిల్లలు, భార్యాభర్తలతో కూడిన ఒక కుటుంబం కేవలం కాలం వెళ్లదీయడమే కాకుండా, ఎటువంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా జీవించడానికి ఎంత వేతనం కావాలో అనిరుద్ధ వివరించారు.

దీనికోసం ఆయన ప్రసిద్ధ '50/30/20' బడ్జెటింగ్ నియమాన్ని ఉపయోగించారు.

ఈ లెక్కన చూస్తే:

  • 50 శాతం నిధులు ఇంటి అద్దె, ఈఎంఐలు, తిండి, విద్యుత్, వైద్యం వంటి స్థిర ఖర్చులకు,
  • 30 శాతం నిధులు వినోదం, విహారయాత్రలు, వ్యక్తిగత కోరికలకు,
  • 20 శాతం నిధులు పొదుపు, భవిష్యత్తు పెట్టుబడులకు కేటాయించాల్సి ఉంటుంది.

సిలికాన్ వ్యాలీలో బతకాలంటే ఏటా రూ.3.89 కోట్లు!

ఐటీ రంగానికి కేంద్రబిందువైన శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక నాలుగు సభ్యుల కుటుంబం ప్రశాంతమైన జీవితం గడపాలంటే ఏటా కనీసం 4,07,597 డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 3.89 కోట్లు) ఆర్జించాలని అనిరుద్ధ అంచనా వేశారు. ఇక అమెరికాలో తక్కువ ఖర్చుతో కూడుకున్న నగరంగా పేరున్న హ్యూస్టన్‌లో కూడా జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని, అక్కడ ప్రశాంతంగా ఉండాలన్నా ఏటా కనీసం 2,00,000 డాలర్ల (సుమారు రూ. 1.91 కోట్లు) కంటే ఎక్కువ ఆదాయం ఉండాలని ఆయన తేల్చి చెప్పారు.

భారత్‌లో కూర్చుని ఆలోచించినప్పుడు డాలర్లలో లభించే జీతం చాలా పెద్దదిగా కనిపిస్తుంది. కానీ తీరా అక్కడికి వెళ్లాక, కుటుంబంతో నివసించేటప్పుడు ఆ జీతం కేవలం బడ్జెట్ కవర్ చేయడానికే సరిపోతుందని అనిరుద్ధ అభిప్రాయపడ్డారు.

"అమెరికన్ డ్రీమ్ వెనుక ఉన్న ఈ చేదు నిజాన్ని ఎవరూ మీకు ముందుగా చెప్పరు. భారత్‌లో వినడానికి ఎంతో భారీగా అనిపించే వేతనం, అక్కడ కుటుంబంతో జీవించడం మొదలుపెట్టాక ఆర్థిక ఒత్తిడితో కూడిన బడ్జెట్‌కే సరిగ్గా సరిపోతుంది," అని ఆయన సోషల్ మీడియా పోస్టులో వ్యాఖ్యానించారు.

ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలి..

కేవలం ఒకే వ్యవస్థలో ఉంటూ మరింత పెద్ద జీతం కోసం పరిగెత్తడం కంటే, అమెరికా జీవన వ్యయంతో సంబంధం లేని ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను సృష్టించుకోవడం తెలివైన పద్ధతి అని అనిరుద్ధ సూచించారు.

తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా వేలాది మంది ఇంజనీర్లు, ఐటీ నిపుణులు హెచ్‌-1బీ వీసాలపై అమెరికా బాట పడుతున్నారు. కేవలం డాలర్ల సంపాదన మాత్రమే కాకుండా, అక్కడ పెరిగిన మెడికల్ ఇన్సూరెన్స్, పిల్లల చదువుల ఖర్చులు, ఇళ్ల అద్దెలు, హెచ్‌-1బీ వీసా అనిశ్చితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks