అమెరికా మార్కెట్‌లోకి షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ తొలి ఈహెచ్‌వి పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ ఎగుమతి

అమెరికా మార్కెట్‌లోకి భారత్ నుంచి తొలి ఈహెచ్‌వి పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ ఎగుమతి జరిగింది. ప్రయాగ్‌రాజ్‌ నైనీ ప్లాంట్‌లో తయారైన 175 ఎంవీఏ, 345 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ అమెరికాకు రవాణా చేశారు.

Updated on: Sep 22, 2026, 19:12:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విద్యుత్‌ రంగంలో అంతర్జాతీయ విస్తరణను మరింత బలోపేతం చేసుకుంటూ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(SSEL), అమెరికా మార్కెట్‌కు తన తొలి 175 ఎంవీఏ, 345 కేవీ ఎక్స్‌ట్రా హై ఓల్టేజీ(EHV) పవర్ ట్రాన్సఫార్మర్‌ను విజయవంతంగా ఎగుమతి చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ నైనీ తయారీ కేంద్రంలో ఈ అధిక సామర్థ్యం కలిగిన ఈహెచ్‌వి పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తయారు చేశారు.

అమెరికాకు పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఎగుమతి
అమెరికాకు పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఎగుమతి

అమెరికాకు ఈ తొలి ఈహెచ్‌వి పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ ఎగుమతి, అంతర్జాతీయ విద్యుత్‌ ప్రసార మార్కెట్లలో ఎస్ఎస్ఈఎల్ సామర్థ్యాలకు మరో ముఖ్యమైన గుర్తింపుగా నిలిచింది. అధిక సామర్థ్యం కలిగిన పవర్‌ ట్రాన్స్ఫార్మర్‌ను అత్యున్నత ఇంజినీరింగ్‌, నాణ్యత, పనితీరు ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసి, అంతర్జాతీయ యుటిలిటీ మార్కెట్ల అవసరాలను తీర్చగే సామర్థ్యాన్ని సొంతం చేసుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ మైలురాయి ద్వారా అమెరికాతో పాటు ఇతర అంతర్జాతీయ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ మార్కెట్లలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు షిర్డీ ఎలక్ట్రికల్స్‌కు మరింత బలమైన పునాది ఏర్పడింది.

ఈ సందర్భంగా షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్, సీఈవో శరత్‌ చంద్ర కొల్లా మాట్లాడుతూ.. అమెరికాకు మా తొలి ఈహెచ్‌వీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎగుమతి చేయడం, ఎస్‌ఎస్‌ఈఎల్‌ అంతర్జాతీయ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయని అని చెప్పుకొచ్చారు. ఇది మా ఇంజినీరింగ్‌ నైపుణ్యం, తయారీ సామర్థ్యాలు, నాణ్యత పట్ల మా నిబద్ధతకు నిదర్శనమన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో తమ ఉనికిని మరింత విస్తరించడంతో పాటు రాబోయే 12–18 నెలల్లో నైనీ ట్రాన్స్‌ఫార్మర్‌ తయారీ యూనిట్‌ ద్వారా రూ.500–600 కోట్ల స్థాయిలో ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. యూరప్‌ మార్కెట్లో పవర్‌, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లకు అవసరమైన అనుమతులు, ధృవీకరణలు పొందేందుకు కూడా చర్యలు కొనసాగిస్తున్నామన్నారు.

సంస్థ ప్రెసిడెంట్ సుధీర్‌ వెన్నం మాట్లాడుతూ.. 'నైనీ నుంచి అమెరికాకు మా తొలి 175 MVA, 345 kV క్లాస్ ట్రాన్స్‌ఫార్మర్‌ను విజయవంతంగా రవాణా చేయడం సంస్థకు ఒక కీలక మైలురాయి. కఠినమైన అంతర్జాతీయ యుటిలిటీ ప్రమాణాలకు అనుగుణంగా భారీ సామర్థ్యం కలిగిన పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లను తయారు చేసి, సరఫరా చేయగల మా సామర్థ్యాన్ని ఇది ధృవీకరిస్తోంది. కడపతోపాటు నైనీని కూడా అధునాతన పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ మార్కెట్లకు ఒక విశ్వసనీయ ఎగుమతి కేంద్రంగా స్థాపించేందుకు ఈ విజయం దోహదపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా గ్రిడ్‌ విస్తరణ, విద్యుదీకరణ, పునరుత్పాదక ఇంధన అనుసంధానంపై భారీ పెట్టుబడులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ మైలురాయి మా అంతర్జాతీయ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు, అలాగే మా ఆదాయ వనరులను మరింత విభిన్నీకరించేందుకు బలమైన పునాదిని ఏర్పరుస్తుందని మేము విశ్వసిస్తున్నాం.' అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం దేశంవ్యాప్తంగా ఉన్న వివిధ తయారీ కేంద్రాల్లో షిర్డిసాయి ఎలక్ట్రిల్‌కు సుమారు 48,000 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ తయారీ సామర్థ్యం ఉంది. రాబోయే సంవత్సరాల్లో అదనంగా 1,10,000 ఎంవీఏ తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసేందుకు సంస్థ విస్తరణ ప్రణాళికలను అమలు చేస్తోంది. దీంతో ఎస్‌ఎస్‌ఈఎల్‌ మొత్తం ట్రాన్స్‌ఫార్మర్‌ తయారీ సామర్థ్యం సుమారు 1,58,000 ఎంవీఏకు చేరుకోనుంది.

అంతర్జాతీయ విద్యుత్‌ మౌలిక వసతుల మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, అధిక సామర్థ్యం కలిగిన ఈహెచ్‌వీ, పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ పరికరాల తయారీ సామర్థ్యాలను ఎస్‌ఎస్‌ఈఎల్‌ నిరంతరం విస్తరిస్తోంది. అమెరికాకు తొలి ఈహెచ్‌వీ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఎగుమతి చేయడం ద్వారా, అంతర్జాతీయ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ పరికరాల సరఫరా వ్యవస్థలో ఎస్‌ఎస్‌ఈఎల్‌ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.

1994లో ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో శ్రీ ఎన్‌. విశ్వేశ్వరరెడ్డి స్థాపించిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ మూడు దశాబ్దాలుగా విద్యుత్‌, ఇంధన మౌలిక వసతుల రంగంలో తన సామర్థ్యాలను నిరంతరం విస్తరించుకుంటూ వచ్చింది. ట్రాన్స్‌ఫార్మర్‌ రిపేర్‌, సర్వీసింగ్‌ సంస్థగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఎస్‌ఎస్‌ఈఎల్‌, ప్రస్తుతం పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, రియాక్టర్లు, కండక్టర్లు, అల్లాయ్‌లు, పునరుత్పాదక ఇంధన పరిష్కారాలు తదితర విభాగాల్లో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More