NSE share price : ఫ్లాట్​గా ఎన్​ఎస్​ఈ ఐపీఓ లిస్టింగ్- ఇన్వెస్టర్లకు 0.84శాతం లాభం!

మచ్ అవైటెడ్ ఎన్​ఎస్​ఈ ఐపీఓ గురువారం స్టాక్​ మార్కెట్​లో లిస్ట్ అయ్యింది. బీఎస్​ఈలో ఎన్​ఎస్​ఈ షేర్లు రూ.1800 వద్ద ఓపెన్ అయ్యాయి.

Published on: Sep 24, 2026, 10:01:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్ (ఎన్​ఎస్​ఈ) ఐపీఓ గురువారం ఉదయం 10 గంటలకు స్టాక్​ మార్కెట్​లో లిస్ట్ అయ్యింది. బీఎస్​ఈలో ఎన్​ఎస్​ఈ షేర్లు రూ. 1800 వద్ద ఓపెన్ అయ్యాయి. ఐపీఓ అప్పర్​ ప్రైజ్​ బ్యాండ్​ (రూ. 1785)తో పోల్చితే ఇది 0.84శాతం ప్రీమియం.

ఎన్​ఎస్​ఈ ఐపీఓ లిస్టింగ్ అప్డేట్స్..
ఎన్​ఎస్​ఈ ఐపీఓ లిస్టింగ్ అప్డేట్స్..

సెబీ నిబంధనల కారణంగా ఎన్​ఎస్​ఈ షేర్లు ఎన్​ఎస్​ఈలో ట్రేడ్ అవ్వవు. బీఎస్​ఈలోనే ట్రేడ్ చేయాల్సి ఉంటుంది.

ఎన్​ఎస్​ఈ ఐపీఓకి స్పందన ఇలా..

కంపెనీ ఆఫర్ చేసిన 8.86 కోట్ల షేర్లకు గాను ఏకంగా 50.58 కోట్ల షేర్ల కోసం బిడ్లు దాఖలయ్యాయి. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (క్యూఐబీ) ఈ ఐపీఓపై విశేష ఆసక్తి చూపారు. క్యూఐబీ కేటగిరీ ఏకంగా 12.68 రెట్లు సబ్‌స్క్రైబ్ కావడం విశేషం.

నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎన్​ఐఐ) కేటగిరీ 6.55 రెట్ల సబ్‌స్క్రిప్షన్ సాధించగా, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగానికి 1.39 రెట్ల సబ్‌స్క్రిప్షన్ మాత్రమే లభించింది. బడ్జెట్ బలం కలిగిన బడా ఇన్వెస్టర్లు ఈ ఇష్యూ వైపు ఎక్కువగా మొగ్గు చూపారు.

బీఎస్ఈ అధికారిక గణాంకాల ప్రకారం ఎన్​ఎస్​ఈ ఐపీఓ మొత్తం 5.71 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.

లిస్టింగ్​కి ముందు తగ్గిన ఎన్​ఎస్​ఈ ఐపీఓ జీఎంపీ..

లిస్టింగ్‌కు కొద్ది గంటల ముందు ఎన్​ఎస్​ఈ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) స్వల్పంగా క్షీణించింది. గత 20 ట్రేడింగ్ సెషన్లలో రూ. 285 గరిష్ఠ స్థాయి నుంచి జీఎంపీ రూ. 245 తగ్గి, గురువారం ఉదయం నాటికి రూ. 40 (దాదాపు 2.24 శాతం) వద్దకు చేరింది.

ఫలితంగా ఐపీఓ అప్పర్ ప్రైజ్​ బ్యాండ్​ రూ. 1,785 ఆధారంగా లెక్కిస్తే, మార్కెట్‌లో ఈ షేరు రూ. 1,825 వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు.

ఎన్​ఎస్​ఈ షేర్లతో ఇన్వెస్టర్లు ఏం చేయాలి? నిపుణుల సలహా..

"కేవలం లిస్టింగ్ లాభాల కోసమే దరఖాస్తు చేసిన వారు మినహా, మిగిలిన వారు ఎన్​ఎస్​ఈ షేర్లను తొలిరోజే విక్రయించడానికి తొందరపడకూడదు," అని మార్కెట్ నిపుణురాలు షేత్ అభిప్రాయపడ్డారు. "దీర్ఘకాలిక ప్రాతిపదికన ఈ షేరును కొనాలనుకునే కొత్త ఇన్వెస్టర్లు కొన్ని ట్రేడింగ్ సెషన్లు వేచి చూసి, మార్కెట్లో ధర స్థిరపడిన తర్వాతే ఎంట్రీ ఇవ్వడం శ్రేయస్కరం," అని ఆమె వివరించారు.

"అలాట్‌మెంట్ పొంది, దీర్ఘకాలిక దృక్పథంతో ఉన్న ఇన్వెస్టర్లు ఎన్​ఎస్​ఈ షేర్లను హోల్డ్ చేసుకోవచ్చు," అని కాంతిలాల్ ఛగన్‌లాల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ ఎం. ఓజా తెలిపారు. సుస్థిరమైన వ్యాల్యుయేషన్ నిర్ణయానికి మార్కెట్‌కు కొంత సమయం ఇవ్వడం మంచిదని ఆయన పేర్కొన్నారు.

ఎన్​ఎస్​ఈ ఐపీఓ విశేషాలు..

సెప్టెంబర్ 17, 2026న ప్రారంభమైన ఎన్ఎస్ఈ ఐపీఓ బిడ్డింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 21తో ముగిసింది.

ఈ ఐపీఓ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ. 1,700 నుంచి రూ. 1,785గా (ఫేస్​ వాల్యూ రూ. 1) నిర్ణయించారు. లాట్ సైజ్ 8 షేర్లుగా ఉంది.

ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్) రూపంలో వచ్చింది. దీనివల్ల లభించే నిధులు ఎన్ఎస్ఈకి వెళ్లకుండా, తమ వాటాలను విక్రయించిన ప్రస్తుత వాటాదారులకే చేరుతాయి.

గతంలో దాదాపు రూ. 30,000 కోట్లతో ఓఎఫ్ఎస్ కింద 14.9 కోట్ల షేర్లను విక్రయించాలని భావించినప్పటికీ, తదనంతరం విక్రయ షేర్ల సంఖ్యను 12.64 కోట్లకు కుదించడంతో ఇష్యూ పరిమాణం రూ. 22,569 కోట్లకు తగ్గింది.

కొటాక్ మహీంద్రా క్యాపిటల్ ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరించగా, ఎంయూఎఫ్​జీ ఇంటైమ్ ఇండియా రిజిస్ట్రార్‌గా సేవలు అందించింది.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More