NSE IPO : ఎల్లుండే ఎన్​ఎస్​ఈ ఐపీఓ ఓపెన్- దూసుకెళుతున్న జీఎంపీ! తగిలితే పక్కా లాభాలు?

మరో రెండు రోజుల్లో.. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్​ఛేంజ్ ‘ఎన్​ఎస్​ఈ’ తన మెగా ఐపీఓను సెప్టెంబర్ 17న ప్రారంభించనుంది. రూ. 22,568.94 కోట్ల నిధుల సేకరణే లక్ష్యంగా వస్తున్న ఈ ఐపీఓ వివరాలు మీకోసం..

Updated on: Sep 15, 2026, 10:01:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత స్టాక్ మార్కెట్ ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్​ఎస్​ఈ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​కి ఇంకా రెండు రోజుల సమయమే మిగిలింది! క్యాష్ మార్కెట్, ఈక్విటీ డెరివేటివ్స్ విభాగాల్లో అత్యధిక ట్రేడింగ్ వాల్యూమ్‌తో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్.. రూ. 22,568.94 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంగా మార్కెట్​లోకి అడుగుపెడుతోంది.

ఎన్​ఎస్​ఈ ఐపీఓ జీఎంపీ లేటెస్ట్ అప్డేట్స్.. (Bloomberg)
ఎన్​ఎస్​ఈ ఐపీఓ జీఎంపీ లేటెస్ట్ అప్డేట్స్.. (Bloomberg)

భారత కార్పొరేట్ చరిత్రలోనే రెండో అతిపెద్ద పబ్లిక్ ఇష్టూగా నిలవనున్న ఈ ఎన్​ఎస్​ఈ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత? ఐపీఓకి అప్లై చేయాలా? వద్దా? వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

ఎన్​ఎస్​ఈ ఐపీఓ- ప్రైజ్​ బ్యాండ్, డేట్స్ వివరాలు..

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ సెప్టెంబర్ 17 (గురువారం) సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకోనుండగా, సెప్టెంబర్ 21 (సోమవారం) నాటితో గడువు ముగుస్తుంది. షేర్ల కేటాయింపు (అలాట్​మెంట్) ప్రక్రియ సెప్టెంబర్ 22న, స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 24న పూర్తయ్యే అవకాశాలున్నాయి.

షేరు ధరల శ్రేణిని రూ. 1,700 నుంచి రూ. 1,785గా నిర్ణయించారు. లాట్ పరిమాణం 8 షేర్లుగా ఉంది. గరిష్ఠ ధర ప్రాతిపదికన రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం కనిష్ఠంగా రూ. 14,280 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్) రూపంలో రానుంది. ప్రస్తుత వాటాదారులు తమ వద్ద ఉన్న 12.64 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నారు. కొత్తగా షేర్ల జారీ లేకపోవడం వల్ల ఈ ఐపీఓ ద్వారా వచ్చే నిధులు కంపెనీకి వెళ్లవు. గరిష్ఠ ధర వద్ద ఎన్‌ఎస్‌ఈ మార్కెట్ విలువ రూ. 4.41 లక్షల కోట్లను దాటుతుంది.

విచిత్రమైన అంశం ఏంటంటే.. స్వయం నియంత్రణ నిబంధనల ప్రకారం ఎన్‌ఎస్‌ఈ తన సొంత ప్లాట్​ఫామ్​పై లిస్ట్ అవ్వడానికి వీల్లేదు. అందువల్ల ఎన్‌ఎస్‌ఈ షేర్లు దాని ఏకైక ప్రత్యర్థి సంస్థ అయిన బాంబే స్టాక్ ఎక్స్​ఛేంజ్​ (బీఎస్​ఈ)లోనే లిస్ట్ అవుతుంది.

ఎన్​ఎస్​ఈ ఐపీఓకుగ్రే మార్కెట్‌లో భారీ డిమాండ్!

అన్-లిస్టెడ్ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ షేర్లకు విపరీతమైన క్రేజ్ కనిపిస్తోంది. గ్రే మార్కెట్ ప్రీమియం (జీపీఎం) ప్రస్తుతం రూ. 208 వద్ద కొనసాగుతోంది. దీని ప్రకారం అన్-లిస్టెడ్ మార్కెట్‌లో ఒక్కో షేరు రూ. 1,993 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే ఐపీఓ గరిష్ఠ ధర రూ. 1,785తో పోలిస్తే ఇన్వెస్టర్లకు మొదటి రోజే సుమారు 11.65 శాతం వరకు లిస్టింగ్ లాభాలు వచ్చే అవకాశముంది.

అయితే కేవలం జీఎంపీని చూసే ఐపీఓకు అప్లై చేయవద్దని నిపుణులు చెబుతున్నారు. గ్రే మార్కెట్​ ప్రీమియం అనేది ఎప్పటికప్పుడు మారుతుందని అంటున్నారు. అందుకే కంపెనీ ఆర్థిక పరిస్థితులు తెలుసుకోవడం చాలా ముఖ్యం అని స్పష్టం చేస్తున్నారు.

ఎన్​ఎస్​ఈ ఐపీఓ- అద్భుతమైన ఆర్థిక ప్రదర్శన!

భారత క్యాపిటల్ మార్కెట్లో ఎన్‌ఎస్‌ఈ దాదాపు ఏకఛత్రాధిపత్యం సాగిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో క్యాష్ ఈక్విటీ విభాగంలో 92.99 శాతం, ఈక్విటీ ఫ్యూచర్స్‌లో 99.79 శాతం, ఈక్విటీ ఆప్షన్స్‌లో 74.71 శాతం మార్కెట్ వాటాను ఎన్‌ఎస్‌ఈ కలిగి ఉంది.

ఆర్థికంగా చూస్తే, 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ. 16,601.31 కోట్లకు చేరగా, నికర లాభం రూ. 10,302.06 కోట్లుగా నమోదైంది. ఆపరేటింగ్ మార్జిన్ 66.85 శాతంగా, రిటర్న్ ఆన్ ఈక్విటీ 32.98 శాతంగా ఉన్నాయి. కంపెనీకి రూపాయి కూడా అప్పు లేకపోవడం, భారీ కార్పస్ నిధులు కలిగి ఉండడం పెద్ద బలం. 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనూ ఆదాయం 13.10 శాతం వృద్ధి చెందింది.

ఎన్​ఎస్​ఈ ఐపీఓకి అప్లై చేయాలా? వద్దా?

ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంపై ఎక్కువగా ఆధారపడడం, ఆప్షన్స్ ట్రేడింగ్‌పై సెబీ విధిస్తున్న కొత్త నిబంధనలు, పన్నుల పెంపు కొంతవరకు ప్రతికూల అంశాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయినప్పటికీ సుదీర్ఘ కాలానికి ఇది మంచి పెట్టుబడి అని చెబుతున్నారు.

"గరిష్ఠ ధర రూ. 1,785 వద్ద ఎన్‌ఎస్‌ఈ పీఈ నిష్పత్తి 42.89 రెట్లుగా ఉంది. మార్కెట్లో కంపెనీకున్న బలమైన స్థానం, అద్భుతమైన లాభదాయకత, రుణాలు లేని బ్యాలెన్స్ షీట్ దృష్ట్యా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఈ ఐపీఓను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు," అని శామ్‌కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ అసిస్టెంట్ రాజ్ గైకర్ పేర్కొన్నారు.

"భారత మార్కెట్ల అభివృద్ధిలో ఎన్‌ఎస్‌ఈ పాత్ర అత్యంత కీలకమైనది. బీఎస్‌ఈతో పోలిస్తే ఎన్‌ఎస్‌ఈ వ్యాల్యుయేషన్ సమంజసంగానే ఉంది. లిస్టింగ్ లాభాలతో పాటు దీర్ఘకాలిక పోర్ట్‌ఫోలియో కోసం ఈ ఐపీఓలో దరఖాస్తు చేయవచ్చు," అని సుశీల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణుడు స్వప్నీల్ అభిప్రాయపడ్డారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More