NSE IPO : పడిపోతున్న జీఎంపీ! ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌కి ఈరోజే లాస్ట్ ఛాన్స్- అప్లై చేయాలా? వద్దా?
భారత స్టాక్ మార్కెట్ దిగ్గజం 'ఎన్‌ఎస్‌ఈ' రూ. 22,569 కోట్ల మెగా ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ నేటితో ముగియనుంది. గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ), వ్యాల్యుయేషన్లతో పాటు ఈ ఐపీఓలో పెట్టుబడి పెట్టవచ్చో లేదో తెలి పే ప్రత్యేక విశ్లేషణ మీకోసం..
స్టాక్ మార్కెట్ ట్రేడర్స్, ఇన్వెస్టర్స్‌కి అలర్ట్. దేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పబ్లిక్ ఇష్యూ (ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ) సబ్‌స్క్రిప్షన్ ఈరోజుతో ముగియనుంది. రూ. 22,569 కోట్ల విలువైన ఈ మెగా ఐపీఓ సెప్టెంబర్ 17న ప్రారంభమైన విషయం తెలిసిందే. దలాల్ స్ట్రీట్ దిగ్గజాల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని సాధారణ రిటైల్ ఇన్వెస్టర్ల వరకు అందరి దృష్టి ప్రస్తుతం ఈ ఐపీఓపైనే నెలకొంది.
ఈ నేపథ్యంలో ఈ ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ జీఎంపీ, అప్లై చేయాలా? వద్దా? వంటి వివరాలపై నిపుణుల సూచనలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
ఎన్ఎస్ఐ ఐపీఓ- సబ్‌స్క్రిప్షన్ వివరాలు..
రెండో రోజు బిడ్డింగ్ ముగిసే సమయానికి ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ మొత్తం 1.16 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.
రిటైల్ ఇన్వెస్టర్ల కోటా: కేటాయించిన 4.41 కోట్ల షేర్లలో 72 శాతం నిండింది.
క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లు (క్యూఐబీ): తమ కోటాలో 1.53 రెట్లు బిడ్లు దాఖలు చేశారు.
నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎన్ఐఐ): తమ విభాగంలో 1.68 రెట్లు దరఖాస్తు చేసుకున్నారు.
ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ జీఎంపీ వివరాలు..
ప్రస్తుతం గ్రే మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ షేరుకు రూ. 48 (సుమారు 3 శాతం) ప్రీమియం లభిస్తోంది. దీని ప్రకారం అప్పర్ ప్రైజ్ బ్యాండ్ రూ. 1,785పై రూ. 48 అదనంగా చేరి, లిస్టింగ్ రోజున రూ. 1,833 వద్ద షేరు విక్రయమయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే, గత శుక్రవారం ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ జీఎంపీ 8శాతం వరకు ఉండేది. అంటే ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ జీఎంపీ పడుతూ వస్తోంది.
ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ- కీలక తేదీలు,పెట్టుబడి వివరాలు..
- ధరల శ్రేణి : ప్రతి షేరుకు రూ. 1,700 నుంచి రూ. 1,785 గా నిర్ణయించారు.
- లాట్ సైజు: కనీసం 8 షేర్లు. రిటైల్ ఇన్వెస్టర్ కనీస పెట్టుబడి రూ. 14,280 అవుతుంది.
- అలాట్‌మెంట్ తేదీ: సెప్టెంబర్ 22, 2026.
- లిస్టింగ్ తేదీ: సెప్టెంబర్ 24, 2026 (బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్).
ఈ రూ. 22,569 కోట్ల ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో వస్తోంది. అంటే ఈ ఐపీఓ ద్వారా వచ్చే నిధులన్నీ ప్రస్తుత వాటాదారులకే దక్కుతాయి తప్ప, ఎన్‌ఎస్‌ఈ సంస్థకు ఎలాంటి నగదు వెళ్లదు. లిస్టింగ్ తదనంతరం ఎన్‌ఎస్‌ఈ మార్కెట్ విలువ రూ. 4,41,788 కోట్లకు చేరుతుందని అంచనా.
ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ- సబ్‌స్క్రైబ్ చేయాలా? వద్దా
ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ పట్ల ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు సానుకూలంగా స్పందించాయి.
"ఆర్థిక సంవత్సరం ఎఫ్వై26 ప్రాఫిట్ ఆధారంగా ఎన్‌ఎస్‌ఈ పీ/ఈ మల్టిపుల్ 42.9 రెట్లుగా ఉంది. దీని పోటీ సంస్థ అయిన బీఎస్‌ఈ పీ/ఈ 54.3 రెట్లతో పోలిస్తే ఎన్‌ఎస్‌ఈ దాదాపు 21 శాతం డిస్కౌంట్ ధరకే అందుబాటులో ఉంది," అని యెస్ సెక్యూరిటీస్ సంస్థ విశ్లేషించింది. ఈ ప్రాతిపదికన ఐపీఓకు 'సబ్‌స్క్రైబ్' చేయవచ్చని రికమండ్ చేసింది.
ఎల్కేపీ సెక్యూరిటీస్ సహా పలు ఇతర సంస్థలు కూడా దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఇదొక అరుదైన అవకాశమని తెలిపాయి. అప్పులు లేని బ్యాలెన్స్ షీట్, మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యం, స్థిరమైన మార్జిన్లు ఉన్న కంపెనీగా ఎన్‌ఎస్‌ఈకి మంచి భవిష్యత్తు ఉందని అభిప్రాయపడ్డాయి.
తిరుగులేని మార్కెట్ ఆధిపత్యం!
భారత క్యాపిటల్ మార్కెట్ మౌలిక వసతులలో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన వెన్నెముకగా నిలిచింది.
- క్యాష్ మార్కెట్ వాటా: దాదాపు 93 శాతం
- ఈక్విటీ ఫ్యూచర్స్ వాటా: 99.7 శాతం
- ఈక్విటీ ఆప్షన్లు: 68.5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.
జూన్ 2026 నాటికి ఎన్‌ఎస్‌ఈ వేదికపై 13.24 కోట్ల మంది యూనిక్ ఇన్వెస్టర్లు, 3,005 లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ఎఫ్వై6 లో ఎన్‌ఎస్‌ఈ రూ. 16,601 కోట్ల కార్యకలాపాల ఆదాయాన్ని, రూ. 10,302 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాదితో పోలిస్తే లాభాలు స్వల్పంగా తగ్గినప్పటికీ, ఎస్బీఐ సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం సంస్థ ఆపరేటింగ్ మార్జిన్ 67.6 శాతంగా నమోదవ్వడం విశేషం.
ఇన్వెస్టర్లు గమనించాల్సిన రిస్క్ అంశాలు..
ఎన్‌ఎస్‌ఈ ఐపీఓలో సానుకూలతలతో పాటు కొన్ని ముప్పులు కూడా ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈ సంపాదిస్తున్న మొత్తం ఆదాయంలో 78.7 శాతం కేవలం ట్రాన్సాక్షన్ చార్జీల ద్వారానే వస్తోంది. అందులోనూ ఆప్షన్స్ ట్రేడింగ్ వాటా ఏకంగా 60.2 శాతంగా ఉంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఏవైనా కఠిన నిబంధనలు తెస్తే, అది ఎన్‌ఎస్‌ఈ ఆదాయంపై నేరుగా దెబ్బతీసే అవకాశం ఉంది.
అలాగే, గతంలో 96.8 శాతంగా ఉన్న ఎన్‌ఎస్‌ఈ ఆప్షన్ల మార్కెట్ వాటా ప్రస్తుతం 68.5 శాతానికి పడిపోయింది. స్వల్పకాలికంగా పెద్ద ఎత్తున లిస్టింగ్ గెయిన్స్ ఆశించే వారికి 3 శాతం జీఎంపీ పెద్దగా ఆకర్షణీయంగా అనిపించకపోవచ్చు. కానీ, భారత ఆర్థిక వ్యవస్థ విస్తరణపై నమ్మకం ఉన్న దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఎన్‌ఎస్‌ఈ మంచి ఎంపికగా నిలుస్తుంది.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


