...
...
Next Story

Canada Student Visa : కెనడా కలలకు బ్రేక్.. పదేళ్ల కనిష్టానికి భారత విద్యార్థుల వీసాలు!

ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లాలనుకునే భారత విద్యార్థుల సంఖ్య దశాబ్ద కాలపు కనిష్ట స్థాయికి పడిపోయింది. కఠినతరమైన వీసా నిబంధనలు, రెట్టింపైన జీవన వ్యయ నిధుల షరతులతో 2026లో స్టడీ పర్మిట్లు భారీగా తగ్గాయి. ఆ వివరాలు..

Published on: Nov 22, 2026, 14:04:43 IST
Advertisement

ఉన్నత విద్య, మెరుగైన ఉపాధి అవకాశాల కోసం కెనడా గడ్డపై అడుగుపెట్టాలని కలలు కనే భారత విద్యార్థుల జోరుకు గట్టి బ్రేక్ పడింది! కెనడా ప్రభుత్వ కఠిన ఆంక్షల ఫలితంగా, ఆ దేశ విద్యాసంస్థల్లో చదువుకునేందుకు స్టడీ పర్మిట్లు పొందుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయే దిశగా సాగుతోంది. ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్​సీసీ) విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2026 సెప్టెంబర్ చివరి నాటికి కెనడా జారీ చేసిన మొత్తం 2,63,340 స్టడీ పర్మిట్లలో భారతీయుల వాటా కేవలం 51,900 మాత్రమే. ఏడాది చివరి త్రైమాసికంలోనూ ఇదే ధోరణి కొనసాగితే, 2017 తర్వాత ఇదే అత్యల్ప వార్షిక సంఖ్యగా నమోదవుతుంది. గతంలో 2016లో మొత్తం 2,64,270 పర్మిట్లలో భారతీయులకు 52,620 వీసాలు దక్కాయి.

కరోనా కాలం కంటే తక్కువగా.. మూడేళ్లలో కుప్పకూలిన గణాంకాలు!

భారత విద్యార్థుల వీసాలను తగ్గించేస్తున్న కెనడా!
భారత విద్యార్థుల వీసాలను తగ్గించేస్తున్న కెనడా!

టొరంటోకు చెందిన వాంటేజ్ ఇమ్మిగ్రేషన్ లా ప్రిన్సిపల్ లాయర్ రాఘవ్ జైన్ ఈ గణాంకాలను విశ్లేషిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. 2017లో భారత విద్యార్థులకు 82,935 స్టడీ పర్మిట్లు జారీ కాగా, 2026 మూడో త్రైమాసికం ముగిసే నాటికి ఆ సంఖ్య కేవలం 51,900 వద్దే ఆగిపోయిందని ఆయన గుర్తు చేశారు. "కోవిడ్ మహమ్మారి తీవ్రంగా ప్రభావం చూపిన 2020లో కూడా భారత విద్యార్థులకు 80,870 స్టడీ పర్మిట్లు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే దశాబ్ద కాలంలోనే అత్యల్ప వార్షిక గణాంకాల దిశగా కెనడా పయనిస్తోంది," అని రాఘవ్ జైన్ పేర్కొన్నారు.

"భారత విద్యార్థులకు జారీ చేసే స్టడీ పర్మిట్లలో ఈ భారీ తగ్గుదల ఒకవైపు కెనడా అనుసరిస్తున్న కఠిన వలస విధానాలను, మరోవైపు అంతర్జాతీయ విద్యా గమ్యస్థానంగా ఆ దేశం ఆకర్షణ కోల్పోతోందన్న వాస్తవాన్ని ప్రతిబింబిస్తోంది," అని ఆయన విశ్లేషించారు. నిజానికి 2023లో కెనడాకు భారత విద్యార్థుల తాకిడి రికార్డు స్థాయిలో నమోదైంది; ఆ ఏడాది జారీ అయిన మొత్తం 6,80,620 స్టడీ పర్మిట్లలో భారతీయులు ఏకంగా 2,77,135 పర్మిట్లు దక్కించుకున్నారు. ఆ తర్వాత ఏడాది అంటే 2024లో ఈ సంఖ్య దాదాపు సగానికి పడిపోయి, మొత్తం 5,14,570 పర్మిట్లలో భారతీయులకు 1,88,110 మాత్రమే దక్కాయి. గతేడాది (2025) పరిస్థితి మరింత దిగజారి మొత్తం 3,80,175 పర్మిట్లలో భారత విద్యార్థుల వాటా 93,660 కు కుదించుకుపోయింది.

వీసా తిరస్కరణలు, రెట్టింపైన ఖర్చుల భారం.. అసలు కారణాలివే!

దీనికి తోడు కెనడా ప్రభుత్వం స్టడీ పర్మిట్లపై పరిమితులు విధించింది. ఈ నెల ప్రారంభంలో ప్రకటించిన కొత్త ప్రణాళిక ప్రకారం ఏటా కేవలం 1,50,000 మంది అంతర్జాతీయ విద్యార్థులను మాత్రమే అనుమతించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు విద్యార్థులు చూపించాల్సిన కనీస జీవన వ్యయ నిధి నిబంధనను 2024 జనవరిలో ఉన్న 10,000 కెనడియన్ డాలర్ల నుంచి ఏకంగా 23,448 కెనడియన్ డాలర్లకు పెంచారు! రూపాయి మారకం విలువ ఒడిదుడుకుల నడుమ, ఒక్కసారిగా రెట్టింపు కంటే ఎక్కువైన ఈ ఆర్థిక భారం తెలుగు రాష్ట్రాల మధ్యతరగతి కుటుంబాలకు పెను సవాలుగా మారింది.

వర్క్ పర్మిట్ నిబంధనల ఉచ్చు.. ముందున్నది గడ్డుకాలమే!

చదువు పూర్తయిన తర్వాత లభించే పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ (పీడీబ్ల్యూపీ) అర్హత నిబంధనలను కూడా కెనడా కఠినతరం చేసింది. పబ్లిక్-ప్రైవేట్ కళాశాలల భాగస్వామ్య కోర్సులలో చదివే విద్యార్థులకు వర్క్ పర్మిట్ అవకాశాలను తగ్గించడంతో పాటు, భాషా నైపుణ్య పరీక్షలు, చదివే కోర్సు విభాగాలపై కొత్త షరతులు విధించారు. "విదేశాల్లో చదువుకోవడానికి ఏ దేశాన్ని ఎంచుకోవాలన్న నిర్ణయంలో చదువు తర్వాత లభించే ఉద్యోగ అవకాశాలనే భారత విద్యార్థులు కీలకంగా భావిస్తారు. తాజా ఆంక్షలు వారిని మరింత నిరుత్సాహపరిచే అవకాశం ఉంది," అని జైన్ వివరించారు.

భారత విద్యార్థులకు రాబోయే రోజుల్లోనూ కెనడా ప్రయాణం సవాలుగానే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. "భారత విద్యార్థులు కెనడాలో చదవాలనుకుంటున్నారా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్న కాదు; వారు అక్కడ చదవకుండా కెనడానే పరిస్థితులను ఎంత కఠినతరం చేస్తోందన్నదే అసలు ప్రశ్న," అని రాఘవ్ జైన్ ముగించారు.

భారీ అప్పులు చేసి విదేశీ విద్యకు సిద్ధమవుతున్న తెలుగు విద్యార్థులు, మారిన నిబంధనలు, ఉద్యోగ అవకాశాలను క్షుణ్ణంగా బేరీజు వేసుకున్నాకే నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం.

 

ABOUT THE AUTHOR

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks