Study in Sweden : హైదరాబాద్​లో ‘స్టడీ ఇన్ స్వీడన్’ ఫెయిర్- తెలుగు విద్యార్థులకు దక్కే ప్రయోజనాలు ఇవి..

భారతీయ విద్యార్థులకు స్వీడన్‌లో మాస్టర్స్ చదివే అవకాశాలను అందిస్తూ స్వీడన్ రాయబార కార్యాలయం 'స్టడీ ఇన్ స్వీడన్ 2026' ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను ప్రకటిచింది. అక్టోబర్ 30న హైదరాబాద్‌లో జరగనున్న ఈ మేళాలో 13 ప్రముఖ స్వీడిష్ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొననున్నారు. పూర్తి వివరాలు..

Published on: Oct 27, 2026, 10:01:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించి అంతర్జాతీయ స్థాయిలో కెరీర్​ను ఎంచుకోవాలనుకునే తెలుగు విద్యార్థులకు అద్భుతమైన అవకాశం తలుపుతట్టింది! సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) విభాగాల్లో ఉన్నత విద్యను అందించడంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న స్వీడన్ దేశం.. భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రత్యేక విద్యా మేళాను ప్రవేశపెట్టింది.

హైదరాబాద్​లో స్టడీ ఇన్ స్వీడన్ ఫెయిర్ వివరాలు..
హైదరాబాద్​లో స్టడీ ఇన్ స్వీడన్ ఫెయిర్ వివరాలు..

భారత్‌లోని స్వీడన్ రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ‘స్టడీ ఇన్ స్వీడన్ 2026’ పేరుతో ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ జరగనుంది. దేశ రాజధాని దిల్లీలో అక్టోబర్ 28న, హైదరాబాద్‌లో అక్టోబర్ 30న ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. లండ్ యూనివర్సిటీ, కేటీహెచ్ రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, లింకోపింగ్ యూనివర్సిటీ వంటి స్వీడన్‌కు చెందిన 13 ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల ప్రతినిధులు ఈ ఫెయిర్‌లో పాల్గొంటారు.

స్టడీ ఇన్ స్వీడన్- తెలుగు విద్యార్థులకు దక్కే ప్రయోజనాలు..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా వేలాది మంది అభ్యర్థులు విదేశీ విద్య కోసం యూరప్, అమెరికా బాట పడుతున్నారు. ఈ క్రమంలో యూరప్‌లోని అత్యంత సురక్షితమైన, ఇన్నోవేషన్‌కు మారుపేరైన స్వీడన్‌ను ఎంచుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయని ప్రతినిధులు చెబుతున్నారు.

ఈ ‘స్టడీ ఇన్ స్వీడన్’ ఫెయిర్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఈ కింది అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పిస్తారు:

కోర్సుల ఎంపిక: పీజీ/మాస్టర్స్ స్థాయిలో సరికొత్త స్టెమ్ కోర్సుల వివరాలు.

దరఖాస్తు విధానం: యూనివర్సిటీ ప్రవేశాలు, కావాల్సిన అర్హతలు.

రెసిడెన్స్ పర్మిట్ ప్రక్రియ: స్టూడెంట్ వీసా, నివాస అనుమతుల పొందే సులువైన మార్గాలు.

పరిశోధనలు అండ్ ఉద్యోగాలు: డిగ్రీ పూర్తయిన తర్వాత స్వీడన్‌లో పరిశోధన అవకాశాలు, అక్కడి పారిశ్రామిక రంగాలు ఇచ్చే ఉద్యోగ అవకాశాలు.

విద్య కోసం స్వీడన్​ని ఎందుకు ఎంచుకోవాలి?

ఈ విద్యా మేళాల ప్రాధాన్యత గురించి భారత్‌లోని స్వీడన్ రాయబారి పేట్రా మెనాండర్ మాట్లాడుతూ.. స్వీడన్ విద్యావిధానం విద్యార్థుల్లో సృజనాత్మకతను, విమర్శనాత్మక ఆలోచనను పెంచుతుందని తెలిపారు.

"భవిష్యత్తులో ప్రపంచం ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే స్వీడన్ విద్యా విధానం లక్ష్యం! ఈ విద్యా మేళాలు భారతీయ విద్యార్థులకు అత్యుత్తమ స్వీడిష్ విశ్వవిద్యాలయాలతో నేరుగా మాట్లాడే వేదికను అందిస్తాయి. భారత్ - స్వీడన్ భాగస్వామ్యంలో విద్యార్థుల కదలిక ఎంతో కీలకమైనది. ఈ ఫెయిర్ ద్వారా మరింత మంది భారతీయ విద్యార్థులు స్వీడన్ వచ్చి తమ ఉన్నత విద్యను పూర్తి చేసుకుంటారని, రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని నేను ఆశిస్తున్నాను," అని పేట్రా మెనాండర్ స్పష్టం చేశారు.

'ట్రిపుల్ హెలిక్స్' మోడల్ ప్రత్యేకత..

స్వీడన్ ఉన్నత విద్యలో ‘ట్రిపుల్ హెలిక్స్’ విధానం అత్యంత కీలకమైనది. ఈ మోడల్ ద్వారా విద్యాసంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వం ఒకే తాటిపైకి వచ్చి రీసెర్చ్ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహిస్తాయి. దీనివల్ల చదువుకుంటున్న సమయంలోనే విద్యార్థులు నేరుగా కంపెనీ ప్రాజెక్టులపై పనిచేస్తూ ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించవచ్చు.

2026 మే మాసంలో భారత్, స్వీడన్ దేశాల మధ్య కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకారం సైన్స్, టెక్నాలజీ, గ్రీన్ ఇన్నోవేషన్, విద్యార్థులు, పరిశోధకుల మార్పిడికి ఇరుదేశాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి.

స్వీడన్‌లో మాస్టర్స్ చదవాలనుకునే హైదరాబాద్, పరిసర ప్రాంతాల విద్యార్థులు అక్టోబర్ 30న జరిగే ఈ సదస్సును వినియోగించుకోవాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More