Ola Electric : ఓలా ఎలక్ట్రిక్ ఉద్యోగులకు షాక్! 5శాతం మంది లేఆఫ్..
పునర్నిర్మాణ చర్యల్లో భాగంగా సంస్థలోని 5 శాతం సిబ్బందిని తొలగిస్తున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. మరోవైపు సమయంలో కంపెనీ కొత్త సీఎఫ్‌ఓగా దీపక్ రస్తోగి బాధ్యతలు చేపట్టారు. ఇక 'ఓలా శక్తి' బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్‌కు బీఐఎస్ గుర్తింపు లభించింది.
భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. సంస్థను లాభాల బాట పట్టించేందుకు, పనితీరును మెరుగుపరిచేందుకు చేపట్టిన పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా.. సుమారు 5 శాతం మంది ఉద్యోగులపై వేటు వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
కస్టమర్ సర్వీస్‌పై దృష్టి.. ఆటోమేషన్‌కు ప్రాధాన్యం
వ్యాపారాన్ని గాడిలో పెట్టడమే తమ ప్రధాన లక్ష్యమని ఓలా ఎలక్ట్రిక్ ఒక ప్రకటనలో తెలిపింది. "హైపర్ సర్వీస్ ద్వారా కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వస్తున్న సర్వీస్ రిక్వెస్ట్‌లలో 80 శాతానికి పైగా అభ్యర్థనలను అదే రోజు పరిష్కరిస్తున్నాం. ఫ్రంట్ ఎండ్ కార్యకలాపాల్లో ఆటోమేషన్‌ను పెంచడం ద్వారా పనితీరులో వేగం, క్రమశిక్షణను మరింత పటిష్టం చేస్తున్నాం," అని సంస్థ పేర్కొంది.
ప్రస్తుతం కొనసాగుతున్న ఈ నిర్మాణ మార్పుల వల్ల సుమారు 5 శాతం మంది సిబ్బంది ప్రభావితం అవుతారని కంపెనీ తెలిపింది.
"వినియోగదారులకు అత్యుత్తమ అనుభవాన్ని అందించడంతో పాటు సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడం, దీర్ఘకాలిక లాభదాయక వృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం," అని ఓలా ఎలక్ట్రిక్ వివరించింది.
సాఫ్ట్‌బ్యాంక్ మద్దతు ఉన్న ఈ సంస్థలో చివరిసారిగా 2025 మార్చిలో ఉద్యోగాల కోత విధించారు.
ఇప్పటి వరకు లాభాల్లోకి రాని ఓలా ఎలక్ట్రిక్, 2026 ఆర్థిక సంవత్సరంలో విక్రయాల పరంగా కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఏథర్ ఎనర్జీతో పాటు టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో వంటి దిగ్గజాల నుంచి ఓలాకు గట్టి పోటీ ఎదురవుతోంది.
కొత్త సీఎఫ్‌ఓగా దీపక్ రస్తోగి
కంపెనీ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) పదవిలో మార్పులు చోటుచేసుకున్నాయి. హరీష్ అభిచందాని తన పదవికి రాజీనామా చేయడంతో, ఆయన స్థానంలో దీపక్ రస్తోగిని కొత్త సీఎఫ్‌ఓగా నియమించారు. జనవరి 19, 2025న జరిగిన బోర్డు సమావేశంలో రస్తోగి నియామకానికి ఆమోదం లభించింది. ఆయన జనవరి 20, 2026 నుంచి సీఎఫ్‌ఓగా, అలాగే కీలక మేనేజీరియల్ బాధ్యతలను చేపట్టారు.
'ఓలా శక్తి'కి బీఐఎస్ గుర్తింపు
మరోవైపు ఇంధన నిల్వ రంగంలో ఓలా ఒక ముందడుగు వేసింది. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన 'ఓలా శక్తి' బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్)కు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నుంచి సర్టిఫికేషన్, లైసెన్స్ లభించినట్లు జనవరి 16న ప్రకటించింది. ఇది 6 కేడబ్ల్యూ/9.1 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో ఓలా సొంతంగా అభివృద్ధి చేసిన '4680 భారత్ సెల్' సాంకేతికతతో పనిచేస్తుంది. పూర్తిస్థాయిలో భారత్‌లోనే డిజైన్ చేసి, తయారైన మొదటి రెసిడెన్షియల్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ఇదే కావడం విశేషం.
ఈ సర్టిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఓలా శక్తి అనేక కఠినమైన పరీక్షలను ఎదుర్కొంది. షార్ట్ సర్క్యూట్, ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్, అగ్నిప్రమాదాలు, థర్మల్ భద్రత, విద్యుత్ ఘాతాల నుంచి రక్షణ వంటి ఎలక్ట్రికల్, మెకానికల్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. అలాగే పర్యావరణ ఒత్తిడి పరీక్షలు, శబ్ద కాలుష్య అంచనాలు కూడా బిఐఎస్ నిబంధనల ప్రకారం నిర్వహించారు.
"శక్తి 9.1కేడబ్ల్యూహెచ్‌కి బీఐఎస్ గుర్తింపు రావడం మా ప్రయాణంలో ఒక మైలురాయి. త్వరలోనే ఇళ్లకు కావాల్సిన మొదటి బ్యాటరీ యూనిట్లను డెలివరీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. భారతదేశం ఇంధనాన్ని వినియోగించే, నిల్వ చేసే విధానాన్ని ఇది మార్చేస్తుంది," అని సంస్థ ప్రతినిధి తెలిపారు.
ఇది ఇళ్లకు, వ్యవసాయానికి, వ్యాపార సంస్థలకు సరసమైన ధరలో నమ్మకమైన ఇంధన పరిష్కారాలను అందిస్తుందని, దేశం ఇంధన రంగంలో స్వయంప్రతిపత్తి సాధించే దిశగా ఇది ఒక కీలక అడుగు అని ఆయన పేర్కొన్నారు. ఓలా శక్తి ఆటోమోటివ్ గ్రేడ్ భద్రతను అందించడమే కాకుండా, మెయింటెనెన్స్ ఖర్చు లేకుండా అధిక పనితీరును కనబరుస్తుందని సంస్థ వెల్లడించింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


