హరియాణాలోని గురుగ్రామ్ వీధుల్లో "రోడ్ రేజ్" ఉన్మాదం తీవ్ర కలకలం రేపింది! నగరంలోని అత్యంత రద్దీగా ఉండే గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ప్రశాంతంగా బైక్ నడుపుతున్న ఒక మహిళా రైడర్‌ను కారుతో ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచిన దారుణ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఆ మహిళను వెనుక నుంచి ఛేజ్ చేసి, ఢీకొట్టిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ తరహా ఘటనలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న నేపథ్యంలో బైకర్ల రక్షణపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అసలేం జరిగింది? నిందితుల సైకో ప్రవర్తన!

బాధితురాలు సియా తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం ఆమె తన స్నేహితులతో కలిసి ‘అప్రిలియా’ స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణిస్తుండగా ఒక తెల్లటి సెడాన్ కారు ఆమెను అనుసరించడం ప్రారంభించింది. కారులో ఉన్న వ్యక్తులు మద్యం మత్తులో తూగుతూ, బైక్‌ను ఆపమంటూ సైగలు చేస్తూ ప్రమాదకరంగా దగ్గరకు వచ్చారు.
"వాళ్లు మద్యం మత్తులో ఉన్నారు. నన్ను ఇబ్బంది పెడుతుంటే దూరంగా వెళ్లమని కోరాను. నా స్నేహితుడు నన్ను రక్షించేందుకు కారుకు అడ్డంగా వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ, సడన్‌గా వచ్చి నా బైక్‌ను కారుతో గట్టిగా ఢీకొట్టారు," అని సియా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.
కారు గట్టిగా ఢీకొట్టడంతో ఆమె బైక్ రోడ్డుపై కొద్ది దూరం వరకు ఈడ్చుకెళ్లింది. బైకర్ల హెల్మెట్ కెమెరాల్లో ఈ దారుణ దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్నేహితులు ఆ కారును తదుపరి సిగ్నల్ వద్ద ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ, డ్రైవర్ స్పీడ్ పెంచి పారిపోయాడు.
"ఈ రోజు గురుగ్రామ్ రోడ్లపై నాకు రక్షణ లేదనిపించింది. మనుషులను ఢీకొట్టి పారిపోవడానికి ఇటువంటి వారికి కొంచెమైనా భయం లేదు," అని బాధితురాలు తన ఇన్‌స్టా పోస్ట్‌లో అభిప్రాయపడింది.
ఒళ్లుగగుర్పొడిచే విధంగా ఉన్న ఈ వైరల్ వీడియోని ఇక్కడ చూడండి :
{{/usCountry}}ఒళ్లుగగుర్పొడిచే విధంగా ఉన్న ఈ వైరల్ వీడియోని ఇక్కడ చూడండి :
{{/usCountry}}పోలీసుల స్పందన.. ఎఫ్‌ఐఆర్ నమోదుకు కసరత్తు
మహిళా బైకర్ని కారు ఢీకొట్టిన ఘటనపై గురుగ్రామ్ పోలీస్ పీఆర్‌ఓ సందీప్ తురాన్ స్పందించారు. "గోల్ఫ్ కోర్స్ రోడ్డులోని ప్రమాద ప్రాంతం, వీడియో దృశ్యాలను ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి నుంచి ఇప్పటివరకు ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదు. ఆమెను సంప్రదించి ఫిర్యాదు తీసుకున్న వెంటనే కారు డ్రైవర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేస్తాం," అని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో సియా షేర్ చేసిన కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
రోడ్ రేజ్ ఘటనల నుంచి ఎలా రక్షించుకోవాలి?
మెట్రో నగరాల్లో ఇలాంటి రోడ్ రేజ్ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, బైకర్లు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కొన్ని కీలక జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవి..
సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి: ఎవరైనా మిమ్మల్ని వేధిస్తున్నట్లు అనిపిస్తే వెంటనే పెట్రోల్ బంక్, పోలీస్ స్టేషన్ లేదా జనాలు ఎక్కువగా ఉండే వాణిజ్య ప్రాంతాల వైపు బైక్ మళ్లించండి.
గొడవలకు దిగొద్దు: ఎదుటివారు ఎంత రెచ్చగొట్టినా గొడవకు దిగకూడదు. సైగలు చేయడం, వాదించడం వల్ల పరిస్థితి మరింత దారి తప్పుతుందని గుర్తించుకోవాలి.
వాహనానికి దారి ఇవ్వండి: రోడ్డుపై వికృతంగా ప్రవర్తించే డ్రైవర్లు కనిపిస్తే బైక్ వేగాన్ని తగ్గించి, వారికి దారి ఇవ్వడమే సురక్షితమైన మార్గం.
సాక్ష్యాలు రికార్డ్ చేయండి: యాక్షన్ కెమెరాలు ధరించడం వల్ల ప్రమాద దృశ్యాలు రికార్డు అయ్యి చట్టపరంగా ఉపయోగపడతాయి. అత్యవసర వేళ 112 నంబర్‌కు కాల్ చేయండి.