...
...
Next Story

చిరిగిన చొక్కాతో మొదలై.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వరకు! మహారాష్ట్ర రైతు అద్భుత ప్రస్థానం..

ఒకప్పుడు కనీసం బట్టలు కొనుక్కోలేని పేదరికం నుంచి నేడు రూ. 15 కోట్ల వార్షిక టర్నోవర్ గల పౌల్ట్రీ సామ్రాజ్యాన్ని నిర్మించిన మహారాష్ట్ర రైతు రవీంద్ర మేట్కర్ కథ ఇది. తన అసాధారణ కృషితో సాధించిన విజయాలను వివరించేందుకు ఆయనకు ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది.

Published on: Mar 20, 2026, 15:30:51 IST
Advertisement

ఒకప్పుడు కనీసం తనకంటూ కొత్త బట్టలు కొనుక్కునే స్తోమత లేని ఒక సాధారణ రైతు, పట్టుదలతో కోట్లాది రూపాయల టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగారు! తన పౌల్ట్రీ వ్యాపార అనుభవాలను, అగ్రి-ఎంట్రప్రెన్యూర్ (వ్యవసాయ పారిశ్రామికవేత్త)గా తన ప్రయాణాన్ని వివరించేందుకు ఆయనకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది.

Representative image. (Reuters/X)
Representative image. (Reuters/X)

రండి.. ఆ వ్యక్తి గురించి, ఆ శక్తి గురించి ఇక్కడ తెలుసుకుందాము..

ఆక్స్‌ఫర్డ్ పిలుపు..

మహారాష్ట్రలోని అమరావతి జిల్లా, మసాలా అంజన్‌గావ్ బారి గ్రామానికి చెందిన 57 ఏళ్ల రవీంద్ర మాణిక్రావు మేట్కర్, మే 1 నుంచి 5 వరకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో జరగనున్న ‘గ్లోబల్ రీసెర్చ్ కాన్ఫరెన్స్’లో ప్రసంగించనున్నారు. ఈ ఏడాది ఈ సదస్సును "AI for Every Mind" అనే థీమ్‌తో గ్లోబల్ ఎకనామిక్ ఫోరమ్ నిర్వహిస్తోంది. భారతీయ వ్యవసాయ పారిశ్రామికవేత్తగా ఆయన అందించిన సహకారం, అనుభవాలు ఈ చర్చల్లో ఎంతో విలువైనవని నిర్వాహకులు తమ ఆహ్వాన లేఖలో పేర్కొన్నారు.

ఇంటి మిద్దె మీద ప్రారంభమైన ప్రయాణం..

రవీంద్ర మేట్కర్ తండ్రి అటవీ శాఖలో నాలుగో తరగతి ఉద్యోగి. 1984లో రవీంద్ర జూనియర్ కాలేజీ చదువుతున్న సమయంలోనే తన ఇంటి మిద్దె మీద పౌల్ట్రీ వ్యాపారాన్ని ప్రారంభించారు. అప్పట్లో తండ్రి ఇచ్చిన రూ. 3,000 పెట్టుబడితో కేవలం 100 కోళ్లతో ఆ చిన్న ఫామ్ మొదలైంది.

కామర్స్ పూర్తి చేసిన తర్వాత, ఆయన తల్లికి వారసత్వంగా వచ్చిన 4 ఎకరాల భూమిని అమ్మి, బాద్నెరాలో ఒక ఎకరం భూమిని కొనుగోలు చేశారు. పీటీఐ వార్తా సంస్థతో రవీంద్ర మాట్లాడుతూ.. ఆ తర్వాత రూ. 5 లక్షల బ్యాంక్ రుణం తీసుకుని 4,000 కోళ్లతో వ్యాపారాన్ని విస్తరించినట్లు తెలిపారు. 2006 నాటికి ఆయన పౌల్ట్రీ ఫామ్ 10 ఎకరాలకు, కోళ్ల సంఖ్య 20,000కు చేరుకుంది.

బర్డ్ ఫ్లూ దెబ్బ.. మళ్లీ మొదలైన పోరాటం!

ప్రస్తుతం రవీంద్ర మేట్కర్ వ్యాపారం 50 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆయన ఫామ్‌లో 1.8 లక్షల కోళ్లు ఉన్నాయి.

టర్నోవర్: ఏడాదికి రూ. 15 కోట్ల ఆదాయం.

అప్పుల్లేవు: ప్రస్తుతం ఆయనపై ఎటువంటి బ్యాంక్ అప్పులు లేవు.

బహుళ పంటలు: పౌల్ట్రీతో పాటు అరటి, మామిడి, నారింజ, కొబ్బరి, బత్తాయి వంటి పండ్ల తోటలను, గోధుమ, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేస్తున్నారు.

సేంద్రియ ఎరువులు వాడుతూ, సహజ సిద్ధమైన వ్యవసాయ పద్ధతుల ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఎలా గడించవచ్చో ఆయన నిరూపించారు. ఆయన కుటుంబం మొత్తం ఈ వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారు.

అంతర్జాతీయ వేదికలపై ప్రసంగాలు..

రవీంద్ర మేట్కర్ ఇప్పటికే సింగపూర్ యూనివర్సిటీ, ఐఐటీ భిలాయ్, జమ్ములోని షేర్-ఎ-కాశ్మీర్ యూనివర్సిటీ, నాగ్‌పూర్‌లోని మేఫ్సు (MAFSU), ఐకార్ (ICAR) వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రసంగించారు.

"ఒకప్పుడు నాకు కనీసం సరైన బట్టలు లేవు, ఇంట్లో కుట్టిన చిరిగిన బట్టలు వేసుకునేవాడిని. కాలేజీకి వెళ్లడానికి సైకిల్ కూడా ఉండేది కాదు. అలాంటిది ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లి నా విజయగాథను చెబుతానని కలలో కూడా ఊహించలేదు," అని రవీంద్ర ఆనందంగా చెప్పారు.

ప్రస్తుతం ఆయన తన పౌల్ట్రీ విస్తరణను ఆపి, తోటి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ వారి ఎదుగుదలకు తోడ్పడుతున్నారు.

మరి మీ సక్సెస్​ కోసం మీరు దేని గురించి ఎదురుచూస్తున్నారు?

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks