Sports University : తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Telangana Sports University : తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. అన్ని సౌకర్యాలతో స్పోర్ట్ యూనివర్సిటీ నిర్మాణాలు ఉండాలని చెప్పారు.
ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా తెలంగాణలో అన్ని సౌకర్యాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యమిచ్చేలా, ఒలంపిక్స్‌లో రాష్ట్ర క్రీడాకారులు సత్తా చాటడమే లక్ష్యంగా క్రీడా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు.

క్రీడలకు అవసరమైన మైదానాలు, యూనివర్సిటీ, శిక్షణ తదితర అంశాలపై క్రీడాశాఖకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. రాష్ట్రంలో తలపెట్టిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన మైదానాలతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించడంపై చర్చించారు.
ఈ సందర్భంగా నిర్మాణాలకు సంబంధించిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు.
గచ్చిబౌలి ఔట్‌డోర్ స్టేడియాన్ని పునరుద్ధరించడంతోపాటు స్టేడియం ఆవరణలో ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, అన్ని రకాల క్రీడా మైదానాలు, శిక్షణకు అవసరమైన ఇతర సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్ నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఎల్బీ స్టేడియం, సరూర్‌నగర్ స్టేడియంలను భవిష్యత్ అవసరాలు, క్రీడాకారులకు శిక్షణ, పోటీలకు అనుగుణంగా ఆధునీకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
'అన్ని సౌకర్యాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణాలు చేయాలి. ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటేలా చర్యలు ఉండాలి. కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి స్టేడియాన్ని ఆధునీకరించాలి. అదేవిధంగా గచ్చిబౌలి ఔట్ డోర్ స్టేడియాన్ని పునరుద్ధరించాలి.' అని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ జి.కిషోర్‌తోపాటుగా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


