Lashkar e taiba : దేశవ్యాప్తంగా పేలుళ్లకు లష్కరే తోయిబా ఉగ్ర కుట్ర! నిఘా వర్గాలు హై అలర్ట్..
భారతీయులను తీవ్ర ఆందోళనకు గురిచేసే వార్త! దేశ రాజధాని దిల్లీతో పాటు ఇండియావ్యాప్తంగా బాంబు పేలుళ్లు జరపాలని నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో నిఘా వర్గాలు హై అలర్ట్‌లో ఉన్నాయి.
దేశ రాజధాని దిల్లీలో మరోసారి ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈడీ), చారిత్రక ఎర్రకోటతో పాటు చాంద్నీ చౌక్‌లోని ప్రముఖ దేవాలయం, దేశంలోని ఇతర ప్రధాన ఆధ్యాత్మిక క్షేత్రాలపై బాంబు దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

నిఘా సంస్థల నివేదికల ప్రకారం.. ఈ ఉగ్రవాద ముఠా ఐఈడీ ఉపయోగించి పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉంది. ఈ హెచ్చరికలతో భద్రతా దళాలు హై అలర్ట్ ప్రకటించాయి.
పగ తీర్చుకోవడమే లక్ష్యమా?
ఈ కుట్ర వెనుక పాకిస్థాన్‌లో జరిగిన ఒక ఘటన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఒక మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 31 మంది మరణించగా, 160 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు ప్రతీకారంగానే భారత్‌లోని ప్రముఖ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని లష్కరే యోచిస్తున్నట్లు వర్గాలు వెల్లడించాయి.
గత సంఘటనల నేపథ్యంలో ఆందోళన..
గతేడాది నవంబర్ 10న ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటన మరువకముందే ఈ కొత్త హెచ్చరికలు రావడం కలకలం రేపుతోంది. ఆనాటి ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు వైద్యులు కీలక పాత్ర పోషించినట్లు తేలింది.
నవంబర్ 10 నాటి ఘటన వివరాలు:
పేలుడు ప్రాంతం: ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న కారు పేలిపోయింది.
నిందితుడు: ఫరీదాబాద్‌లోని అల్-ఫలా యూనివర్సిటీలో డాక్టర్‌గా పనిచేస్తున్న ఉమర్ మొహమ్మద్ ఆ కారును నడిపినట్లు డీఎన్ఏ పరీక్షల్లో తేలింది.
కారణం: అదే రోజు హరియాణాలోని ఫరీదాబాద్‌లో 2,900 కేజీల భారీ పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన సహచర వైద్యులు డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ ఆదిల్ రాథర్ అరెస్ట్ కావడంతో భయాందోళనకు గురైన ఉమర్, పథకం ప్రకారం కాకుండా ముందే పేలుడుకు పాల్పడ్డాడు.
భద్రత కట్టుదిట్టం..
ప్రస్తుత ముప్పు నేపథ్యంలో దిల్లీ పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అప్రమత్తమయ్యాయి. ఎర్రకోట, చాంద్నీ చౌక్ వంటి రద్దీ ప్రాంతాల్లో నిఘాను ముమ్మరం చేశారు. అనుమానిత వ్యక్తులు లేదా వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
గ్యాంగ్‌స్టర్స్‌పై ఫోకస్..!
జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను లక్ష్యంగా చేసుకుని ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలు, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రమూలకాలు దాడులకు పాల్పడవచ్చు అని గత నెలలోనే నిఘా సంస్థలు గట్టి హెచ్చరికలు జారీ చేశాయి.
ముఖ్యంగా పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్లు ఇప్పుడు విదేశాల్లోని ఖలిస్తానీ హ్యాండ్లర్లకు 'ఫుట్ సోల్జర్స్' (క్షేత్రస్థాయి కార్యకర్తలు)గా మారుతున్నారని నిఘా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
విదేశాల్లో తలదాచుకుంటున్న ఖలిస్తానీ, తీవ్రవాద సానుభూతిపరులు భారత అంతర్గత భద్రతను దెబ్బతీయడానికి స్థానిక నేరగాళ్లను వాడుకుంటున్నారని జనవరి 17న వెలువడిన ‘ఏఎన్‌ఐ’ నివేదిక పేర్కొంది.
పంజాబ్ కేంద్రంగా పనిచేస్తున్న గ్యాంగ్‌స్టర్లు ప్రస్తుతం హరియానా, దిల్లీ-ఎన్‌సీఆర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో చురుగ్గా ఉన్నారు. వీరు క్రమంగా ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పరుచుకుని, ఉగ్రవాదుల అజెండాను అమలు చేస్తున్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి.
స్థానిక నేర గ్యాంగ్‌లను వాడుకోవడం వల్ల ఉగ్రవాద దాడులను గుర్తించడం భద్రతా దళాలకు కష్టతరంగా మారుతోంది. ఈ నేరగాళ్లు కేవలం డబ్బు కోసం లేదా విదేశీ ప్రలోభాలకు లోబడి ఉగ్రవాదులకు సహకరిస్తున్నారు.
వీటన్నింటి మధ్య తాజాగా లష్కరే తోయిబా దాడులపై అలర్ట్ రావడం ఆందోళనలను మరింత పెంచుతోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


