T20 World Cup: పాక్‌కు దిమ్మతిరిగే షాక్.. శ్రీలంకపై గెలిచినా టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్.. ఇక ఫైనల్స్ ఇండియాలోనే
T20 World Cup: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. టీ20 ప్రపంచకప్ 2026లో ఆ టీమ్ సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. సూపర్ 8లో తన చివరి మ్యాచ్ లో శ్రీలంకపై గెలిచినా నెట్ రన్ రేట్ లో వెనుకబడి పాక్ ఇంటి ముఖం పట్టింది. దీంతో టోర్నీ ఫైనల్స్ ఇండియాలో జరగడం ఖాయమైంది.
ఇండియన్ ఫ్యాన్స్ కు నిరాశే. టీ20 ప్రపంచకప్ లో మరోసారి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఇండియా ఆడాలని, ఆ జట్టును మళ్లీ చిత్తు చేయాలని భారత అభిమానులు ఆశించారు. కానీ పాకిస్థాన్ సెమీస్ చేరకుండానే టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. సూపర్ 8లోనే ఇంటి ముఖం పట్టింది.

పాకిస్థాన్ ఔట్
టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ ప్రయాణం ముగిసింది. ఆ టీమ్ సూపర్ 8లోనే నిష్క్రమించింది. శనివారం (ఫిబ్రవరి 28) రాత్రి జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో శ్రీలంకపై పాకిస్థాన్ 5 పరుగుల తేడాతో గెలిచింది. కానీ నెట్ రన్ రేట్ లో వెనుకబడి సెమీస్ చేరే అవకాశాన్ని పాకిస్థాన్ దూరం చేసుకుంది. గ్రూప్ 2 నుంచి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీస్ కు క్వాలిఫై అయ్యాయి.
గ్రూప్-2 ఇలా
టీ20 ప్రపంచకప్ సూపర్ 8 గ్రూప్-2లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక ఉన్నాయి. ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ గెలిచిన ఇంగ్లాండ్ ఆరు పాయింట్లతో సెమీస్ చేరింది. ఇక న్యూజిలాండ్, పాకిస్థాన్ మూడు మ్యాచ్ ల్లో ఒక విజయం, ఒక ఓటమి, ఒక రద్దు (వర్షం కారణంగా)తో నిలిచాయి. చెరో మూడు పాయింట్లు సాధించాయి. కానీ పాకిస్థాన్ నెట్ రన్ రేట్ (-0.123) కంటే బెటర్ రన్ రేట్ (1.390)తో న్యూజిలాండ్ సెమీస్ కు అర్హత సాధించింది.
147 రన్స్ లోపే
శ్రీలంకతో మ్యాచ్ లో పాకిస్థాన్ ఫస్ట్ భారీ స్కోరు చేసింది. ఫర్హాన్ (100), ఫకర్ జమాన్ (84) చెలరేగడంతో పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 212 పరుగులు చేసింది. అయితే ఛేజింగ్ లో శ్రీలంకను 147 రన్స్ లోపే కట్టడి చేసి ఉంటే పాక్ సెమీస్ కు క్వాలిఫై అయ్యేది. కానీ శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 రన్స్ చేసింది. లంక కెప్టెన్ దాసున్ షనక (76 నాటౌట్), పవన్ రత్నాయకె (58) పాక్ ను ముంచేశారు.
ఫైనల్స్ ఇండియాలోనే
టీ20 ప్రపంచకప్ నుంచి పాక్ నిష్క్రమించడంతో ఇక ఫైనల్స్ కు ఇండియా ఆతిథ్యమివ్వడం ఖాయమైంది. ఒకవేళ పాక్ ఫైనల్ చేరితే ఆ టైటిల్ పోరు శ్రీలంకలో జరిగేది. ఈ పొట్టి కప్ టోర్నీకి ఇండియా, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాలో మ్యాచ్ లు ఆడేందుకు నిరాకరించిన పాక్ తన మ్యాచ్ లను శ్రీలంకలోనే ఆడింది. ఇప్పుడు పాక్ లేదు కాబట్టి ఇక ఫైనల్ ఇండియాలోని అహ్మదాబాద్ స్టేడియంలో జరుగుతుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


