వరుసగా మూడు డకౌట్లు.. అభిషేక్ శర్మపై పాకిస్థాన్ పేసర్ సంచలన వ్యాఖ్యలు.. ఆ ఆటగాడితో పోలుస్తూ.. ప్రతి బాల్ బాదలేవంటూ!
టీ20 ప్రపంచకప్ లో టీమిండియా విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ డకౌట్ గా పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ గురించి పాకిస్థాన్ వెటరన్ పేసర్ మహమ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాక్ ఆటగాడితో పోలుస్తూ కామెంట్లు చేశాడు.
టీ20 ప్రపంచకప్ లో భారీ హైప్ తో అడుగుపెట్టిన భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక్కటంటే ఒక్క రన్ చేయలేకపోతున్నాడు. ఈ పొట్టి కప్ లో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ అభిషేక్ డకౌట్ అయ్యాడు. దీంతో అతనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అభిషేక్ శర్మపై పాకిస్థాన్ వెటరన్ పేసర్ మహమ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

మూడు డకౌట్లు
టీ20 ప్రపంచకప్ 2026లో అభిషేక్ శర్మ మూడు మ్యాచ్ లు ఆడాడు. అమెరికా, పాకిస్థాన్, నెదర్లాండ్స్ తో మ్యాచ్ ల్లో బ్యాటింగ్ చేశాడు. కానీ ఒక్క రన్ కూడా చేయలేకపోయాడు. మూడు మ్యాచ్ ల్లోనూ సున్నాకే పెవిలియన్ చేరిపోయాడు. మొత్తం మీద మూడు మ్యాచ్ లు కలిపి 8 బాల్స్ మాత్రమే ఆడగలిగాడు.
టీ20 ప్రపంచకప్ లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఇండియా ఆటగాడిగా టాప్ లో ఉన్న ఆశిష్ నెహ్రా సరసన చేరి చెత్త రికార్డును అభిషేక్ శర్మ మూటగట్టుకున్నాడు.
మహమ్మద్ అమీర్ కామెంట్లు
పాకిస్తాన్ షో 'గేమ్ ఆన్ హై'లో మాట్లాడుతూ అభిషేక్ శర్మపై మహమ్మద్ అమీర్ కామెంట్లు చేశాడు. పాకిస్థాన్ ఓపెనర్ సయీం ఆయూబ్ తో అభిషేక్ ను పోల్చాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) లో మొదట్లో సయీం ఆయూబ్ ఇలాగే ఇబ్బంది పడ్డాడని అమీర్ తెలిపాడు.
‘‘కొన్ని సంవత్సరాల క్రితం సయీం PSL లో ఆడేటప్పుడు కూడా ఇదే సమస్య ఉండేది. అతను కొత్త షాట్లు ఆడేవాడు. నెవర్ లుక్ షాట్లు కొట్టేవాడు. అప్పుడు అతని వీక్ నెస్ ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎక్కువగా లెగ్ సైడ్ ఆడేవాడు. కానీ తర్వాత ఆఫ్ స్టంప్ అతని వీక్ నెస్ అని తెలిసింది. మూడు లేదా నాలుగో స్టంప్ లైన్ లో బౌలింగ్ చేస్తే సయీం ఇబ్బంది పడతాడు. తన చివరి రెండు మ్యాచ్ లలోనూ అతను ఆఫ్ సైడ్ లో ఆడుతూ ఔట్ అయ్యాడు’’ అని మహమ్మద్ అమీర్ పేర్కొన్నాడు.
అభిషేక్ కూడా అంతే
‘‘అభిషేక్ శర్మ కూడా అంతే. అతను ప్రతి బాల్ స్లాట్ లో ఉండాలని కోరుకుంటాడు. అప్పుడే అతను భారీ షాట్లు ఆడగలడు. కానీ పెద్ద టోర్నీల్లో లేదా వన్డేల్లో ప్రతి బంతిని బాదలేరు. సల్మాన్ అఘా (పాకిస్థాన్ కెప్టెన్), ఆర్యన్ దత్ (నెదర్లాండ్స్ స్పిన్నర్) ఒకేలాగా అభిషేక్ ను ఔట్ చేశారు. అది అభిషేక్ బలహీనతను చాటుతోంది. అతను తన గేమ్ ను మెరుగుపర్చుకోకపోతే బెటర్ కాలేడు. బలమైన బౌలర్లు ఎప్పుడూ మీ బలహీనతనలను పరీక్షిస్తారు. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు లాగుతారు’’ అని మహమ్మద్ అమీర్ తెలిపాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper












