...
...
Next Story

PAN application rules : పాన్​ కార్డ్​ కొత్త రూల్స్​- ఈ ఏప్రిల్​ 1 నుంచే అమలు.. మార్పులేంటి?

ఏప్రిల్ 1 నుంచి కేవలం ఆధార్‌తో పాన్ కార్డ్ పొందే సౌకర్యం నిలిచిపోనుంది. కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసినా లేదా పాత దానిలో మార్పులు చేయాలనుకున్నా అదనపు ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే పాన్ కార్డ్ ఫారాలు కూడా పూర్తిగా మారిపోనున్నాయి.

Published on: Mar 22, 2026, 10:45:26 IST
Advertisement

పాన్ (పర్మనెంట్​ అకౌంట్​ నెంబర్​) కార్డ్ దరఖాస్తుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేపట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి, అంటే ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించి ‘సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్’ సోషల్ మీడియా వేదికగా కీలక అప్‌డేట్స్ ఇచ్చింది. ఆ వివరాలు ఇవే:

పాన్​ కార్డ్​ దరఖాస్తులో ముఖ్యమైన మార్పులు ఇవే..

ఏప్రిల్​ 1 నుంచి పాన్​ కార్డ్​ దరఖాస్తులో మార్పులు..
ఏప్రిల్​ 1 నుంచి పాన్​ కార్డ్​ దరఖాస్తులో మార్పులు..

అదనపు పత్రాలు తప్పనిసరి: ప్రస్తుతం కేవలం ఆధార్ కార్డు ఉంటే పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఏప్రిల్ 1 నుంచి ఆధార్‌తో పాటు పుట్టిన తేదీ ధృవీకరణ కోసం అదనపు డాక్యుమెంట్లు సమర్పించాలి. కాబట్టి, సులభంగా ఆధార్‌తో పాన్ పొందాలనుకునే వారికి మార్చి 31, 2026 వరకు మాత్రమే చివరి అవకాశం అని గుర్తుపెట్టుకోవాలి.

ఆధార్ ప్రకారమే పేరు: కొత్త నిబంధనల ప్రకారం, పాన్ కార్డుపై పేరు కచ్చితంగా ఆధార్ కార్డులో ఉన్నట్టే ఉండాలి. ఒకవేళ మీ ఆధార్‌లో తప్పులు ఉంటే, ముందుగా వాటిని సరిచేసుకోవడం ఉత్తమం.

కొత్త అప్లికేషన్ ఫారాలు: ప్రస్తుతం వాడుకలో ఉన్న పాన్ ఫారాలను (ఉదాహరణకు ఫామ్ 49ఏ) ప్రభుత్వం రద్దు చేస్తోంది. వాటి స్థానంలో కొత్త ఫారాలు రానున్నాయి. ఏప్రిల్ 1 తర్వాత పాత ఫారాల్లో దరఖాస్తు చేస్తే వాటిని తిరస్కరిస్తారు.

ఏయే డాక్యుమెంట్లు అవసరం?

ఏప్రిల్ 1 నుంచి పుట్టిన తేదీ ధృవీకరణ కోసం కింది వాటిలో ఏదైనా ఒక పత్రం సమర్పించాల్సి ఉంటుంది:

పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం

ఓటరు గుర్తింపు కార్డు

డ్రైవింగ్ లైసెన్స్

టెన్త్ క్లాస్ మార్కుల మెమో

మెజిస్ట్రేట్ జారీ చేసిన అఫిడవిట్

జాగ్రత్త: ‘ఈ-పాన్’ మోసాల పట్ల అప్రమత్తం!

మరోవైపు ప్రభుత్వం ప్రజలను ఒక హెచ్చరిక కూడా చేసింది. పీఐబీ పేరుతో నకిలీ ఈమెయిల్స్ పంపిస్తూ, 'ఈ-పాన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండి' అని లింకులు పంపిస్తున్నట్లు గుర్తించారు. ఇవి ‘ఫిషింగ్’ ప్రయత్నాలని, అటువంటి లింకులను క్లిక్ చేస్తే మీ ఆర్థిక సమాచారం దొంగతనానికి గురయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. ఆదాయపు పన్ను శాఖ ఎప్పుడూ వ్యక్తిగత వివరాలను ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా అడగదని గుర్తుంచుకోవాలి.

తరచూ అడిగే ప్రశ్నలు-

ప్రశ్న 1: అసలు పాన్ కార్డ్ అంటే ఏంటి? అందులో ఉండే 10 అంకెల నంబర్ ప్రత్యేకత ఏంటి?

సమాధానం: పాన్ అనేది ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే 10 అంకెల విశిష్ట అల్ఫా-న్యూమరిక్ (అక్షరాలు, అంకెలు కలిసిన) సంఖ్య. ఇది ఒక వ్యక్తి లేదా సంస్థకు సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో మొదటి ఐదు అక్షరాలు, తర్వాత నాలుగు అంకెలు, చివరగా ఒక అక్షరం ఉంటాయి. ఈ నంబర్ జీవితకాలం మారుదు, మీరు ఒక నగరం నుంచి మరో నగరానికి మారినా లేదా ఉద్యోగం మారినా మీ పాన్ నంబర్ అదే ఉంటుంది.

ప్రశ్న 2: పాన్ కార్డ్ కేవలం ఆదాయపు పన్ను కట్టే వారికి మాత్రమే అవసరమా? దీని వల్ల కలిగే ఇతర ఉపయోగాలు ఏమిటి?

సమాధానం: లేదు, ఆదాయపు పన్ను కట్టని వారికి కూడా పాన్ కార్డ్ చాలా అవసరం. దీని ఉపయోగాలు అనేకం:

బ్యాంకింగ్: కొత్త బ్యాంక్ ఖాతా తెరవాలన్నా, రూ. 50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేయాలన్నా పాన్ తప్పనిసరి.

గుర్తింపు పత్రం: ఇది భారతదేశం అంతటా చెల్లుబాటు అయ్యే ఒక బలమైన ఫోటో గుర్తింపు కార్డు.

ఆస్తుల కొనుగోలు: ఇల్లు, స్థలం లేదా వాహనం కొనుగోలు చేసేటప్పుడు పాన్ కార్డ్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.

పెట్టుబడులు: షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది ప్రాథమిక అవసరం.

టీడీఎస్​ రీఫండ్: మీరు కట్టిన అదనపు పన్నును తిరిగి పొందాలన్నా పాన్ కార్డ్ ఉండాలి.

ప్రశ్న 3: ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉండవచ్చా? ఒకవేళ ఉంటే ఏమవుతుంది?

సమాధానం: చట్టప్రకారం ఒక వ్యక్తికి కేవలం ఒక్క పాన్ కార్డ్ మాత్రమే ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండటం నేరం. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 272B ప్రకారం, ఒకరి వద్ద ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉన్నట్లు గుర్తిస్తే రూ. 10,000 జరిమానా విధించే అవకాశం ఉంది. ఒకవేళ మీకు పొరపాటున రెండు కార్డులు ఉంటే, వెంటనే ఒక దానిని ఆదాయపు పన్ను శాఖకు సరెండర్ (వెనక్కి ఇచ్చేయడం) చేయడం ఉత్తమం.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe