పార్లమెంట్ శీతాకాల సమావేశాలు: ఇలా మొదలై, అలా వాయిదా పడిన లోక్‌సభ!
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. కాగా లోక్‌సభ మొదలైన కొద్దిసేపటికే లోక్‌సభలో గందరగోళం నెలకొంది. ఎస్ఐఆర్పై చర్చ జరపాలంటూ విపక్షాలు నిరసనకు దిగాయి. ఫలితంగా లోక్‌సభ కొద్దిసేపటికే వాయిదా పడింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో కేంద్రం 13 ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఎస్ఐఆర్ (ఓటర్ లిస్ట్ ప్రత్యేక సవరణ), దేశంలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం వంటి అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు కసరత్తులు చేస్తున్నాయి.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19 వరకు కొనసాగుతాయి. ఈ కాలంలో లోక్‌సభ, రాజ్యసభలో 15 సిట్టింగ్‌లు జరగనున్నాయి.
ఈ సమావేశంలో ఆమోదం పొందడానికి సిద్ధంగా ఉన్న కీలక బిల్లులను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
మొదటి నుంచే గందరగోళం..!
పార్లమెంట్ సమావేశాలు మొదలైన వెంటనే లోక్‌సభలో గందరగోళం నెలకొంది. ఎస్ఐఆర్పై చర్చ జరపాలని విపక్షాలు నిరసనకు దిగాయి. వారిని కూర్చోపెట్టేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించారు. విపక్ష ఎంపీల అరుపుల మధ్య ప్రస్తుతం లోక్‌సభ కొంతసేపు కొనసాగింది. ఆ తర్వాత లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
మరోవైపు రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణణ్కి సభలోకి స్వాగతం పలికారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి రాధాకృష్ణణ్ ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగారని, ఇది ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనం అని కొనియాడారు.
విపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన ప్రధాని..
అంతకుముందు, పార్లమెంట్ ఆవరణంలో మోదీ ప్రసంగించారు. ఈ క్రమంలో విపక్షాలపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొన్ని పార్టీలు బీహార్ ఎన్నికల ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఓటమిపై కోపాన్ని తీర్చుకునే యుద్ధభూమిగా లేదా గర్వాన్ని ప్రదర్శించే ప్రదేశంగా పార్లమెంట్ మారకూడదని ఆయన స్పష్టం చేశారు.
శీతాకాల సమావేశాలలో సభల పనితీరుకు విఘాతం కలిగించవద్దు అని ప్రతిపక్షాన్ని కోరిన ప్రధాని, వారు మెరుగ్గా ఎలా పని చేయాలో తాను చిట్కాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.
బీహార్ ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ నమోదు కావడం, మహిళల భాగస్వామ్యం ఆశను, విశ్వాసాన్ని పెంచుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. "ప్రపంచం దీనిని చాలా జాగ్రత్తగా చూస్తోంది. ప్రజాస్వామ్యం ఫలితాలను ఇవ్వగలదని భారత్ నిరూపించింది," అని ఆయన అన్నారు.
దేశం ఏ దిశగా వెళుతోంది? అనే దానిపై పార్లమెంట్ దృష్టి పెట్టాలని మోదీ వెల్లడించారు.
"ప్రతిపక్షం కూడా తమ బాధ్యతను నిర్వర్తించాలి. వారు ముఖ్యమైన సమస్యలను లేవనెత్తాలి. ఓటమి నిరాశ నుంచి బయటపడాలి. దురదృష్టవశాత్తు, కొన్ని పార్టీలు ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నాయి" అని కాంగ్రెస్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు పార్లమెంట్లో యువ, తొలిసారి ఎన్నికైన పార్లమెంట్ సభ్యులకు (ఎంపీలకు) మాట్లాడే అవకాశం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.
"యువ ఎంపీలు, తొలిసారి గెలిచిన ఎంపీలు తమ సామర్థ్యాలను ప్రదర్శించడానికి, తమ నియోజకవర్గాల గురించి మాట్లాడటానికి అవకాశం లభించడం లేదని చాలా బాధపడుతున్నారు. వారు దేశ పురోగతిలో పాలుపంచుకోవడానికి తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వారిని అలా చేయకుండా అడ్డుకుంటున్నారు," అని ప్రధాని మోదీ అన్నారు.
వారు ఏ పార్టీకి చెందినవారైనా సరే, తొలిసారి గెలిచిన ఎంపీలకు పార్లమెంట్లో మాట్లాడే అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రతిపక్షాన్ని ఉద్దేశిస్తూ పరోక్షంగా విమర్శలు చేస్తూ.. "'డ్రామా' చేయడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. వాటికి ఇక్కడ చోటు లేదు," అని తేల్చిచెప్పారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


