బ్యాంకింగ్ వ్యవస్థ మూలాలను కుదిపేసిన రూ. 17.29 కోట్ల నకిలీ కరెన్సీ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సంచలన నిర్ణయం తీసుకుంది. జగాధ్రి పీఎన్‌బీ కరెన్సీ చెస్ట్ మేనేజర్, కేసులో ప్రధాన నిందితుడైన అమిత్ కుమార్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ సాహరన్‌పూర్‌లోని సోఫియా మార్కెట్ పీఎన్‌బీ కరెన్సీ చెస్ట్‌లో భారీ స్థాయిలో కస్టడీలో ఉన్న నకిలీ నోట్లు బయటపడటంతో ఈ చర్యలు చేపట్టారు. సాధారణంగా సరిహద్దుల్లోనో లేదా రహస్య స్థావరాల్లోనో నకిలీ నోట్లు పట్టుబడతాయి. కానీ, ఏకంగా ఒక బ్యాంకు అధికారిక కరెన్సీ చెస్ట్‌లోనే రూ. కోట్లలో కల్తీ నోట్లు వెలుగుచూడటం కలకలం రేపింది.
ముగ్గురు అధికారులపై వేటు.. నేపాల్ పారిపోయేందుకు యత్నం?

ఈ దందాలో పీఎన్‌బీకి చెందిన ముగ్గురు కీలక అధికారుల ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సీనియర్ డివిజనల్ మేనేజర్ రవికుమార్ కాన్సే, సోఫియా మార్కెట్ కరెన్సీ చెస్ట్ మేనేజర్ సుశీల్ కుమార్, జగాధ్రి కరెన్సీ చెస్ట్ మేనేజర్ అమిత్ కుమార్‌లను బ్యాంకు యాజమాన్యం ఇప్పటికే సస్పెండ్ చేసింది. వీరు దేశం దాటి నేపాల్ పారిపోవచ్చనే అనుమానంతో అధికారులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇటీవల వీరి ఇళ్లలో ప్రత్యేక విచారణ బృందం (ఎస్ఐటీ), క్రైమ్ బ్రాంచ్ సోదాలు నిర్వహించి పలు కీలక ఎలక్ట్రానిక్ పరికరాలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది.
జూలై 6న ఏం జరిగింది? ఆర్బీఐ ఆఫీస్‌కు రూ. 111 కోట్లు
దర్యాప్తు అధికారులు కరెన్సీ రవాణా గొలుసును లోతుగా విశ్లేషిస్తున్నారు. జూలై 6న సాహరన్‌పూర్ కరెన్సీ చెస్ట్ నుంచి జైపూర్‌లోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కార్యాలయానికి రూ. 111 కోట్ల నగదును తరలించారు. అందులో రూ. 500 నోట్ల కట్టలు 1,900, రూ. 200 నోట్ల కట్టలు 800 ఉన్నాయి. అయితే, ఈ నగదు ప్యాకింగ్, రవాణా బాధ్యతలను ఒక పార్ట్ టైమ్ హౌస్ కీపింగ్ సిబ్బందికి అప్పగించినట్లు విచారణలో బయటపడటం గమనార్హం. ఈ క్రమంలోనే కల్తీ నోట్లు బ్యాంకు చెస్ట్‌లోకి ఏ దశలో ప్రవేశించాయనే దానిపై ఎన్‌ఐఏ దృష్టి సారించింది.
ఏటీఎంలు, మార్కెట్లలోకి నకిలీ నోట్లు? నేపాల్ హస్తంపై విచారణ
ఈ కరెన్సీ చెస్ట్ నుంచి గతంలోనే వివిధ బ్యాంకు శాఖలకు, ఏటీఎంలకు నకిలీ నోట్లు సరఫరా అయ్యాయా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఎంతమొత్తంలో నకిలీ నోట్లు మార్కెట్లోకి ప్రవేశించాయనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆగస్టు 29న సదర్ బజార్ పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 178 కింద నమోదైన కేసును, సెప్టెంబర్ 3న ఎన్‌ఐఏ తన చేతికి తీసుకుంది. ఈ కుట్ర వెనుక నేపాల్ సరిహద్దు ముఠాల ప్రమేయం ఉందా అనే కోణంలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. "నిందితుల ఇళ్ల సోదాల్లో కీలక ఆధారాలు లభించాయి" అని సాహరన్‌పూర్ ఎస్ఎస్పీ అభినందన్ తెలిపారు.
{{/usCountry}}ఈ కరెన్సీ చెస్ట్ నుంచి గతంలోనే వివిధ బ్యాంకు శాఖలకు, ఏటీఎంలకు నకిలీ నోట్లు సరఫరా అయ్యాయా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఎంతమొత్తంలో నకిలీ నోట్లు మార్కెట్లోకి ప్రవేశించాయనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆగస్టు 29న సదర్ బజార్ పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 178 కింద నమోదైన కేసును, సెప్టెంబర్ 3న ఎన్‌ఐఏ తన చేతికి తీసుకుంది. ఈ కుట్ర వెనుక నేపాల్ సరిహద్దు ముఠాల ప్రమేయం ఉందా అనే కోణంలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. "నిందితుల ఇళ్ల సోదాల్లో కీలక ఆధారాలు లభించాయి" అని సాహరన్‌పూర్ ఎస్ఎస్పీ అభినందన్ తెలిపారు.
{{/usCountry}}