ఒక్క రాత్రిలో బెంగళూరుగా మారదు.. బాంకీపూర్‌ విజేత ప్రశాంత్ కిశోర్

బిహార్ బాంకీపూర్ శాసనసభ ఉపఎన్నికలో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ సంచలన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్‌పై 19,324 ఓట్ల మెజారిటీతో గెలుపొంది, తన రాజకీయ అరంగేట్రంలోనే బోణీ కొట్టారు.

Published on: Aug 3, 2026, 21:41:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎన్నికల వ్యూహకర్తగా సుపరిచితుడైన జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (పీకే) ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రంలోనే తన సత్తా చాటారు. బిహార్‌లోని బీజేపీ బలమైన కోటగా పేరుగాంచిన బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఆయన ఘనవిజయాన్ని నమోదు చేశారు.

ఒక్క రాత్రిలో బెంగళూరుగా మారదు.. బాంకీపూర్‌ విజేత ప్రశాంత్ కిశోర్
ఒక్క రాత్రిలో బెంగళూరుగా మారదు.. బాంకీపూర్‌ విజేత ప్రశాంత్ కిశోర్

కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన తుది గణాంకాల ప్రకారం ప్రశాంత్ కిశోర్ మొత్తంగా 64,151 ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 19,324 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయాన్ని అందుకున్నారు. 2025 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరిచేందుకు తీవ్రంగా శ్రమించిన జన్ సురాజ్ పార్టీకి బిహార్ శాసనసభలో ఇది తొలి ప్రాతినిధ్యం కావడం గమనార్హం.

"రాత్రికి రాత్రే మార్పులు రావు"

"నా ఎమ్మెల్యే గెలుపుతో బాంకీపూర్ రాత్రికి రాత్రే బెంగళూరుగా మారిపోదు. కానీ, రాబోయే రెండు మూడు నెలల్లో ఇక్కడ స్పష్టమైన మార్పులను చూస్తారు" అని జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం తన మద్దతుదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆడంబరమైన హామీలు గుప్పించడం కంటే స్థానిక ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించడమే తన ప్రథమ కర్తవ్యమని చెప్పారు.

"ప్రజలు నాపై ఉంచిన నమ్మకంతో బాంకీపూర్ రూపురేఖలు మార్చడమే నా మొదటి పని. రాబోయే రెండు మూడు నెలల్లోనే మార్పులు మీ కళ్లముందు కనిపిస్తాయి. నేను పెద్ద పెద్ద మాటలు చెప్పాలనుకోవడం లేదు" అని పీకే స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు

ఇదే వేదికపై నుంచి బిహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిపై ప్రశాంత్ కిశోర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన పోరాటం ఏ ఒక్క వ్యక్తితోనూ కాదని, రాష్ట్ర నాయకత్వ సమర్థత గురించేనని పునరుద్ఘాటించారు.

"ఈ పోరాటం వ్యక్తిగతమైనది కాదు. సామ్రాట్ చౌదరి నడవడిక, ప్రవర్తన, చరిత్ర ప్రజలందరికీ తెలుసు. ఒక నేరస్థుడిని రాజుగా, బిహార్ ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే రాష్ట్రం ముందుకు వెళ్లలేదు" అని పీకే ఆరోపించారు. బిహార్‌లో ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉందనే విషయాన్ని ఆయన అంగీకరించారు. మంచి నైతిక విలువలు, పాలనా సామర్థ్యం ఉన్న నేతను తదుపరి ముఖ్యమంత్రిగా నియమించాలని బీజేపీ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు.

"మా పోరాటం ఏ ఒక్క వ్యక్తితోనూ కాదు. మెజారిటీ బీజేపీ-ఎన్డీయే కూటమికి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి వారి పార్టీ నుంచే ఉంటారు. బిహార్ అభివృద్ధి చెందాలన్నా, ప్రజలు గర్వంగా జీవించాలన్నా ఒక సమర్థుడైన, మంచి నైతిక విలువలు ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలని మోదీ గారిని కోరుతున్నాం" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ ఎన్నిక కేవలం స్థానిక మౌలిక వసతుల సమస్యలకే పరిమితం కాలేదని పీకే తెలిపారు. "ఈ ఎన్నిక కేవలం బాంకీపూర్ వీధులు, మురికి కాలువల సమస్యలపై జరగలేదు. బిహార్‌ను ఎవరు నడిపించాలనే అంశంపైనే సాగింది. ఒక మంచి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎంచుకోవాలని బాంకీపూర్ ప్రజలు బీజేపీ నాయకత్వానికి స్పష్టమైన సందేశం పంపారు" అని ఆయన పేర్కొన్నారు.

ఓటమిని అంగీకరించిన సీఎం సామ్రాట్ చౌదరి

బాంకీపూర్ ఉపఎన్నికలో ప్రశాంత్ కిశోర్ విజయంపై బిహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి స్పందించారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు పేర్కొంటూ పీకేకు శుభాకాంక్షలు తెలిపారు. "ప్రజాస్వామ్య మహా పండుగలో బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో ప్రజలు జన్ సురాజ్‌ను ఎన్నుకున్నారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తూ ప్రశాంత్ కిశోర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు" అని సామ్రాట్ చౌదరి సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.

ఘనవిజయం వెనుక నేపథ్యం

బాంకీపూర్ అసెంబ్లీ స్థానానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు. ఆయన రాజ్యసభకు ఎన్నికై, పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడంతో స్థానం ఖాళీ అయి ఈ ఉపఎన్నిక అనివార్యమైంది.

పదేళ్లుగా రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్, నేరుగా ఎన్నికల బరిలోకి దిగిన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడం గమనార్హం. విద్య, ఉపాధి, అభివృద్ధి, అవినీతి రహిత పాలనను అజెండాగా మార్చుకుని ఆయన ప్రచారం నిర్వహించారు. అధికార ఎన్డీయే, విపక్ష ఆర్‌జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌ కూటమిలకు ప్రత్యామ్నాయంగా జన్ సురాజ్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన విజయం సాధించారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More