...
...
Next Story

ములాయం సింగ్ కుమారుడు ప్రతీక్ హఠాన్మరణం: కుటుంబ తగాదాలే కారణమా?

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ములాయం సింగ్ యాదవ్ రెండో కుమారుడు ప్రతీక్ యాదవ్ (38) బుధవారం తెల్లవారుజామున లక్నోలో కన్నుమూశారు. భార్య అపర్ణా యాదవ్‌తో విభేదాలు, విడాకుల వార్తలతో ఇటీవల సంచలనంగా మారిన ఆయన మృతి వెనుక 'విషప్రయోగం' కోణం ఉందన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

Updated on: May 13, 2026, 09:29:01 IST
Advertisement

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన యాదవ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎస్పీ దిగ్గజం ములాయం సింగ్ యాదవ్, ఆయన రెండో భార్య సాధనా గుప్తాల కుమారుడు ప్రతీక్ యాదవ్ మే 13, బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు ఈయన సోదరుడు (సవతి తమ్ముడు). 38 ఏళ్ల చిన్న వయసులోనే ప్రతీక్ మరణించడం లక్నోతో పాటు రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

తెల్లవారుజామున అసలేం జరిగింది?

భార్య అపర్ణాయాదవ్‌తో ప్రతీక్ యాదవ్
భార్య అపర్ణాయాదవ్‌తో ప్రతీక్ యాదవ్

ప్రతీక్ యాదవ్ మరణంపై లక్నో సివిల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జి.పి. గుప్తా కీలక వివరాలు వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ప్రతీక్ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం అందడంతో వైద్య బృందం ఆయన నివాసానికి చేరుకుంది.

"వైద్యులు వెళ్లే సమయానికే ప్రతీక్ పరిస్థితి చాలా విషమంగా ఉంది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించాం. వైద్య బృందం శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఉదయం 5:55 గంటలకు ఆయన మరణించినట్లు ప్రకటించాం" అని డాక్టర్ గుప్తా పేర్కొన్నారు.

అయితే, ఈ మరణం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతీక్ శరీరంలో విషం చేరి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పోస్ట్‌మార్టం నివేదిక వస్తేనే మరణానికి గల అసలు కారణాలు తెలిసే అవకాశం ఉంది.

రాజకీయాలకు దూరం.. వివాదాలకు దగ్గర

భారతదేశంలోని అతిపెద్ద రాజకీయ కుటుంబాల్లో ఒకటైన యాదవ్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ, ప్రతీక్ ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఆయనకు జిమ్ నిర్వహణ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై ఆసక్తి ఉండేది. అయితే ఆయన భార్య అపర్ణా యాదవ్ మాత్రం రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. గతంలో సమాజ్ వాదీ పార్టీ తరపున పోటీ చేసిన ఆమె, 2022లో భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరారు. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ వైస్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

భార్యతో విభేదాలు.. సోషల్ మీడియాలో రచ్చ

"ఆమె స్వార్థపరురాలు. కేవలం పేరు, ప్రతిష్టల కోసమే ప్రాకులాడుతుంది. నా తల్లిదండ్రుల నుంచి, నా సోదరుడి నుంచి నన్ను వేరు చేసింది. త్వరలోనే ఈమెకు విడాకులు ఇస్తాను" అని ప్రతీక్ తన పోస్ట్‌లో రాశారు.

తన మానసిక స్థితి సరిగ్గా లేదని, దానికి అపర్ణే కారణమని ఆయన ఆరోపించారు. అయితే, కొద్దిరోజుల క్రితం వీరిద్దరూ మళ్ళీ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించడంతో విభేదాలు సమసిపోయాయని అందరూ భావించారు. ఇంతలోనే ప్రతీక్ అనుమానాస్పద స్థితిలో మరణించడం పెను సంచలనంగా మారింది.

యాదవ్ కుటుంబంలో విషాద ఛాయలు

ముందుగా తల్లి సాధనా గుప్తాను, ఆ తర్వాత తండ్రి ములాయం సింగ్‌ను కోల్పోయిన ప్రతీక్.. ఇప్పుడు తనువు చాలించడం ఆ కుటుంబంలో తీరని లోటును మిగిల్చింది. అఖిలేష్ యాదవ్ తన సోదరుడి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లక్నోలోని యాదవ్ నివాసానికి ఎస్పీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ప్రతీక్ యాదవ్ ఎవరు?

ప్రతీక్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ రెండో కుమారుడు. ఈయన అఖిలేష్ యాదవ్‌కు సోదరుడు, బీజేపీ నాయకురాలు అపర్ణా యాదవ్ భర్త.

2. ప్రతీక్ యాదవ్ ఎలా మరణించారు?

ప్రతీక్ బుధవారం తెల్లవారుజామున అనారోగ్యం కారణంగా లక్నోలోని సివిల్ ఆసుపత్రిలో మరణించారు. అయితే, ఆయన మరణం వెనుక విషప్రయోగం జరిగి ఉండవచ్చనే అనుమానంతో పోలీసులు విచారణ చేపట్టారు.

3. అపర్ణా యాదవ్‌తో ప్రతీక్ విభేదాలకు కారణం ఏమిటి?

ప్రతీక్ తన భార్య అపర్ణను స్వార్థపరురాలని, ఆమె వల్ల తన కుటుంబ సంబంధాలు దెబ్బతిన్నాయని గతంలో ఆరోపించారు. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కూడా అప్పట్లో సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

4. ప్రతీక్ యాదవ్ వయసు ఎంత?

మరణించే సమయానికి ప్రతీక్ యాదవ్ వయసు 38 ఏళ్లు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe