WhatsApp scam : వాట్సాప్ ట్రేడింగ్ స్కామ్‌కి రూ. 73లక్షలు కోల్పోయిన ‘సైబర్ సెక్యూరిటీ నిపుణుడు’!
వాట్సాప్ ట్రేడింగ్ స్కామ్‌కి ఓ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ఏకంగా రూ. 70లక్షల కన్నా ఎక్కువ కోల్పోయాడు! ఈ ఘటన మహారాష్ట్ర పూణెలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..
పాములు పట్టే వాడు పాము కాటుకే పోయాడు అన్నట్టు.. ఓ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు.. సైబర్ క్రైమ్‌కి భారీగా డబ్బును కోల్పోయాడు! వాట్సాప్ ట్రేడింగ్ స్కామ్‌లో భాగంగా వివిధ నగరాల్లోని బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేయించిన కేటుగాళ్లు, ఆయన నుంచి ఏకంగా రూ. 73.69 లక్షలు దోచుకున్నారు. అధిక రాబడిని ఆశ చూపే నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా భారత్‌లో జరుగుతున్న మోసాలు ఎంతగా పెరుగుతున్నాయో ఈ కేసు మరోసారి స్పష్టం చేసింది!

మహారాష్ట్ర పూణెకు చెందిన సదరు సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, ఆన్‌లైన్ భద్రతపై అవగాహన ఉన్నప్పటికీ, ఈ మోసానికి బలయ్యాడు. చెన్నై, భద్రక్, ఫిరోజ్‌పూర్, ఉల్హాస్‌నగర్, పింప్రీ-చించ్వాడ్, గురుగ్రామ్ వంటి పలు నగరాల్లోని వివిధ బ్యాంకు ఖాతాలకు ఆయన డబ్బులు బదిలీ చేశాడు.
వాట్సాప్ ట్రేడింగ్ స్కామ్- మోసం ఎలా జరిగింది?
ఈ ఉదంతం ఆగస్టు నెలలో మొదలైంది! బాధితుడికి ఒక అంతర్జాతీయ నంబర్ నుంచి లింక్‌తో కూడిన వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఆ లింక్‌పై క్లిక్ చేయడంతో ఆయన ఒక గ్రూప్ చాట్‌లో చేరాడు. ఆ గ్రూప్‌లో 100 మందికి పైగా సభ్యులు ఉన్నారు. వీరంతా ఒక స్టాక్-ట్రేడింగ్ యాప్‌లో తమకు వచ్చినట్లుగా పేర్కొంటున్న లాభాల స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసుకున్నారు.
గ్రూప్ అడ్మినిస్ట్రేటర్, రిజిస్ట్రేషన్ ఫామ్ నింపి, యాప్‌లో లాగిన్ అయితే, ప్రత్యేకం ట్రేడింగ్ మార్గదర్శకత్వం లభిస్తుందని నమ్మబలికాడు.
ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 1 మధ్య, బాధితుడు వివిధ నగరాల్లోని అనేక ఖాతాలకు ఏకంగా 55 సార్లు డబ్బులు బదిలీ చేశాడు. ఆ మొత్తం రూ. 73.69 లక్షలు. ఆయన అకౌంట్‌లో రూ. 2.33 కోట్లు లాభం వచ్చినట్లుగా చూపించారు. అయితే, ఆ డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా, మోసగాళ్లు విత్‌డ్రా చేయడానికి ముందు 10% పన్ను చెల్లించాలని డిమాండ్ చేశారు.
అప్పుడే తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు, వెంటనే పూణె సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అధికారుల హెచ్చరికలు..
ఇలాంటి మోసాలు తరచుగా వాట్సాప్ లేదా టెలిగ్రామ్‌లలో నిజమైన పెట్టుబడి కమ్యూనిటీల్లానే కనిపిస్తాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. మోసగాళ్లు సెబీ రిజిస్టర్డ్ సలహాదారులుగా లేదా విదేశీ పెట్టుబడిదారులుగా నటిస్తారు. నిజమైన ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్‌ను పోలిన నకిలీ యాప్‌లను డౌన్‌లోడ్ చేయమని వినియోగదారులను అడుగుతారు.
బాధితులు నిజంగా స్టాక్స్‌లో లేదా ఐపీఓల్లో ట్రేడింగ్/ పెట్టుబడి చేస్తున్నామని నమ్ముతారు. కానీ, డబ్బులు విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఆ యాప్‌లు అదృశ్యమవుతాయి. సెబీ, పోలీసుల నుంచి పదేపదే హెచ్చరికలు ఉన్నప్పటికీ, ఈ మోసాలకు శిక్షణ పొందిన నిపుణులను సైతం బలవుతుండటం ఆందోళనకరంగా మారింది.
ఇలాంటి మోసాలను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలు..
అధికారులు పౌరులకు ఈ కింది విధంగా సూచనలు ఇస్తున్నారు:
పెట్టుబడి ప్లాట్‌ఫామ్స్ నిజమైనవో కాదో తప్పకుండా తనిఖీ చేయండి.
మీరు అడగకుండా వచ్చిన ఆర్థికపరమైన ఆఫర్లను నిరాకరించండి.
తెలియని ఖాతాలకు ఎప్పుడూ డబ్బులు బదిలీ చేయవద్దు.
మీ డివైజ్ సెక్యూరిటీని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయండి.
బలమైన పాస్‌వర్డ్‌లు, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ వాడండి.
మీ బ్యాంకు ఖాతాల్లో ఏదైనా అసాధారణ యాక్టివిటీ ఉందేమో పర్యవేక్షించండి.
తాజాగా జరుగుతున్న ఆన్‌లైన్ స్కామ్‌ల గురించి తెలుసుకుంటూ ఉండండి.














