రాజ్యసభలో మారిన రాజకీయ చిత్రం.. 113కు చేరుకున్న బీజేపీ బలం

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడం, ఆ విలీనాన్ని రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించడంతో రాజ్యసభలో బీజేపీ బలం పెరిగింది. రాఘవ్ చడ్డా నేతృత్వంలోని ఈ బృందం చేరికతో ఎగువ సభలో బీజేపీ బలం 113కు చేరింది.

Published on: Apr 27, 2026, 16:48:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాజ్యసభ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత రాఘవ్ చడ్డాతో పాటు అదే పార్టీకే చెందిన మరో ఆరుగురు ఎంపీలు బీజేపీలో విలీనం కావడానికి రాజ్యసభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ పచ్చజెండా ఊపారు. గత వారమే ఆప్ నుంచి బయటకు వచ్చిన ఈ రెబల్ ఎంపీలు, ఇప్పుడు అధికారికంగా కమలం గూటికి చేరారు. దీంతో 245 మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీ బలం 113కి పెరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి కీలక బిల్లుల ఆమోదం సమయంలో పెద్ద ఊరటనిచ్చే అంశం.

క్లాక్ వైజ్: రాఘవ్ చడ్డా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, స్వాతి మలివాల్, హర్బజన్ సింగ్, విక్రమ్‌జిత్ సింగ్, రాజిందర్ గుప్తా
క్లాక్ వైజ్: రాఘవ్ చడ్డా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, స్వాతి మలివాల్, హర్బజన్ సింగ్, విక్రమ్‌జిత్ సింగ్, రాజిందర్ గుప్తా

బీజేపీలో కలిసిన ఆప్ రెబల్స్

బీజేపీలోకి వెళ్లిన వారిలో రాఘవ్ చడ్డా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్, విక్రమ్‌జిత్ సింగ్ సహానీ, హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేందర్ గుప్త ఉన్నారు. ఈ ఏడుగురు సభ్యుల పేర్లు ఇప్పుడు రాజ్యసభ అధికారిక జాబితాలో బీజేపీ ఎంపీలుగా నమోదయ్యాయి. ఈ పరిణామంతో ఎగువ సభలో ఆప్ బలం కేవలం మూడుకు పడిపోయింది. పంజాబ్ నుంచి ఎంపికైన ఏడుగురు ఎంపీలలో ఆరుగురు పార్టీని వీడటంతో, అక్కడ ఇప్పుడు బల్బీర్ సింగ్ సీచెవాల్ ఒక్కరే ఆప్ తరపున మిగిలారు.

కిరణ్ రిజిజు హర్షం

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ విలీనాన్ని స్వాగతిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో దేశ నిర్మాణానికి సిద్ధమైన ఎన్డీయే కూటమిలోకి మీకు సాదర స్వాగతం. 'టుక్డే-టుక్డే' ఇండి కూటమికి ఇక వీడ్కోలు" అంటూ ఆయన ఆప్‌పై విమర్శలు గుప్పించారు.

అంతేకాకుండా, బీజేపీలోకి చేరిన ఈ ఏడుగురు ఎంపీలు ఎప్పుడూ అసభ్య పదజాలం వాడలేదని, పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదని ఆయన కొనియాడారు. వారి క్రమశిక్షణే వారిని బీజేపీ వైపు నడిపించిందని రిజిజు అభిప్రాయపడ్డారు.

'టాక్సిక్' వాతావరణమే కారణం: రాఘవ్ చడ్డా

పార్టీని వీడటానికి గల కారణాలను వివరిస్తూ రాఘవ్ చడ్డా ఒక వీడియోను విడుదల చేశారు. తన 15 ఏళ్ల యవ్వనాన్ని ఈ పార్టీ కోసం ధారపోశానని, కానీ ఇప్పుడు ఆప్ మునుపటిలా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "పార్లమెంటులో మాట్లాడాలన్నా, ప్రజల కోసం పనిచేయాలన్నా కొందరు అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పార్టీ కొందరు అవినీతి వ్యక్తుల చేతుల్లో బందీ అయింది. నేను సరైన వ్యక్తినే కానీ, తప్పుడు పార్టీలో ఉన్నానని అనిపించింది" అని చడ్డా పేర్కొన్నారు. పనిచేసే చోట వాతావరణం కలుషితమైతే (Toxic) ఎవరైనా బయటకు రాక తప్పదని ఆయన తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

పంజాబ్ రాజకీయాలపై ప్రభావం

ఈ ఎంపీల మార్పు కేవలం రాజ్యసభకే పరిమితం కాకుండా పంజాబ్ రాజకీయాల్లోనూ చిచ్చు రేపనుంది. పంజాబ్ నుంచి అత్యధిక స్థానాలు గెలిచిన ఆప్, ఇప్పుడు తన ఎంపీలను కాపాడుకోలేకపోవడం పార్టీ నాయకత్వ లోపాలను ఎత్తిచూపుతోంది. ముఖ్యంగా క్రికెట్ దిగ్గజం హర్భజన్ సింగ్, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ స్వాతి మలివాల్ వంటి ప్రముఖులు బీజేపీ వైపు వెళ్లడం ఆప్‌కు కోలుకోలేని దెబ్బ. దేశవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్న అరవింద్ కేజ్రీవాల్‌కు తన సొంత ఎంపీలే షాక్ ఇవ్వడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More