ఫోన్లతో సీబీఎస్‌ఈ జవాబు పత్రాల స్కానింగ్: రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
సీబీఎస్‌ఈ 12వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో భారీ అక్రమాలు జరిగాయని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. టెండర్ నిబంధనలను మార్చి, మొబైల్ ఫోన్లతో స్కానింగ్ చేయించడాన్ని ఆయన తీవ్రమైన 'మోసం'గా అభివర్ణించారు.
సీబీఎస్‌ఈ (CBSE) 12వ తరగతి పరీక్షల జవాబు పత్రాల స్కానింగ్ ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగిందంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల జవాబు పత్రాలను మొబైల్ ఫోన్లతో స్కాన్ చేశారని, ఇదొక పెద్ద మోసమని ఆయన ఆరోపించారు. ఒక ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకే టెండర్ నిబంధనలను మార్చారని మండిపడ్డారు.

సోషల్ మీడియా వేదికగా (X) రాహుల్ గాంధీ ఈ వ్యవహారాన్ని లేవనెత్తారు. జార్ఖండ్‌కు చెందిన సార్థక్ సిద్ధాంత్ అనే 12వ తరగతి విద్యార్థి సేకరించిన టెండర్ వివరాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై, సీబీఎస్‌ఈ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
"2025 మే నెలలో సీబీఎస్‌ఈ జారీ చేసిన టెండర్ నిబంధనల ప్రకారం.. జవాబు పత్రాలను ఆటోమేటిక్ రోబోటిక్ స్కానర్ల ద్వారా, కనీసం 300 డీపీఐ (DPI) స్పష్టతతో స్కాన్ చేయాల్సి ఉంది. కానీ, 2025 ఆగస్టులో తిరిగి జారీ చేసిన టెండర్‌లో ఈ నిబంధనలను నిశ్శబ్దంగా తొలగించారు. స్కానర్ల నిబంధనను సాధారణీకరించి, స్పష్టతను 200 డీపీఐకి తగ్గించారు," అని రాహుల్ గాంధీ వివరించారు.
'కోఎంప్ట్' సంస్థపై ఆరోపణలు.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు
నిబంధనల సడలింపు వెనుక ఉన్న అసలు కారణం ఇప్పుడు బయటపడిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జవాబు పత్రాల స్కానింగ్ కాంట్రాక్ట్ దక్కించుకున్న 'కోఎంప్ట్ ఎడ్యుటెక్' (Coempt EduTeck) అనే సంస్థ మొబైల్ ఫోన్లను ఉపయోగించి స్కానింగ్ చేసినట్లు వెల్లడైందని తెలిపారు. ఫలితంగా విద్యార్థులకు అస్పష్టమైన కాపీలు రావడం, పేజీలు గల్లంతవడం, కొన్ని జవాబు పత్రాలు అసలు స్కాన్ కాకపోవడం వంటి తీవ్ర సమస్యలు తలెత్తాయన్నారు.
ఇవి కేవలం సాంకేతిక పొరపాట్లు కావు అని, సదరు సంస్థకు ప్రయోజనం చేకూర్చడానికి కాంట్రాక్ట్ నిబంధనలను మార్చడం వల్ల జరిగిన నష్టమని ఆయన ఆరోపించారు. తప్పుగా మూల్యాంకనం జరిగిన ప్రతి విద్యార్థి ఈ మోసానికి బాధితుడేనని ఆవేదన వ్యక్తం చేశారు. 18.5 lakhs (18.5 లక్షల) మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మౌనంగా ఉండటాన్ని ఆయన తప్పుపట్టారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి శోధనతో వెలుగులోకి వచ్చిన అక్రమాలు
జార్ఖండ్‌కు చెందిన విద్యార్థి సార్థక్ సిద్ధాంత్ సెంట్రల్ పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌లో ఉన్న టెండర్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ విషయాలను బయటపెట్టారు. ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) కాంట్రాక్ట్ కోసం నిబంధనలను మూడు విడతలుగా ఎలా సడలించారో ఆయన ఆధారాలతో సహా తన వెబ్‌సైట్‌లో ప్రదర్శించారు. ఈ మార్పులన్నీ హైదరాబాద్‌కు చెందిన 'కోంఎప్ట్ ఎడ్యుటెక్' సంస్థ ప్రొఫైల్‌కు సరిపోయేలా చేశారని ఆ విద్యార్థి ఆరోపించారు. ఫలితాల తర్వాతి పోర్టల్‌లో సాంకేతిక లోపాలు, మూల్యాంకనంలో అక్రమాలపై దేశవ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో ఈ నివేదిక సంచలనంగా మారింది.
వెండర్ సంస్థపై చర్యలకు సీబీఎస్‌ఈ సిద్ధం
ఈ వివాదం తీవ్రం కావడంతో ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) సేవలను అందించిన హైదరాబాద్ సంస్థ 'కోంఎప్ట్ ఎడ్యుటెక్'పై చర్యలు తీసుకునేందుకు సీబీఎస్‌ఈ రంగం సిద్ధం చేసింది. 2025 ఆగస్టు టెండర్ నిబంధనల ప్రకారం సదరు సంస్థకు భారీ జరిమానాలు విధించనున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు.
టెండర్ లోని కఠిన నిబంధనలు ఇవే:
అధికారులు నివేదించిన తర్వాత సమస్యను పరిష్కరించడంలో ప్రతి 15 నిమిషాల ఆలస్యానికి రూ.1 లక్ష జరిమానా విధిస్తారు. సంస్థకు సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్‌ను పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంది. నిబంధనల అతిక్రమణ కింద కాంట్రాక్ట్‌ను పూర్తిగా రద్దు చేసే అధికారం కూడా బోర్డుకు ఉంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


