...
...
Next Story

ద్రవ్యోల్బణం పెరగబోతోంది.. రూపాయి పతనంపై రాహుల్ గాంధీ ఆందోళన.. సామాన్యులపై పడే 4 ప్రధాన ప్రభావాలివే..

పశ్చిమ ఆసియా యుద్ధం నేపథ్యంలో రూపాయి విలువ పతనం, పెరుగుతున్న చమురు ధరలపై రాహుల్ గాంధీ స్పందించారు. ఎన్నికల తర్వాత పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగడం ఖాయమని, ఇది ప్రతి కుటుంబంపై తీవ్ర భారం మోపుతుందని ఆయన హెచ్చరించారు.

Published on: Mar 21, 2026, 18:03:54 IST
Advertisement

పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, దేశీయ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం తీవ్రంగా ఉండబోతోందని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హెచ్చరించారు. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నడుస్తున్న పోరు వల్ల రూపాయి విలువ పతనం కావడం, చమురు ధరలు పెరగడం కేవలం గణాంకాలు కావని.. ఇవి రాబోయే 'ద్రవ్యోల్బణ సునామీ'కి సంకేతాలని ఆయన అభివర్ణించారు.

ద్రవ్యోల్బణం పెరగబోతోంది.. రూపాయి పతనంపై రాహుల్ గాంధీ ఆందోళన (File Photo: AICC)
ద్రవ్యోల్బణం పెరగబోతోంది.. రూపాయి పతనంపై రాహుల్ గాంధీ ఆందోళన (File Photo: AICC)

శనివారం 'X' (గతంలో ట్విట్టర్) వేదికగా స్పందించిన రాహుల్.. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 93.53 వద్ద ఆల్-టైమ్ కనిష్టానికి పడిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది త్వరలోనే 100 మార్కును తాకవచ్చని, దీనివల్ల పారిశ్రామిక ఇంధన ధరలు పెరిగి సామాన్యుడి నడ్డి విరుస్తాయని పేర్కొన్నారు.

సామాన్యుడి జేబుపై పడే 4 ప్రత్యక్ష ప్రభావాలు:

ప్రభుత్వం దీనిని 'సాధారణ పరిస్థితి' అని చెప్పవచ్చు కానీ, వాస్తవం దానికి భిన్నంగా ఉందని రాహుల్ విమర్శించారు. ఈ ఆర్థిక సంక్షోభం వల్ల ప్రతి కుటుంబంపై పడే ప్రభావాలను ఆయన ఇలా వివరించారు.

  • ఖరీదైన రవాణా & ఉత్పత్తి: ఇంధన ధరలు పెరగడం వల్ల వస్తువుల ఉత్పత్తి, రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతాయి.
  • MSMEలపై దెబ్బ: చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEలు) ఈ ధరల పెరుగుదలను తట్టుకోలేక కుదేలవుతాయి.
  • మార్కెట్ల పతనం: విదేశీ పెట్టుబడులు (FII) దేశం నుంచి వేగంగా తరలిపోతాయి. దీనివల్ల స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది.
  • ఎన్నికల తర్వాత ధరల బాదుడు: ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో (పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి) ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవి ముగియగానే పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ ధరలను ప్రభుత్వం భారీగా పెంచుతుందని రాహుల్ జోస్యం చెప్పారు.

మరోవైపు, పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే కేరళ వంటి రాష్ట్రాల్లో ఎల్‌పీజీ (LPG) కొరత తీవ్రంగా ఉంది. గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో ఈ నెల ప్రారంభంలో అనేక హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ వాణిజ్య వినియోగదారులను పైప్డ్ గ్యాస్ (PNG) వైపు మళ్లాలని కోరుతున్నా, క్షేత్రస్థాయిలో గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరుతున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

శశి థరూర్ భిన్నమైన విశ్లేషణ

అయితే, రూపాయి పతనంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ కొంత భిన్నంగా స్పందించారు. రూపాయి విలువ తగ్గడానికి మన ప్రభుత్వ నియంత్రణలో లేని అంతర్జాతీయ శక్తులే ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో, గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగిందని.. అప్పట్లో కాంగ్రెస్‌ను విమర్శించిన బీజేపీ, ఇప్పుడు వాస్తవాలను అంగీకరించే హుందాతనం చూపాలని థరూర్ సూచించారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ):

1. రూపాయి విలువ తగ్గితే ధరలు ఎందుకు పెరుగుతాయి?

జ: భారత్ తన అవసరాలకు కావాల్సిన ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. రూపాయి విలువ తగ్గితే, మనం డాలర్లలో ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, అన్ని వస్తువుల ధరలూ పెరుగుతాయి.

2. ఎన్నికల తర్వాతే ధరలు పెరుగుతాయని రాహుల్ ఎందుకు అంటున్నారు?

జ: సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్ల వ్యతిరేకతను మూటగట్టుకోకుండా ఉండటానికి ప్రభుత్వం చమురు ధరలను పెంచదు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఆ భారాన్ని ప్రజలపై వేసే అవకాశం ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

3. ప్రస్తుతం రూపాయి విలువ ఎంత ఉంది?

జ: తాజా గణంకాల ప్రకారం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 93.53 వద్ద ఆల్-టైమ్ కనిష్టానికి చేరుకుంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe