...
...
Next Story

Ashwin SRH: చెత్త బ్యాటింగ్.. అతన్ని తీసిపారేయండి: సన్ రైజర్స్ తీరుపై అశ్విన్ ఘాటు కామెంట్స్

Ashwin SRH: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఎస్ఆర్‌హెచ్ ఓటమిపై స్పిన్నర్ అశ్విన్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ చెత్త షాట్లను తప్పుబట్టారు. ముఖ్యంగా హెడ్ విషయంలో ఫ్రాంచైజీ కఠిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

Published on: May 28, 2026, 19:57:20 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Ashwin SRH: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శనపై భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజస్థాన్ రాయల్స్ చేతిలో 47 పరుగుల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే.

Ashwin SRH: చెత్త బ్యాటింగ్.. అతన్ని తీసిపారేయండి: సన్ రైజర్స్ తీరుపై అశ్విన్ ఘాటు కామెంట్స్ (PTI)
Ashwin SRH: చెత్త బ్యాటింగ్.. అతన్ని తీసిపారేయండి: సన్ రైజర్స్ తీరుపై అశ్విన్ ఘాటు కామెంట్స్ (PTI)

ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు వ్యవహరించిన తీరును, ముఖ్యంగా కీలక సమయంలో వికెట్లు పారేసుకున్న విధానాన్ని అశ్విన్ తీవ్రంగా తప్పుబట్టారు. ఏకంగా ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ భవిష్యత్తుపై ఫ్రాంచైజీ యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన కుండబద్దలు కొట్టారు.

కుప్పకూలిన టాప్ ఆర్డర్

రాజస్థాన్ నిర్దేశించిన 244 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. టోర్నీ ఆసాంతం విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన ఎస్ఆర్‌హెచ్ టాప్ ఆర్డర్.. ఈ అత్యంత కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో ఒత్తిడికి పూర్తిగా చిత్తయింది.

ఇన్నింగ్స్ ఆరంభంలోనే రాజస్థాన్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ నిప్పులు చెరిగే బంతులతో హైదరాబాద్ టాపార్డర్‌ను కుప్పకూల్చారు. కేవలం ఐదు ఓవర్లు ముగిసే సరికి 57 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి ఎస్ఆర్‌హెచ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక్కడే సన్‌రైజర్స్ ఓటమి దాదాపుగా ఖరారైపోయింది.

ఓపెనర్ అభిషేక్ శర్మను ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే జోఫ్రా ఆర్చర్ డకౌట్ చేశాడు. మరోవైపు ఇషాన్ కిషన్ కేవలం 11 బంతుల్లోనే 33 పరుగులు సాధించి ఎటాకింగ్ మోడ్‌లో కనిపించాడు. కానీ అనవసరమైన షాట్‌కు యత్నించి అతను పెవిలియన్ చేరాడు. స్మరణ్ రవిచంద్రన్ సైతం తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఇక 8 బంతుల్లో 17 పరుగులు చేసిన స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను జోఫ్రా ఆర్చర్ క్లీన్ బౌల్డ్ చేయడంతో హైదరాబాద్ కోలుకోలేని దెబ్బతింది.

అలాంటి షాట్లకు అర్థమే లేదు

"నిజానికి సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌ను చాలా సునాయాసంగా గెలవాల్సింది. తొలి రెండు ఓవర్లలోనే 32 నుంచి 34 పరుగులు వచ్చాయి. మొదటి మూడు ఓవర్లు ముగిసే సరికి స్కోరు దాదాపు 50కి చేరింది. ఆ దశలో ఇషాన్ కిషన్ ఆడిన షాట్ అస్సలు అవసరం లేదు. చేజేతులా తన వికెట్‌ను పారేసుకున్నాడు," అని అశ్విన్ విశ్లేషించారు.

"ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన నాకౌట్ మ్యాచ్‌లో అలాంటి చెత్త షాట్ ఆడటానికి కచ్చితంగా ఎలాంటి అర్థం లేదు. అది చాలా పేలవమైన షాట్," అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

హెడ్‌పై వేటు పడాల్సిందేనా?

ముఖ్యంగా ట్రావిస్ హెడ్ ప్రదర్శన పట్ల అశ్విన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సన్‌రైజర్స్ జట్టులో హెడ్ పాత్రపై యాజమాన్యం పునరాలోచించుకోవాలని సూచించారు.

"ఈ సీజన్ ఆసాంతం ట్రావిస్ హెడ్ ఏమాత్రం రాణించలేదు. హెడ్ విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ కచ్చితంగా ఒక నిర్ణయానికి రావాలి. క్రీజులో అతను మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది. ఆ పరిస్థితుల్లో అలాంటి చెత్త షాట్ ఆడి అవుట్ కావడంలో ఎలాంటి ప్రయోజనం లేదు" అని అశ్విన్ తేల్చిచెప్పారు.

అలాగే నితీశ్ కుమార్ రెడ్డి క్రీజులో ఉన్నంత వరకు మ్యాచ్ ఎస్ఆర్‌హెచ్ చేతుల్లోనే ఉందని ఈ సీనియర్ స్పిన్నర్ అభిప్రాయపడ్డారు.

"నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చేస్తున్నంత వరకు, అంటే ఇన్నింగ్స్ 14వ ఓవర్ వరకు ఎస్ఆర్‌హెచ్‌కు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ ఒకవైపు వరుసపెట్టి వికెట్లు కోల్పోతూ ఉంటే.. ఇంతటి భారీ లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యం," అని ఆయన స్పష్టం చేశారు.

"ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లు మ్యాచ్ పరిస్థితుల పట్ల కాస్త అవగాహనతో, ప్రశాంతమైన మనసుతో ఆడి ఉంటే కచ్చితంగా ఈ మ్యాచ్‌ను కంఫర్టబుల్‌గా గెలిచేవారు. నిజాయితీగా చెప్పాలంటే, సన్‌రైజర్స్ టీమ్ నుంచి వచ్చిన అత్యంత చెత్త బ్యాటింగ్ ప్రదర్శన ఇది" అని అశ్విన్ తన విశ్లేషణను ముగించారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe