SRH vs RR : ఎలిమినేటర్​లో దారుణంగా ఓడిపోయిన సన్​రైజర్స్​! క్వాలిఫైయర్స్​ 2కు రాజస్థాన్..

SRH vs RR eliminator : ఐపీఎల్​ 2026 ఎలిమినేటర్​లో వైభవ్​ సూర్యవంశీ ఊచకోతతో భారీ స్కోరు సాధించిన రాజస్థాన్ రాయల్స్​.. సన్​రైజర్స్​ హైదరాబాద్​ని చిత్తుగా ఓడించింది! భారీ లక్ష్యఛేదన కోసం బరిలో తిగిన ఎస్​ఆర్​హెచ్​ క్రమం తప్పకుండా వికెట్లూ కోల్పోతూ.. చివరికి ఇంటికి చేరింది.

Published on: May 28, 2026, 05:27:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

IPL 2026 SRH : ఐపీఎల్ 2026 సీజన్ హై-స్టేక్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్​ఆర్​హెచ్) డీలా పడింది. బుధవారం (మే 27) చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియం వేదికగా జరిగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ (ఆర్​ఆఱ్) 47 పరుగుల తేడాతో ఎస్​ఆర్​హెచ్​పై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 243 పరుగుల భారీ స్కోరు చేయగా.. ఛేదనలో సన్‌రైజర్స్ తడబడుతూ, కేవలం 196 పరుగులకే కుప్పకూలింది.

ఇషాన్ కిషన్ వికెట్​ తీసినం ఆనందంలో ఆర్​ఆర్.. (ANI Pic Service)
ఇషాన్ కిషన్ వికెట్​ తీసినం ఆనందంలో ఆర్​ఆర్.. (ANI Pic Service)

ఈ విజయంతో రియాన్ పరాగ్ సారథ్యంలోని రాజస్థాన్ జట్టు క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడటానికి అర్హత సాధించగా, ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని హైదరాబాద్ టోర్నీ నుంచి నిష్క్రమించి ఫ్యాన్స్​కి నిరాశ మిగిల్చింది.

లీగ్ స్టేజ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఎదురైన రెండు ఓటములకు రాజస్థాన్ రాయల్స్ ఈ నాకౌట్ మ్యాచ్‌లో అసలైన ప్రతీకారం తీర్చుకుందనే చెప్పుకోవాలి.

ఈ మ్యాచ్‌కు సంబంధించిన పూర్తి రికార్డులు, హైలైట్స్ ఇక్కడ చూద్దాము..

1. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రికార్డుల విధ్వంసం

టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మొదట బౌలింగ్ ఎంచుకోగా.. రాజస్థాన్ బ్యాటర్లు పిచ్‌పై పరుగుల విధ్వంసం సృష్టించారు. మరీ ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షించింది రాజస్థాన్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీనే! ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ టీనేజర్ కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్సర్లతో 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు.

గేల్ రికార్డ్ బద్దలు: ఈ ఇన్నింగ్స్ ద్వారా ఒకే ఐపీఎల్ సీజన్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన 'యూనివర్స్ బాస్' క్రిస్ గేల్ రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు.

యశస్వి జైస్వాల్ (29) తో కలిసి మొదటి వికెట్‌కు కేవలం 6 ఓవర్లలోనే 80 పరుగులు జోడించి పవర్‌ప్లేలోనే హైదరాబాద్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. మిడిల్ ఆర్డర్‌లో ధ్రువ్ జురెల్ (21 బంతుల్లో హాఫ్ సెంచరీ), కెప్టెన్ రియాన్ పరాగ్ (26) రాణించడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు బోర్డుపై పెట్టింది. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ ప్రఫుల్ హింగే 3 వికెట్లు పడగొట్టినా పరుగులు నియంత్రించలేకపోయాడు.

2. చేతులెత్తేసిన సన్‌రైజర్స్ బ్యాటర్లు.. ఆర్చర్ సూపర్ బౌలింగ్!

244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. పవర్‌ప్లేలోనే వికెట్లు కోల్పోవడంతో ఫ్యాన్స్​ షాక్​ అయ్యారు.

మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కాస్త పోరాడినప్పటికీ రాజస్థాన్ బౌలర్ల ధాటికి ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు.

రాయల్స్ బౌలింగ్ అటాక్: రాజస్థాన్ పేసర్ జోఫ్రా ఆర్చర్ 58 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా.. సుశాంత్ మిశ్రా, నాండ్రే బర్గర్, రవీంద్ర జడేజాలు తలా రెండు వికెట్లతో హైదరాబాద్‌ను కట్టిపడేశారు. దీనితో ఎస్‌ఆర్‌హెచ్ 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌట్ అయింది.

ప్లేఆఫ్స్ తదుపరి సమీకరణం..

ఈ అద్భుత విజయంతో రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ రేసులో నిలిచింది. క్వాలిఫైయర్ 1లో ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్టుతో రాజస్థాన్ ఇప్పుడు శుక్రవారం జరగనున్న ‘క్వాలిఫైయర్ 2’లో తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు నేరుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తో ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ అంతటా అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో ఒత్తిడిని జయించలేక టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More