RBI monetary policy : 5.25శాతం వద్ద రెపో రేటు యథాతథం.. ఆర్బీఐ ప్రకటన- కానీ..
RBI policy : రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్‌లో గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
RBI meeting today : కీలకమైన రెపో రేటు విషయంలో యథాతథ స్థితిని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా). అమెరికా- ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ద్రవ్యోల్బణ ముప్పు పొంచి ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి వడ్డీ రేట్లను పెంచకూడదని గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు తాజా పరపతి విధాన సమీక్షకు సంబంధించి శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఈ ప్రకటన వెలువడింది.
ప్రస్తుతం ఉన్న కీలకమైన రెపో రేటును 5.25 శాతంగానే యథాతథంగా ఉంచుతున్నట్లు గవర్నర్ ప్రకటించారు. దీనితో పాటు ద్రవ్యోల్బణ నియంత్రణే లక్ష్యంగా ఆర్బీఐ తన మానిటరీ పాలసీ విధానాన్ని ‘న్యూట్రల్’గానే కొనసాగిస్తోందని వెల్లడించారు.
"ప్రపంచవ్యాప్తంగా ప్రధాన వాణిజ్య రవాణా మార్గాలకు, సరఫరా గొలుసు (సప్లై చైన్)కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మార్కెట్లలో ఒడిదుడుకులు పెరగడం వల్ల అంతటా ఆందోళనకర వాతావరణం నెలకొంది. అయితే, ఇలాంటి అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొని, అతి తక్కువ నష్టంతో నిలదొక్కుకునే పూర్తి నమ్మకం, సామర్థ్యం భారతదేశానికి ఉన్నాయి," అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ధీమా వ్యక్తం చేశారు.
"ప్రస్తుతం మన ముందున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా, మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవడానికి ఇదొక గొప్ప అవకాశంగా మార్చుకోవాలి," అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆర్బీఐ జూన్ ద్రవ్య పరపతి సమీక్షా ముఖ్యాంశాలు..
1. మారని రెపో రేటు.. పాలసీ స్టాన్స్ యథాతథం
జూన్ నెలలో జరిగిన ఈ సమావేశంతో కలుపుకుని వరుసగా మూడోసారి ఆర్బీఐ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. గత ఏడాది డిసెంబర్‌లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన కేంద్ర బ్యాంక్, ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ పాలసీలోనూ వడ్డీ రేట్లను యథాతథంగానే ఉంచింది. తాజాగా జూన్ సమీక్షలోనూ అదే నిర్ణయాన్ని అమలు చేసింది. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) లోని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఓటు వేసి రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగించాలని నిర్ణయించినట్లు గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
ఇక రెపో రేటులో ఎలాంటి మార్పు లేకపోవడంతో, దానికి అనుబంధంగా ఉండే ఇతర రేట్లు కూడా స్థిరంగానే ఉన్నాయి.
స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) రేటు: బ్యాంకులు తమ వద్ద ఉన్న అదనపు నిధులను ఆర్బీఐ వద్ద జమ చేసేందుకు ఉపయోగపడే ఈ రేటు 5 శాతంగానే కొనసాగుతుంది.
మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు: అత్యవసర సమయాల్లో వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాలపై విధించే ఈ రేటు కూడా 5.5 శాతంగానే ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంటుంది.
ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల హోమ్ లోన్, కార్ లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకున్న పాత రుణగ్రహీతల ఈఎంఐలలో తక్షణమే ఎలాంటి మార్పులు ఉండవు. కొత్తగా రుణాలు తీసుకోవాలనుకునే వారికి కూడా ప్రస్తుత వడ్డీ రేట్లే వర్తిస్తాయి.
2. ద్రవ్యోల్బణం అంచనాలు పెంపు.. సామాన్యుడిపై ధరల భారం?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) గతంలో అనుకున్నదానికంటే ఎక్కువగా ఉండబోతోందని ఆర్బీఐ స్పష్టం చేసింది. గతంలో ద్రవ్యోల్బణం 4.6 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేయగా, ఇప్పుడు దానిని 5.1 శాతానికి పెంచింది. వాణిజ్య అవసరాలకు వాడే ఎల్పీజీ, బేస్ మెటల్స్ (లోహాలు), ప్లాస్టిక్స్, రబ్బర్ వంటి ముడిపదార్థాల ధరలు భారీగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని ఆర్‌బీఐ వివరించింది.
ఈ ఆర్థిక సంవత్సరం పొడవునా ధరల ఒత్తిడి కొనసాగుతుందని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) అంచనా వేసింది. త్రైమాసికాల వారీగా వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణం అంచనాలు ఇలా ఉన్నాయి:
మొదటి త్రైమాసికంలో: 4.2 శాతం
రెండో త్రైమాసికంలో: 5.1 శాతం
మూడో త్రైమాసికంలో: 5.9 శాతం
నాలుగో త్రైమాసికంలో: 5.9 శాతం
ప్రస్తుతానికి వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశించుకున్న 4 శాతం లక్ష్యం కంటే తక్కువగానే నమోదవుతోందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు.
మార్చిలో ఇది 3.4 శాతంగా, ఏప్రిల్‌లో 3.5 శాతంగా నమోదైంది.
"ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక కుదుపులు వస్తున్నప్పటికీ, మన దేశీయ ధరలపై దాని ప్రభావం పరిమితంగానే ఉంది. అందుకే ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉంది. అయితే, ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ఏడాది మూడో త్రైమాసికం (క్యూ3) నాటికి ద్రవ్యోల్బణం గరిష్ట పరిమితికి చేరుకునే అవకాశం ఉంది," అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా హెచ్చరించారు.
3. జీడీపీ వృద్ధి అంచనాను తగ్గించిన ఆర్బీఐ..
ఆర్థిక కార్యకలాపాల నెమ్మదక గమనాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (ఎఫ్వై27) భారత వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతంగా నమోదు కావచ్చని పేర్కొంది. గతంలో ఈ వృద్ధి రేటు 6.9 శాతంగా ఉంటుందని అంచనా వేయగా, ఇప్పుడు దాన్ని స్వల్పంగా తగ్గించడం గమనార్హం.
ఈ ఆర్థిక సంవత్సరంలోని నాలుగు త్రైమాసికాల వృద్ధి అంచనాలను కూడా ఆర్బీఐ కింది విధంగా సవరించింది:
మొదటి త్రైమాసికం (క్యూ1): గతంలో 6.8 శాతం అనుకోగా, ఇప్పుడు 6.6 శాతానికి తగ్గించారు.
రెండో త్రైమాసికం (క్యూ2): గత అంచనా 6.7 శాతం నుండి 6.3 శాతానికి తగ్గింది.
మూడో త్రైమాసికం (క్యూ3): మునుపటి అంచనా 7 శాతం నుండి 6.5 శాతానికి పడిపోయింది.
నాలుగో త్రైమాసికం (క్యూ4): గతంలో 7.2 శాతం వృద్ధిని ఆశించగా, ఇప్పుడు 6.8 శాతానికే పరిమితం చేశారు.
"గడిచిన కొన్ని నెలలుగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటోంది. కీలక వాణిజ్య రవాణా మార్గాలు, సప్లై చైన్‌లు దెబ్బతిన్నాయి. మార్కెట్లలో ఒడిదుడుకులు పెరగడంతో వ్యాపార వర్గాల్లో ఆందోళన నెలకొంది. అయితే, గతంలో వచ్చిన ఇలాంటి సంక్షోభాలతో పోలిస్తే, ఈసారి భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత పటిష్టమైన పునాదులతో అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొంటోంది. అతి తక్కువ నష్టంతో ఈ అడ్డంకులను మనం దాటగలమనే నమ్మకం మాకుంది," అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ధీమా వ్యక్తం చేశారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


