రుణగ్రహీతలకు ఆర్‌బీఐ ఊరట: వేధింపులు, ఫోన్ లాకింగ్‌లకు చెక్

లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు, డివైజ్‌ల లాకింగ్, వ్యక్తిగత డేటా దుర్వినియోగానికి అడ్డుకట్ట వేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్గదర్శకాలపై ప్రత్యేక కథనం.

Published on: Aug 10, 2026, 08:51:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

లోన్ ఈఎంఐలు కట్టడంలో కాస్త ఆలస్యమైతే చాలు.. రికవరీ ఏజెంట్ల నుంచి ఎదురయ్యే వేధింపులు, బెదిరింపులకు ఆర్‌బీఐ చరమగీతం పాడింది. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFCs), రికవరీ ఏజెంట్ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ కేంద్ర రిజర్వ్ బ్యాంక్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. 'కండక్ట్ ఆఫ్ రెగ్యులేటెడ్ ఎన్‌టిటీస్ ఇన్ రికవరీ ఆఫ్ లోన్స్ అండ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ రికవరీ ఏజెంట్స్' పేరిట ఆగస్టు 6న ఈ నిబంధనలను జారీ చేశారు. ఇవి 2027 జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి.

రుణగ్రహీతలకు ఆర్‌బీఐ ఊరట: వేధింపులు, ఫోన్ లాకింగ్‌లకు చెక్
రుణగ్రహీతలకు ఆర్‌బీఐ ఊరట: వేధింపులు, ఫోన్ లాకింగ్‌లకు చెక్

ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఫ్రీజ్ చేస్తే కుదరదు

పెండింగ్ ఈఎంఐలు వసూలు చేసేందుకు లోన్ తీసుకున్న వ్యక్తికి చెందిన మొబైల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్ వంటి డివైజ్‌లను బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రిమోట్‌గా లాక్ చేయడాన్ని ఆర్‌బీఐ పూర్తిగా నిషేధించింది. పర్సనల్ లోన్, హోమ్ లోన్, ఆటో లోన్ల వసూళ్లకు డివైజ్ లాకింగ్ పద్ధతులను వాడకూడదని తేల్చిచెప్పింది.

అయితే, ఆ నిర్దిష్ట డివైజ్ కొనుగోలు కోసమే లోన్ తీసుకున్న సందర్భాల్లో మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుంది. కానీ, దానికి కూడా ముందస్తు నోటీసు ఇచ్చి, తగిన సమయం కేటాయించిన తర్వాతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

డేటా చోరీ, ఏజెంట్ల దాష్టీకానికి స్వస్తి

రికవరీ ప్రక్రియలో కస్టమర్ల గౌరవానికి, గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్‌బీఐ ఆదేశించింది. రికవరీకి ఎంత సమాచారం అవసరమో అంత మాత్రమే ఏజెంట్లతో పంచుకోవాలని బ్యాంకులకు స్పష్టం చేసింది. రికవరీ ఏజెంట్లు అసభ్యకరమైన పదజాలం వాడటం, వ్యక్తిగత దాడులకు దిగడం, బహిరంగంగా అవమానించడం లేదా రుణం పొందిన వ్యక్తి బంధువులు, మిత్రులు, సహద్యోగులను బెదిరించడాన్ని ఆర్‌బీఐ తీవ్రంగా పరిగణించింది.

మొబైల్ ఫోన్లలోని కాంటాక్ట్స్, ఫోటోలు, మెసేజ్‌లు, కాల్ రికార్డులు, లొకేషన్ హిస్టరీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని రికవరీ కోసం సేకరించడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఈఎంఐల చెల్లింపు బాధ్యత మారదు

కొత్త రూల్స్ కస్టమర్లను వేధింపుల నుంచి మాత్రమే కాపాడతాయని, అప్పు తీర్చే బాధ్యత నుంచి కాదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. బకాయి పడ్డ ఈఎంఐలు, అసలు, వడ్డీ చెల్లించాల్సిన బాధ్యత పూర్తిగా రుణగ్రహీతలదే. చెల్లింపులు సరిగ్గా చేయకపోతే క్రెడిట్ స్కోరు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కస్టమర్ల కోసం బ్యాంకులు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసి, సమస్య పరిష్కార మార్గాలను వివరించాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More