Home loan interest rates : హోమ్​ లోన్​ వడ్డీ రేట్లు- ఏ బ్యాంకులో తక్కువ?

Home loan : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. రెపో రేటును 5.25 శాతంగా యథాతథంగా ఉంచింది. దీనితో ఇళ్ల స్థలాలు, ఇళ్లు కొనాలనుకునే వారికి హోమ్ లోన్ వడ్డీ రేట్లు, ఈఎంఐల భారం పెరగకుండా ఊరట లభించింది. ఈ నేపథ్యంలో వివిధ బ్యాంకుల ప్రస్తుతం ఉన్న హోమ్​ లోన్ వడ్డీ రేట్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 8, 2026, 14:01:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Home loan interest rates in india : సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి పెద్ద ఊరట లభించింది. గత వారం జరిగిన ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్బీఐ తన కీలక బెంచ్‌మార్క్ రెపో రేటును 5.25 శాతం వద్ద ఎలాంటి మార్పు లేకుండా యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. మార్కెట్ నిపుణులు అంచనా వేసినట్లుగానే కేంద్ర బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.

హోమ్ లోన్ వడ్డీ రేట్ల వివరాలు.. (Pixabay)
హోమ్ లోన్ వడ్డీ రేట్ల వివరాలు.. (Pixabay)

పాలసీ రెపో రేటును 5.25 శాతం వద్దే ఉంచడానికి, తమ ద్రవ్య విధానాన్ని "న్యూట్రల్" (తటస్థ) స్టాన్స్‌లోనే కొనసాగించడానికి మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా ఓటు వేసిందని ఆర్బీఐ తన ప్రకటనలో స్పష్టం చేసింది.

పెరుగుతున్న ద్రవ్యోల్బణ ముప్పులు మరింత ఎక్కువైనప్పటికీ, ఈ తరుణంలో మార్కెట్ పరిస్థితులపై మరింత స్పష్టత వచ్చే వరకు వేచి చూడడమే సరైన నిర్ణయమని కమిటీ భావించింది. అందుకే పాలసీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకూడదని కమిటీ నిర్ణయించింది. అదే సమయంలో మార్కెట్ గణాంకాల ఆధారంగా భవిష్యత్తు నిర్ణయాలు ఉంటాయని, సాధారణ ధరల స్థాయిపై సరఫరా పరమైన ఒత్తిళ్లు, ద్రవ్యోల్బణ అంచనాలను నిరంతరం నిశితంగా గమనిస్తామని ఆర్బీఐ పేర్కొంది.

రెపో రేటు ప్రభావం.. హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఎలా మారతాయి?

సాధారణ వాణిజ్య బ్యాంకులకు అప్పుగా ఇచ్చే నిధులపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటునే 'రెపో రేటు' అంటారు. ఈ రేటులో జరిగే మార్పులు నేరుగా మనం తీసుకునే గృహ రుణాల వడ్డీ రేట్లపై ప్రభావం చూపుతాయి.

రెపో రేటు పెరిగినప్పుడు బ్యాంకులు ఆర్బీఐ నుంచి తెచ్చుకునే నిధుల వ్యయం పెరుగుతుంది. దీనితో బ్యాంకులు కూడా కస్టమర్లపై భారం వేస్తూ లోన్ వడ్డీ రేట్లను, నెలవారీ ఈఎంఐలను పెంచుతాయి. ఒకవేళ రెపో రేటు తగ్గితే రుణాలు చౌకగా మారుతాయి. ఇప్పుడు రెపో రేటులో ఎలాంటి మార్పు లేకపోవడంతో వివిధ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు కూడా ప్రస్తుతానికి స్థిరంగానే కొనసాగనున్నాయి.

వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు అందిస్తున్న తాజా వడ్డీ రేట్ల వివరాలు కింద చూడవచ్చు:

ప్రభుత్వ రంగ బ్యాంకులు:

బ్యాంక్ ఆఫ్ ఇండియా: 7.10% (అన్నింటికంటే తక్కువ)

కెనరా బ్యాంక్: 7.15%

పంజాబ్ నేషనల్ బ్యాంక్: 7.20%

బ్యాంక్ ఆఫ్ బరోడా: 7.20%

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): 7.25%

ప్రైవేట్ రంగ బ్యాంకులు:

ఫెడరల్ బ్యాంక్: 7.30% (అన్నింటికంటే తక్కువ)

కోటక్ మహీంద్రా బ్యాంక్: 7.60%

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: 7.75%

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్: 7.75%

యాక్సిస్ బ్యాంక్: 8%

హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు:

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్: 7.15% (అన్నింటికంటే తక్కువ)

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్: 7.25%

పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్: 7.75%

ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్: 8.5%

ప్రస్తుత మార్కెట్ వివరాల ప్రకారం బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, కెనరా బ్యాంకులు ఏడాదికి 7.1% నుంచి 7.15% ప్రారంభ ధరలతోనే అత్యంత తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలు అందిస్తున్నాయి.

అయితే హోమ్​ లోన్​పై వడ్డీ అనేది మీ క్రెడిట్​ హిస్టరీ, క్రెడిట్​ స్కోర్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ క్రెడిట్​ స్కోర్​ ఉంటే, తక్కువ వడ్డీకే రుణాలు లభించవచ్చు. అదే స్కోర్​ పడిపోతూ ఉంటే.. వడ్డీ రేటు పెరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి లోన్​ లభించకపోవచ్చు కూడా!

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. హోమ్​ లోన్​ తీసుకోవడం రిస్కీ అని గుర్తుపెట్టుకోవాలి.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More