Cars discount : డస్టర్​ నుంచి క్విడ్ వరకు.. ఈ సెప్టెంబర్​లో రెనాల్ట్​ కార్లపై భారీ డిస్కౌంట్లు!

వినాయక చవితి వేళ కొత్త కారు కొనాలనుకునే వారికి రెనాల్ట్ ఇండియా తీపి కబురు అందించింది. డస్టర్, కైగర్, ట్రైబర్, క్విడ్ మోడళ్లపై సెప్టెంబర్ నెలలో భారీ, ఆకర్షణీయమైన ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలు..

Published on: Sep 11, 2026, 11:20:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితితో ప్రారంభమయ్యే పండుగల సందడి దసరా, దీపావళి వరకు కొనసాగుతుంది. ఈ శుభ సమయాల్లో కొత్త వాహనాలు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే సేల్స్​ పెంచుకోవాలని ప్రముఖ ఫ్రెంచ్ ఆటోమొబైల్ తయారీ సంస్థ ‘రెనాల్ట్ ఇండియా’ పెద్ద ఎత్తున డిస్కౌంట్లను ప్రకటించింది. సెప్టెంబర్ 2026 నెలకు గాను తన వాహన శ్రేణిపై భారీ ఆఫర్లు, క్యాష్ బ్యాక్‌లు, ఎక్స్​ఛేంజ్ బోనస్‌లను ప్రవేశపెట్టింది. సంస్థ విక్రయిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ డస్టర్‌తో పాటు కైగర్, ట్రైబర్, హ్యాచ్‌బ్యాక్ క్విడ్ మోడళ్లపై ఈ ప్రయోజనాలు లభిస్తాయి.

రెనాల్ట్ డస్టర్​పై అదిరే ఆఫర్లు..
రెనాల్ట్ డస్టర్​పై అదిరే ఆఫర్లు..

ఎంచుకునే వేరియంట్, పాత కారు మార్పిడి ఆధారంగా గరిష్టంగా రూ. 1.80 లక్షల వరకు ఆదా చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఈ సెప్టెంబర్​ 2026లో రెనాల్ట్​ కార్లపై ఉన్న ఆఫర్ల వివరాలను ఇక్కడ చూసేయండి..

కొత్త డస్టర్‌పై ఏకంగా రూ. 1.80 లక్షల వరకు ఆదా!

రెనాల్ట్ సంస్థ తన డిస్కౌంట్ జాబితాలో అత్యధిక ప్రయోజనాలను కొత్త తరం డస్టర్ ఎస్‌యూవీకి కేటాయించింది. పండుగ సీజన్ కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు వినూత్న ప్యాకేజీలను రూపొందించింది.

ఎంపిక చేసిన మోడళ్లపై రూ. 30,000 వరకు నేరుగా నగదు తగ్గింపు లభిస్తోంది. పాత వాహనాన్ని ఇచ్చి కొత్తది తీసుకునే వారికి లేదా స్క్రాపేజ్ విధానాన్ని ఎంచుకునే వారికి రూ. 50,000 వరకు ఎక్స్​ఛేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. ఇక ఇప్పటికే రెనాల్ట్ కారు కలిగి ఉన్న వినియోగదారులకు రూ. 10,000 రాయల్టీ బోనస్ అందిస్తున్నారు. పాత డస్టర్ కారును విక్రయించి సరికొత్త డస్టర్‌గా అప్‌గ్రేడ్ చేసుకునే పాత కస్టమర్లకు ఏకంగా రూ. 1 లక్ష వరకు ప్రత్యేక రాయల్టీ బోనస్‌ను కంపెనీ ఇస్తోంది.

కైగర్, ట్రైబర్‌లపై ఆకర్షణీయ ప్యాకేజీలు..

సబ్‌-కాంపాక్ట్ ఎస్‌యూవీ కైగర్ కొనుగోలుపై కూడా కంపెనీ రూ. 85,000 వరకు తగ్గింపులను వర్తింపజేస్తోంది. ఇందులో రూ. 30,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 వరకు రాయల్టీ బోనస్, మరో రూ. 25,000 వరకు ఎక్స్​ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ప్రయోజనం ఉన్నాయి. వీటితో పాటు అర్హులైన కార్పొరేట్ ఉద్యోగులు లేదా గ్రామీణ ప్రాంత వినియోగదారులకు అదనంగా రూ. 5,000 వరకు ప్రత్యేక తగ్గింపు లభిస్తుంది.

కుటుంబ ప్రయాణాలకు అనువైన 7-సీటర్ ఎంపీవీ ట్రైబర్​పై మొత్తం రూ. 50,000 వరకు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇందులో రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 ఎక్స్​ఛేంజ్ బోనస్, అలాగే కార్పొరేట్ లేదా రూరల్ ఆఫర్ కింద మరో రూ. 5,000 ఆదా చేసుకోవచ్చు.

ఎంట్రీ లెవెల్ క్విడ్‌పై తగ్గనున్న భారం..

మధ్యతరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉండే బడ్జెట్ కారు రెనాల్ట్ క్విడ్​పై రూ. 40,000 వరకు తగ్గింపు సదుపాయం కల్పించారు. వేరియంట్‌ను బట్టి రూ. 15,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 వరకు స్క్రాపేజ్ బోనస్‌ను పొందవచ్చు.

ఈ డిస్కౌంట్లు డీలర్‌షిప్ వద్ద అందుబాటులో ఉన్న కారు స్టాక్, ఎంచుకునే మోడల్ వేరియంట్, నగరాల ఆధారంగా మారే అవకాశముందని గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ సమీపంలోని అధికారిక రెనాల్ట్ షోరూమ్‌ను సంప్రదించి ఖచ్చితమైన వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More