...
...
Next Story

Renault cars : 18 నెలలు.. 12 కార్లు! ఇండియా కోసం రెనాల్ట్ క్రేజీ ప్లాన్

Upcoming Renault cars : ఫ్రెంచ్ కార్ల దిగ్గజం రెనాల్ట్ భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. రాబోయే 18 నెలల్లో ఏకంగా 12 కార్లతో (ఫేస్‌లిఫ్ట్‌లు, సరికొత్త మోడళ్లు) వినియోగదారుల ముందుకు రానున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

Published on: Jul 7, 2026, 06:43:55 IST
Advertisement

భారత ఆటోమొబైల్ మార్కెట్లో తీవ్రమైన పోటీని ఎదుర్కొనేందుకు ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. రాబోయే కాలంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఒకేసారి 12 సరికొత్త మోడళ్లు, అప్‌డేట్లను రంగంలోకి దించుతోంది. ఈ మేరకు రానున్న 18 నెలల కాలంలో మొత్తం 12 కొత్త ప్రొడక్ట్ లాంచ్‌లు లేదా అప్‌డేట్లను తీసుకురానున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. ఈ సరికొత్త ఇన్నింగ్స్ 2027 చివరి వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని కంపెనీ వెల్లడించింది.

ఇండియాలో రెనాల్ట్ కార్ల లైనప్..
ఇండియాలో రెనాల్ట్ కార్ల లైనప్..

ఇప్పటికే మార్కెట్లో ఉన్న క్విడ్, కైగర్, ట్రైబర్ మోడళ్లకు తోడుగా సరికొత్త తరం డస్టర్ ఎస్‌యూవీని కూడా తీసుకొచ్చి భారత్‌లో మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకోవాలని రెనాల్ట్ భావిస్తోంది. గత ఏడాదిలోనే కైగర్, ట్రైబర్ మోడళ్ల రీఫ్రెష్డ్ వెర్షన్లను తెచ్చిన కంపెనీ, గత వారం సరికొత్త బ్రాండ్ లోగో, సులభమైన వేరియంట్లతో అప్‌డేటెడ్ క్విడ్‌ను మార్కెట్లోకి వదిలిన విషయం తెలిసిందే.

7-సీటర్ డస్టర్, హైబ్రిడ్ ఇంజన్..

మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన డస్టర్ మోడల్‌ను సరికొత్త జనరేషన్ లుక్‌తో రెనాల్ట్ ఈ ఏడాది తొలినాళ్లల్లో తిరిగి ప్రవేశపెట్టింది. అయితే కంపెనీ ఆలోచనలు కేవలం 5-సీటర్ మోడల్‌కే పరిమితం కాలేదు! పెద్ద కుటుంబాల అవసరాలను, మారుతున్న మార్కెట్ ట్రెండ్స్‌ను దృష్టిలో ఉంచుకుని డస్టర్ ఆధారిత 3-వరుసల సీటింగ్ మోడల్‌ను కూడా తీసుకురాబోతున్నారు. ఈ పెద్ద ఎస్‌యూవీ ప్రస్తుత 5-సీటర్ ప్లాట్‌ఫారమ్, స్టైలింగ్‌ను పంచుకోవడమే కాకుండా, ఇందులో పర్యావరణహిత 'హైబ్రిడ్' ఇంజన్ ఆప్షన్‌ను కూడా అందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భారత్‌లో పెరుగుతున్న మైలేజ్ డిమాండ్‌కు ఈ హైబ్రిడ్ మోడల్ పెద్ద ప్లస్ కానుంది.

భారత ఈవీ మార్కెట్లో టాటా, మహీంద్రా వంటి కంపెనీలు చౌక ఈవీలతో దూసుకుపోతున్నాయి. ఈ రేసులో వెనుకబడకూడదని రెనాల్ట్ కూడా ఒక 'ఏ-సెగ్మెంట్' కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్ కోసం సిద్ధం చేస్తోంది. ఈ కారు ధరను సామాన్యుడికి అందుబాటులో ఉంచేందుకు భారతదేశంలోనే విడిభాగాలను భారీగా తయారు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలోనే ఒక బెస్ట్ ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి రానుంది. వీటితో పాటు 'బ్రిడ్జర్ కాన్సెప్ట్' ఆధారిత కాంపాక్ట్ ఎస్‌యూవీ కూడా పైప్‌లైన్‌లో ఉంది.

ప్రతి రెండు నెలలకో సర్‌ప్రైజ్!

కంపెనీ ప్రకటించిన 12 ప్రొడక్ట్ యాక్షన్లలో అన్నీ సరికొత్త కార్లే ఉండకపోవచ్చు! కొన్ని లిమిటెడ్ ఎడిషన్లు, కాస్మెటిక్ మార్పులు, సరికొత్త టెక్నాలజీ అప్‌గ్రేడ్లు, డిజైన్ మార్పులు కూడా ఉంటాయి.

"రాబోయే నెలల్లో వినియోగదారులు రెనాల్ట్ నుంచి నిరంతరాయంగా అప్‌డేట్లను చూస్తారు. ప్రతి రెండు నెలల కాలంలో కనీసం ఒక కొత్త ప్రకటన, లిమిటెడ్ ఎడిషన్ లేదా సరికొత్త ఇంజన్ ఆప్షన్ వంటివి మార్కెట్లోకి వస్తూనే ఉంటాయి," అని రెనాల్ట్ ఇండియా సీఈఓ స్టెఫాన్ డెబ్లైస్ స్పష్టం చేశారు.

2026లో మిగిలిన కాలంలోనే నాలుగు కీలక ప్రొడక్ట్ అప్‌డేట్లను లాంచ్ చేసేందుకు రెనాల్ట్ సన్నాహాలు చేస్తోంది. ఎస్‌యూవీలు, బడ్జెట్ ఈవీలు, సరికొత్త టెక్నాలజీతో వస్తున్న రెనాల్ట్.. భారత మార్కెట్లో మళ్లీ ఏ మేరకు సేల్స్ పెంచుకుంటుందో వేచి చూడాలి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe