Republic day 2026 : దిల్లీలో అట్టహాసంగా రిపబ్లిక్​ డే పరేడ్​- శుభాన్షు శుక్లాకు అశోక చక్ర

దేశ రాజధాని దిల్లీలోని కర్తవ్య పథ్​లో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పరేడ్​లో ఈయూ టాప్​ లీడర్లు అతిథులుగా హాజరయ్యారు. ప్రధాని మోదీతో పాటు అనేక మంది ప్రముఖులు ఈ పరేడ్​లో పాల్గొన్నారు.

Published on: Jan 26, 2026, 10:46:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. భారత రాజ్యాంగ స్ఫూర్తిని చాటుతూ, దేశ రాజధానిలోని కర్తవ్య పథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. జెండా ఆవిష్కరణ పూర్తయిన వెంటనే, జాతీయ గీతాలాపన జరుగుతుండగా.. గాలిలోకి తూటాలు పేల్చుతూ భారత సైన్యం సమర్పించిన '21 తుపాకుల గౌరవ వందనం' అక్కడి వాతావరణాన్ని దేశభక్తితో నింపేసింది.

కర్తవ్య పథ్​లో భారత సైన్యం..
కర్తవ్య పథ్​లో భారత సైన్యం..

ఈ రిపబ్లిక్​ డే పరేడ్​లో ముర్ముతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేబినెట్​ మంత్రులు, అనేక మంది ఎంపీలు, ప్రముఖులు పాల్గొన్నారు.

యూరోపియన్​ కౌన్సిల్​ అధ్యక్షుడు ఆంటోనియో లూయిస్​ శాంటోస్​ డా కోస్టా, యూరోపియన్​ కమిషన్​ ప్రెసిడెంట్​ ఉర్సులా వాన్​డెర్​ లేయన్​ తదితరులు నేటి గణతంత్ర దినోత్స వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

శుభాన్షు శుక్లాకు అశోక చక్ర..

గ్రూప్​ కెప్టెన్​, ఇస్రో ప్రతిష్ఠాత్మక గగన్యాన్​ వ్యోమగామి శుభాన్షు శుక్లాకు అరుదైన గౌరవం దక్కింది. పరేడ్​లో భాగంగా శుక్లాని అశోక చక్రతో సత్కరించారు రాష్ట్రపతి ముర్ము.

2025 జూన్​లో నాసా తరఫున శుక్లా ఐఎస్​ఎస్​ (ఇంటర్నేషనల్​ స్పేస్​ స్టేషన్​)కి వెళ్లిన విషయం తెలిసిందే.

అనంతరం భారత దేశ సంస్కృతి, వారసత్వం, సైనిక శక్తిని ప్రతిబింబిస్తూ వివిధ విభాగాలు తమ శకటాలను ప్రదర్శించాయి.

వినూత్నంగా గ్యాలరీల నామకరణం..

భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈసారి సరికొత్త రంగును అద్దుకున్నాయి. దేశ రాజధానిలోని కర్తవ్య పథ్‌లో పరేడ్ వీక్షించేందుకు విచ్చేసిన అతిథుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీల విషయంలో రక్షణ మంత్రిత్వ శాఖ ఒక అద్భుతమైన మార్పును తీసుకొచ్చింది. సాధారణంగా ఉండే 'వీవీఐపీ' లేదా ఇతర హోదాల పేర్లను పక్కనపెట్టి, మన దేశ సంస్కృతికి, నాగరికతకు ప్రతిబింబాలైన వివిధ నదుల పేర్లను ఆయా ఎన్‌క్లోజర్లకు పెట్టారు.

పరేడ్ వేదికకు సమీపంలోని వీధుల్లో క్రమ పద్ధతిలో లేఅవుట్ మ్యాప్‌లు, బ్యానర్‌లను ఏర్పాటు చేశారు. అతిథులు తమకు కేటాయించిన నది పేరు గల గ్యాలరీని సులభంగా చేరుకునేలా ఈ సూచికలు సహాయపడుతున్నాయి. గంగా, యమునా, కృష్ణా, నర్మద, పెరియార్ వంటి నదుల పేర్లతో పిలిచే ఈ ఎన్‌క్లోజర్లు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ నిర్ణయం వెనుక భారతీయ భౌగోళిక వైవిధ్యాన్ని చాటిచెప్పాలనే ఉద్దేశం ఉంది. దేశంలోని నలుమూలల నుంచి ప్రవహించే 23 ప్రధాన నదుల పేర్లను ఈ గ్యాలరీలకు పెట్టారు. ఆ జాబితా ఇక్కడ చూడవచ్చు:

బియాస్, బ్రహ్మపుత్ర, చంబల్, చీనాబ్, గండక్, గంగా, ఘాగ్రా, గోదావరి, సింధు, జీలం, కావేరి, కోసి, కృష్ణా, మహానది, నర్మద, పెన్నార్, పెరియార్, రావి, సోన్, సట్లెజ్, తీస్తా, వైగై, యమునా.

జాతీయ యుద్ధ స్మారకానికి మోదీ..

అంతకుముందు దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకానికి వెళ్లారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దేశ రక్షణ కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన జవాన్ల జ్ఞాపకార్థం పుష్పగుచ్ఛాన్ని ఉంచి అంజలి ఘటించారు. అనంతరం అమర జవాన్ల గౌరవార్థం ఆయన రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

కర్తవ్య నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ఆ వీరపుత్రులకు దేశం తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని ఈ నివాళి కార్యక్రమాన్ని నిర్వహించారు.

గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రధాన పరేడ్ ప్రారంభానికి ముందు, ఏటా జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రధాని ప్రధాన వేడుకలు జరిగే ప్రదేశానికి బయలుదేరారు.

ప్రత్యేక ఆకర్షణగా మోదీ తలపాగా..

ఏటా రిపబ్లిక్ డే వేడుకల్లో దేశంలోని ఏదో ఒక ప్రాంతపు విశిష్టతను ప్రతిబింబించేలా విభిన్నమైన తలపాగాను ధరించడం మోదీకి ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తనదైన శైలిలో భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పారు.

నేటి వేడుకల కోసం ప్రధాని మోదీ.. డార్క్​ బ్లూ రంగు కుర్తాపై లేత నీలం రంగు 'నెహ్రూ జాకెట్'ను ధరించారు. అయితే, ఆయన ఆహార్యంలో అన్నింటికంటే ప్రత్యేకంగా నిలిచింది ఆయన ధరించిన తలపాగా.

ఎరుపు రంగు ప్రధానంగా ఉండి, దానిపై పసుపు రంగు డిజైన్లతో అలంకరించిన ఈ 'సఫా' ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అక్కడక్కడ మెరిసే ఆకుపచ్చ రంగు చారలు ఈ తలపాగాకు మరింత నిండుదనాన్ని ఇచ్చాయి.

రిపబ్లిక్​ డే 2026 - భద్రతా వలయంలో దిల్లీ..

77వ గణతంత్ర దినోత్సవం, కర్తవ్య పథ్​ వద్ద రిపబ్లిక్​ డే పరేడ్​ నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీ భద్రతా వలయంలోకి జారుకుంది. వేడుకల వేళ దిల్లీ పోలీసులు హై అలర్ట్​ ప్రకటించారు. నగరం వ్యాప్తంగా 30వేలకు పైగా సిబ్బందిని మోహరించారు. ఒక్క న్యూ దిల్లీ జిల్లాలోనే 10వేల మంది పోలీసులు గస్తీ కాస్తున్నారు. పరేడ్​ మార్గం, హై-సెక్యూరిటీ జోన్లను వీరు పర్యవేక్షిస్తున్నారు.

అడ్వాన్స్​డ్​ వీడియో ఎనలిటిక్స్​, ఫేష్​యల్​ రికగ్నీషన్​ సిస్టెమ్​ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 3వేలకుపైగా సీసీటీవీ కెమెరాలను న్యూ దిల్లీలో ఏర్పాటు చేశారు. ఫలితంగా రిపబ్లిక్​ డే పరేడ్​, ఇతర కీలక పాంత్రాలను అధికారులు క్షణక్షణం మానిటర్​ చేస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More