IPL 2026: బెడిసికొట్టిన పంత్ ఓపెనింగ్ ప్రయోగం.. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో లక్నో చిత్తు.. అయినా మారని కెప్టెన్!
IPL 2026: ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ కు ఫస్ట్ మ్యాచ్ లోనే షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఆ టీమ్ చిత్తయింది. లక్నో కెప్టెన్ పంత్ ఓపెనింగ్ ప్రయోగం బెడిసికొట్టింది. అయినా కూడా టాప్ ఆర్డర్లోనే బ్యాటింగ్ కు వస్తానని పంత్ చెప్పడం గమనార్హం.
ఏదో అనుకుంటే ఇంకేదో అయింది.. ఓపెనర్ గా చెలరేగిపోదామని రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. కానీ తుస్సుమన్నాడు. ఈ ప్రయోగం బెడిసికొట్టింది. చివరకు లక్నో సూపర్ జెయింట్స్ చిత్తుగాక తప్పలేదు. బుధవారం (ఏప్రిల్ 1) రాత్రి జరిగిన పోరులో లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.
ఓపెనర్ గా పంత్
ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ ఫస్ట్ మ్యాచ్ లో ఆ టీమ్ కెప్టెన్ రిషబ్ పంత్ ఓపెనర్ గా ఆడాడు. టీ20 క్రికెట్‌లో దాదాపు దశాబ్ద కాలం ప్రయాణించిన రిషబ్ పంత్, ఇప్పటివరకు కేవలం 23 సార్లు మాత్రమే ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.
అందులోనూ ఐపీఎల్‌లో అతను ఓపెనింగ్ చేసింది కేవలం ఏడు సార్లు మాత్రమే. 2016లో ఢిల్లీ తరపున ఐదుసార్లు ఓపెనింగ్ చేసిన పంత్, మళ్లీ ఇన్నాళ్ల తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఓపెనర్ గా వచ్చాడు.
బెడిసికొట్టిన ప్రయోగం
బ్యాటింగ్ ఆర్డర్లో నెంబర్ 3 స్థానం కోసం మిచెల్ మార్ష్, పంత్ మధ్య పోటీ ఉంటుందని అందరూ భావించిన వేళ, లక్నో మేనేజ్‌మెంట్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ వారిద్దరినీ ఓపెనర్లుగా పంపింది. అయితే ఈ వ్యూహం బెడిసికొట్టింది. పంత్ 9 బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి రనౌట్ అయ్యాడు. ప్రారంభంలోనే వికెట్లు కోల్పోవడంతో మిగిలిన బ్యాటింగ్ లైనప్ ఒత్తిడికి లోనైంది.
పక్కా ప్లాన్
మ్యాచ్ అనంతరం పంత్ మాట్లాడుతూ, ఇది ఆకస్మిక నిర్ణయం కాదని, ఒక పక్కా ప్లాన్ అని వివరించాడు. "నికోలస్ పూరన్ మిడిల్ ఆర్డర్ బాధ్యతలు తీసుకోవడంతో, టాప్ ఆర్డర్‌లో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఉండాలని భావించాం. దీనివల్ల ప్రత్యర్థి జట్టు లెఫ్టార్మ్ స్పిన్నర్లను (ముఖ్యంగా అక్షర్ పటేల్ వంటి వారిని) పవర్‌ప్లేలో వాడకుండా అడ్డుకోవచ్చని ప్లాన్ చేశాం. కానీ దురదృష్టవశాత్తు నేను రాంగ్ టైమ్ లో ఔట్ అయ్యా’’ అని పంత్ చెప్పాడు.
టాప్ ఆర్డర్లోనే
సాధారణంగా పంత్ మిడిలార్డర్ లో వస్తాడు. కానీ ఈ సీజన్ లో మాత్రం టాప్ ఆర్డర్లోనే ఆడతానని అంటున్నాడు. భవిష్యత్తులో కూడా ఓపెనర్‌గా వస్తారా అన్న ప్రశ్నకు పంత్ స్పందిస్తూ, "ఇది 50-50 ఛాన్స్. కానీ కచ్చితంగా నేను టాప్ ఆర్డర్లోనే బ్యాటింగ్ చేస్తా" అని స్పష్టం చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 5న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.
లక్నో చిత్తు
ఢిల్లీ క్యాపిటల్స్ తో పోరులో లక్నో చిత్తయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆ టీమ్ 141 పరుగులకు ఆలౌటైంది. అబ్దుల్ సమద్ (36) టాప్ స్కోరర్. ఎంగిడి, నటరాజన్ మూడు వికెట్ల చొప్పున పడగొట్టారు. ఛేజింగ్ లో సమీర్ రిజ్వీ (47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 70 నాటౌట్) చెలరేగడంతో ఢిల్లీ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ రీచ్ అయింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


