...
...
Next Story

కీమోథెరపీకి ప్రత్యామ్నాయంగా భారత్ 'స్మార్ట్' క్యాన్సర్ డ్రగ్.. ఆర్కే-251 విప్లవాత్మక ఆవిష్కరణ

సాంప్రదాయ కీమోథెరపీ వల్ల ఆరోగ్యకరమైన కణాలకు జరిగే నష్టానికి స్వస్తి పలుకుతూ భారత శాస్త్రవేత్తలు 'ఆర్కే-251' అనే స్మార్ట్ క్యాన్సర్ ఔషధాన్ని అభివృద్ధి చేశారు. కేవలం క్యాన్సర్ కణాల పైనే దాడి చేసే ఈ ఔషధం వివరాలు తెలుసుకోండి.

Published on: Aug 21, 2026, 14:59:25 IST
Advertisement

క్యాన్సర్ చికిత్సారంగంలో భారతదేశం అద్భుత ఘనత సాధించింది. సాధారణంగా వాడే కీమోథెరపీ వల్ల క్యాన్సర్ కణాలతో పాటు శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతిని రోగులు తీవ్ర సైడ్ ఎఫెక్ట్స్‌కు గురవుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా, కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని పనిచేసే 'స్మార్ట్' క్యాన్సర్ ఔషధాన్ని రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

కీమోథెరపీకి ప్రత్యామ్నాయంగా భారత్ 'స్మార్ట్' క్యాన్సర్ డ్రగ్.. ఆర్కే-251 (ప్రతీకాత్మక చిత్రం)
కీమోథెరపీకి ప్రత్యామ్నాయంగా భారత్ 'స్మార్ట్' క్యాన్సర్ డ్రగ్.. ఆర్కే-251 (ప్రతీకాత్మక చిత్రం)

'ఆర్కే-251' (RK-251) గా నామకరణం చేసిన ఈ ఔషధం, శరీరంలో ప్రయాణిస్తున్నప్పుడు సాధారణ కణజాలాలలో నిద్రాణంగా (Inactive) ఉంటూ, క్యాన్సర్ ఉన్న చోటికి చేరుకోగానే ఉత్తేజితమవుతుంది (Switched on).

ఐఏఎస్ఎస్టీ, ఐఐటీ గువాహటి సంయుక్త ఆవిష్కరణ

ఈ విప్లవాత్మక ఔషధాన్ని గువాహటిలోని [ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IASST)] శాస్త్రవేత్త డాక్టర్ ఆసిస్ బాలా, ఐఐటీ గువాహటి (IIT Guwahati) నిపుణుడు డాక్టర్ కేపీ భబక్ నేతృత్వంలోని పరిశోధక బృందం అభివృద్ధి చేసింది.

ఆర్కే-251 ఎలా పనిచేస్తుంది?

క్యాన్సర్ కణాలలో 'రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషిస్' (ROS) అనే హానికారక అణువుల స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు వివరించారు. ఆర్కే-251 ఔషధం క్యాన్సర్ కణంలోకి ప్రవేశించినప్పుడు, అక్కడ ఉన్న అధిక ROS స్థాయిలు ఈ మందును ఆటోమేటిక్‌గా యాక్టివేట్ చేస్తాయి.

ఇలా యాక్టివేట్ కాగానే, ఈ ఔషధం నుండి 'ఎన్‌బిడిహెచ్‌ఈఎక్స్' (NBDHEX) అనే శక్తివంతమైన క్యాన్సర్ నిరోధక సమ్మేళనం విడుదలవుతుంది. క్యాన్సర్ కణాలు బతికి ఉండటానికి, చికిత్సను తట్టుకోవడానికి ఉపయోగించే ప్రోటీన్లను ఈ సమ్మేళనం సమర్థవంతంగా అడ్డుకుంటుంది.

పరిశోధనల్లో కీలక ఫలితాలు

మనుషులపై ప్రయోగాలకు ముందు నిర్వహించిన ప్రీ-క్లినికల్ అధ్యయనాలలో ఆర్కే-251 అత్యుత్తమ ఫలితాలను కనబరిచింది. అత్యంత వేగంగా వ్యాపించే 'ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్' (Triple-negative breast cancer) కణాలపై ఇది తీవ్ర ప్రభావం చూపగా, ఆరోగ్యకరమైన కణాలకు దాదాపు ఎలాంటి హాని తలపెట్టలేదని తేలింది.

ప్రస్తుతం దేశంలో క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో ఆరోగ్య రంగానికి పెద్ద సవాలుగా మారింది. మనదేశంలో ప్రతి ఏటా 14 లక్షలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా, 7 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార (గర్భాశయ) క్యాన్సర్, పేగు క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, పొగాకు వాడకం ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe