Real Estate : కోట్లు విలువ చేసే లగ్జరీ ఇళ్లు! భారత క్రికెటర్ల అత్యంత ఖరీదైన ఆస్తుల వివరాలు ఇవే..

Virat Kohli net worth : భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే సెలబ్రిటీల్లో క్రికెటర్లు ముందు వరుసలో ఉంటారు. మైదానంలోనే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలోనూ భారీ పెట్టుబడులు పెట్టిన టాప్ ఇండియన్ క్రికెటర్ల లగ్జరీ ఇళ్లు, వాటి విలువలపై ప్రత్యేక కథనం చూసేయండి.

Published on: Jun 13, 2026, 10:43:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Indian Cricketers Expensive Homes : భారతదేశంలో క్రికెటర్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక్కడ క్రికెట్‌ను ఒక మతంగా, ఆటగాళ్లను ఆరాధ్య దైవాలుగా భావిస్తారు. మన దేశంలో అత్యధిక సంపాదన కలిగిన సెలబ్రిటీల జాబితా తీస్తే అందులో క్రికెట్ స్టార్లే ముందుంటారు. వారి సంపాదనకు తగ్గట్టుగానే వారి జీవనశైలి, ఆస్తుల విలువ కూడా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో మన స్టార్ క్రికెటర్లు పెట్టిన పెట్టుబడులు, వారు నివసించే లగ్జరీ ఇళ్ల విలువలు చూస్తే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే.

భారత క్రికెటర్లు- వారి ఖరీదైన ఇళ్లులు..
భారత క్రికెటర్లు- వారి ఖరీదైన ఇళ్లులు..

ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజాలు, వారి కుటుంబాలకు ఉన్న అత్యంత ఖరీదైన ఇళ్లు, వాటి ప్రత్యేకతలపై ఓ లుక్కేద్దాము.

సచిన్ టెండూల్కర్..

భారత క్రికెట్ చరిత్రలో 'గాడ్ ఆఫ్ క్రికెట్' గా నిలిచిన సచిన్ టెండూల్కర్.. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నప్పటికీ, తన సొంత ఊరు ముంబైపై ఉన్న ప్రేమను ఎప్పుడూ చాటుకుంటూనే ఉంటారు. ముంబైలోని బీకేసీలో ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్ సహా ఆయనకు పలు ఆస్తులు ఉన్నాయి. అయితే బాంద్రాలో ఉన్న ఐదు అంతస్తుల భవనం 'దొరాబ్ విల్లా' ఆయన శాశ్వత నివాసం. 2007లో అక్కడ నివసించిన ఒక పార్సీ కుటుంబం నుంచి ఈ స్థలాన్ని సచిన్ రూ. 39 కోట్లకు కొనుగోలు చేశారు. అప్పట్లో శిథిలావస్థకు చేరిన ఆ బంగ్లాను దాదాపు నాలుగేళ్ల పాటు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత 2011లో 6,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ సరికొత్త ఇంట్లోకి సచిన్ తన కుటుంబంతో కలిసి మారారు. ఈ ఇంట్లో ఉన్న అద్భుతమైన పచ్చని తోట (గార్డెన్) అంటే సచిన్‌కు చాలా ఇష్టం. ముఖ్యంగా వర్షాకాలంలో ఆయన ఇక్కడే ఎక్కువ సమయం గడుపుతారు.

విరాట్ కోహ్లీ..

ప్రస్తుత తరం క్రికెటర్లలో అత్యధిక పారితోషికం తీసుకునే క్రీడాకారుడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు. కోహ్లీకి ముంబై, గురుగ్రామ్, లండన్‌లతో పాటు అలీబాగ్‌లో ఒక హాలిడే హోమ్ ఉంది. అయితే, వీటన్నింటిలో కెల్లా అత్యంత ఖరీదైనది గురుగ్రామ్‌లోని ఆయన ఇల్లే. నగరంలోని అత్యంత సంపన్న ప్రాంతమైన డీఎల్‌ఎఫ్ సిటీ ఫేజ్ 1లో ఈ ఇల్లు ఉంది. కొనుగోలు చేసిన సమయంలో దీని విలువ దాదాపు రూ. 80 కోట్లు అని సమాచారం. ఈ లిస్టులోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఇది ఒకటి. సుమారు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంట్లో అన్ని రకాల ఆధునిక వసతులు ఉన్నాయి. కోహ్లీ లాంటి వరల్డ్ క్లాస్ అథ్లెట్‌కు అత్యంత అవసరమైన అత్యాధునిక హోమ్ జిమ్ కూడా ఈ ఇంటి ప్రత్యేకతల్లో ఒకటి.

వీరేందర్ సెహ్వాగ్..

భారత క్రికెట్ లెజెండ్స్ జాబితాలో వీరేందర్ సెహ్వాగ్ స్థానం ప్రత్యేకమైనది. దిల్లీ నజఫ్‌గఢ్ గల్లీల నుంచి హౌజ్ ఖాస్ వరకు ఆయన ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం. సెహ్వాగ్ తన కెరీర్ అంతటా దిల్లీ నగరానికే ప్రాధాన్యత ఇచ్చారు. హౌజ్ ఖాస్‌లో ఉన్న ఆయన శాశ్వత నివాసం పేరు ‘కృష్ణ నివాస్’. దీని ప్రస్తుత విలువ దాదాపు రూ. 130 కోట్లు ఉంటుందని అంచనా. ఈ భారీ ప్యాలెస్‌లో 12 గదులు, ఆయన పెంచుకునే కుక్కల కోసం ప్రత్యేకంగా ఒక లాన్, ఇంటి ఆవరణలోనే ఒక అందమైన దేవాలయం ఉన్నాయి. ఇవే కాకుండా హరియాణా, నజఫ్‌గఢ్‌లలో కూడా సెహ్వాగ్‌కు కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఉన్నాయి.

యువరాజ్ సింగ్..

టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించడంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అంటే పడిచచ్చే అభిమానులు ఉన్నారు. ఆయన ఆట గురించే కాకుండా, దేశవ్యాప్తంగా ఆయన నిర్మించిన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం గురించి కూడా టెక్ వర్గాల్లో చర్చ నడుస్తుంటుంది. ముంబైలోని వర్లిలో యువరాజ్‌కు రూ. 64 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్‌మెంట్ ఉంది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు నివసించే హౌసింగ్ సొసైటీలోనే యువరాజ్ ఇల్లు కూడా ఉండటం విశేషం. ఇవే కాకుండా చండీగఢ్‌లో ఒక ప్యాలెస్, ఛత్తర్‌పూర్‌లో ఒక ఇల్లు, గుర్గావ్‌లో అపార్ట్‌మెంట్, పంచకుల లగ్జరీ హోమ్‌తో పాటు గోవాలో ఒక విలాసవంతమైన హాలిడే హోమ్ కూడా ఉన్నాయి.

రోహిత్ శర్మ..

భారత క్రికెట్ జట్టులో ఎన్నో అద్భుత రికార్డులను తన పేరిట లిఖించుకున్న హిట్ మాన్ రోహిత్ శర్మ.. ముంబైలోని అత్యంత పోష్ ఏరియా అయిన వర్లిలో నివసిస్తున్నారు. అహుజా టవర్స్ అనే లగ్జరీ హైరైజ్ బిల్డింగ్‌లో ఉన్న ఈ ఫ్లాట్‌ను ఆయన రూ. 30 కోట్లకు కొనుగోలు చేశారు. దాదాపు 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ అపార్ట్‌మెంట్ నుంచి అరేబియా సముద్రం 270 డిగ్రీల కోణంలో అద్భుతంగా కనిపిస్తుంది. 13 అడుగుల ఎత్తైన సీలింగ్, ప్రత్యేకమైన లైబ్రరీ, స్టడీ రూమ్, వాక్-ఇన్ వార్డ్‌రోబ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఈ ఇంటి సొంతం.

సునీల్ గవాస్కర్..

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్.. ప్రస్తుతం తన అద్భుతమైన కామెంటరీతో అలరిస్తున్నారు. ఆయన రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో కూడా చాలా బలంగా ఉంది. ముంబైలోనే కాకుండా దుబాయ్‌లోనూ ఆయనకు భారీ పెట్టుబడులు ఉన్నాయి. అయితే, గవాస్కర్ చేసిన రియల్ ఎస్టేట్ పెట్టుబడులలో గోవాలోని అస్సాగావ్​లో ఉన్న హాలిడే హోమ్ అత్యంత ఖరీదైనది. ‘ఇస్ప్రావా విల్లా వివ్రే’ లో ఉన్న ఈ విల్లా విలువ సుమారు రూ. 20 కోట్లు ఉంటుందని అంచనా.

గౌతమ్ గంభీర్..

టీమిండియా మాజీ ఓపెనర్, ప్రస్తుత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ దిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్​లో నివసిస్తున్నారు. రెండు అంతస్తులు ఉండే ఈ విలాసవంతమైన భవనం విలువ సుమారు రూ. 20 కోట్లు ఉంటుందని అంచనా. ఇంటి లోపలి భాగాలన్నీ తెలుపు రంగు థీమ్‌తో డిజైన్ చేయడం వల్ల ఇల్లు ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా, సానుకూల శక్తితో కనిపిస్తుంది. అతిథులకు ఆతిథ్యం ఇవ్వడం అంటే గంభీర్‌కు చాలా ఇష్టం. ఆయన ఇంట్లో వెండి పాత్రల కలెక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

(గమనిక- ఇది గత కొన్ని నెలల క్రితం డేటా. రియల్​ ఎస్టేట్​ ధరలు ప్రాంతం, సమయం బట్టి మారుతుంటాయి.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More