కూరగాయలపై బూజు, కుళ్లిపోయిన మాంసం, అపరిశుభ్రమైన వంటగది.. ‘లగ్జరీ’ హోటళ్లలో దారుణం! ప్రజల ఆరోగ్యంతో చెలగాటం
బెంగళూరులోని ప్రముఖ 3,5 నక్షత్రాల హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అపరిశుభ్రత, కుళ్లిపోయిన మాంసం, గడువు తీరిన ఆహార పదార్థాలు గుర్తించి నోటీసులు జారీ చేశారు. ఈ సోదాల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బెంగళూరు నగరంలోని పలు ప్రముఖ లగ్జరీ హోటళ్లు.. ఆహార భద్రత ప్రమాణాలను పూర్తిగా గాలికి వదిలేసి, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి! ఈ నేపథ్యంలోనే త్రీ-స్టార్, ఫైవ్-స్టార్ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

కూరగాయలపై బూజు పట్టడం, శాకాహార, మాంసాహార పదార్థాలను సరిగ్గా వేరు చేయకపోవడం, అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో వంటకాలు నిల్వ చేయడం వంటి తీవ్ర ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. నిబంధనలను ఉల్లంఘించిన హోటళ్ల నుంచి కుళ్లిపోయిన మాంసం, చికెన్, చేపలు, ఎక్స్‌పైరీ అయిన బేకరీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
పరిశీలనలో బయటపడ్డ నిబంధనల ఉల్లంఘనలు!
ఫుడ్‌సేఫ్టీ నిబంధనల ప్రకారం లేబులింగ్ లేకపోవడం, ఫుడ్ ప్రొడక్ట్స్‌పై తప్పుడు లేబుల్స్ వేయడం, గడువు ముగిసిన ఆహార పదార్ధాలను నిల్వ చేయడం, అపరిశుభ్రంగా ఫుడ్ హ్యాండ్లింగ్ చేయడం వంటి ఎన్నో లోపాలను తనిఖీల్లో తేల్చారు. నిబంధనలు పాటించని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు అధికారులు వెంటనే నోటీసులు జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 నిబంధనల ప్రకారం అజ్యుడికేటింగ్ ఆఫీసర్ సమక్షంలో తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
ల్యాబ్‌కు ఆహార నమూనాలు..
ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా టీ పొడి, చికెన్, మటన్, చేపలు, వంట నూనె, కారం పొడి, పసుపు పొడి, టమాటో సాస్, నిమ్మరసం, చీజ్, పాపడ్, జీడిపప్పు, అల్లం, మిరియాల పొడి, వివిధ మసాలా దినుసులు, పాలు సహా మొత్తం 35 రకాల ఆహార నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ఫుడ్ ల్యాబొరేటరీకి పంపినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో ఆహార నాణ్యత సరిగ్గా లేదంటూ సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదులు, ప్రజల నుంచి వ్యక్తమైన వ్యతిరేకత నేపథ్యంలో కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేష్ గుండారావు (యూటీ ఖాదర్) ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేసేందుకు 30 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
తనిఖీల్లో వెలుగు చూసిన ప్రముఖ హోటళ్ల జాబితా..
ది లలిత్ అశోక్ (అనెక్స్ సౌత్): 32 లీటర్ల ఎక్స్‌పైరీ పాలు, 76 కిలోల మాంసం, 200 కిలోల కూరగాయలను అధికారులు సీజ్ చేశారు.
షాంగ్రి-లా బెంగళూరు: 15 కిలోల మాంసం స్వాధీనం.
ఫోర్ సీజన్స్ హోటల్ బెంగళూరు: 19 కిలోల మాంసం సీజ్.
వివాంటా బెంగళూరు వైట్‌ఫీల్డ్: 3 కిలోల గడువు తీరిన బేకరీ ఉత్పత్తులు లభ్యం.
తాజ్ యశ్‌వంత్‌పూర్: 72 కిలోల మాంసం/చేపలు సీజ్.
ది రాడిసన్ బ్లూ: ఏకంగా 105 కిలోల గడువు తీరిన ఆహార పదార్థాలు (50 కిలోల చికెన్, 25 కిలోల మాంసం, 23 కిలోల చేపలు, 7 కిలోల కూరగాయలు) స్వాధీనం.
గోబీ మంచూరియన్, కబాబ్ వంటి ప్రముఖ ఆహార పదార్థాలలో అపరిశుభ్రమైన వంట గదులు, నాణ్యత లేని పదార్థాలు, కృత్రిమ రంగుల వాడకంపై గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనితో ప్రభుత్వం నిఘా మరింత కఠినతరం చేసింది. గతంలోనూ 'ఆపరేషన్ ఈట్ రైట్' పేరిట ఇలాంటి దాడులే నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్‌లో ఇటీవలి కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహిస్తున్న సోదాల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బెంగళూరులో, అది కూడా లగ్జరీ హోటళ్లు సైతం ఇంత దారుణంగా ఉండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


