...
...
Next Story

Royal Enfield Himalayan 440 : ఆర్​ఈ కొత్త బైక్- కొనాలా? వద్దా? హిమాలయన్ 440 డీటైల్డ్ రివ్యూ..

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో అడ్వెంచర్ బైక్ 'హిమాలయన్ 440' రూ.2.29 లక్షల ప్రారంభ ధరతో భారత మార్కెట్లోకి వచ్చింది. మరి ఈ బైక్​ని కొనాలా? వద్దా? హెచ్​టీ ఆటో టీమ్ డీటైల్డ్​ రివ్యూను ఇక్కడ చూసేయండి..

Published on: Oct 3, 2026, 09:11:05 IST
Advertisement

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి తొలిసారి 'హిమాలయన్ 411' మార్కెట్లోకి వచ్చినప్పుడు ఆటోమొబైల్ వర్గాల్లో ఎన్నో అనుమానాలు ఉండేవి. అది అత్యంత వేగవంతమైన బైక్ కాదు, డిజైన్ పరంగా చాలామందికి నచ్చలేదు, అలాగే రిఫైన్‌మెంట్ కూడా తక్కువే. అయినప్పటికీ రఫ్ అండ్ టాఫ్ డిజైన్, ఆఫ్-రోడింగ్ సామర్థ్యంతో ఆ బైక్ అడ్వెంచర్ ప్రియుల మనసు గెలుచుకుని సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత వచ్చిన స్క్రామ్ 411 కూడా మంచి ఆదరణ పొందింది.

రాయల్ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ 440
రాయల్ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ 440

అయినప్పటికీ, ఈ సిరీస్ నుంచి రాయల్ ఎన్‌ఫీల్డ్ ‘స్క్రామ్ 440’ని తీసుకువచ్చినప్పుడు కూడా చాలా మంది సందేహించారు. కానీ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ తర్వాత అది ఆకట్టుకుంది. ఇప్పుడు అదే బాటలో కొత్త 'హిమాలయన్ 440' బైక్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. రూ.2.29 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో వచ్చిన ఈ కొత్త అడ్వెంచర్ బైక్ నిజంగానే వినియోగదారులను మెప్పిస్తుందా? రైడింగ్ అనుభవం ఎలా ఉంది? హెచ్​టీ ఆటోకి సంబంధించిన రాయల్ ఎన్​ఫీల్డ్​ 440కి డీటైల్డ్​ రివ్యూను ఇక్కడ చూసేయండి..

సింప్లిసిటీకి ప్రాధాన్యత ఇస్తూ డిజైన్..

హిమాలయన్ 440 అనేది సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై వచ్చిన హిమాలయన్ 450కి ప్రత్యామ్నాయం కాదు. 450 మోడల్ మరింత పర్ఫార్మెన్స్, మోడర్న్ టెక్నాలజీతో వస్తే.. ఈ 440 మోడల్ మాత్రం బేసిక్ సింప్లిసిటీ, ప్రాక్టికాలిటీ, ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది.

డిజైన్ విషయానికొస్తే, పాత హిమాలయన్ మోడల్‌ను గుర్తుచేస్తుంది. ఎత్తైన- నిటారైన రైడింగ్ పొజిషన్, రౌండ్ హెడ్‌ల్యాంప్, విండ్‌స్క్రీన్, హ్యాండిల్‌‌బార్ యథావిధిగా ఉన్నాయి. ఇందులో 15 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 800 ఎంఎం సీట్ హైట్, 220 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. ముందువైపు 21 అంగుళాలు, వెనుకవైపు 17 అంగుళాల స్పోక్డ్ వీల్స్‌ను ట్యూబ్ టైర్లతో అందించారు. హిమాలయన్ బ్రాండ్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక బ్యాడ్జ్‌తో పాటు మస్టాంగ్ బ్రౌన్, నెలాంగ్ వైట్, సెలా బ్లాక్ అనే మూడు రంగుల్లో ఈ బైక్ లభిస్తుంది.

443 సీసీ ఇంజిన్.. పవర్ ఎలా ఉంది?

సిటీ రైడింగ్‌లో ఈ ఇంజిన్ చాలా హాయిగా అనిపిస్తుంది. తగినంత టార్క్ ఉండటం వల్ల తరచూ గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సిటీ ట్రాఫిక్‌లో ఈజీగా దూసుకెళ్లవచ్చు. కఠినమైన రోడ్లు, కొండ ప్రాంతాలు ఎక్కేటప్పుడు దీని లాంగ్-స్ట్రోక్ ఇంజిన్ అద్భుతంగా పనిచేస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఐకానిక్ ఎగ్జాస్ట్ సౌండ్ వినసొంపుగా ఉంటుంది.

అయితే హైవేపై దీని పరిమితులు బయటపడతాయి. ఈ బైక్ గంటకు 120 కిమీ వేగాన్ని అందుకోగలదు, కానీ ఆ వేగాన్ని చేరుకోవడానికి సమయం పడుతుంది. టాప్ స్పీడ్ వద్ద ఇంజిన్‌పై ఒత్తిడి స్పష్టంగా తెలుస్తుంది. గంటకు 100 కిమీ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు బైక్ చాలా ప్రశాంతంగా, రైడర్‌కు సౌకర్యవంతంగా అనిపిస్తుంది. టెస్ట్ రైడింగ్‌లో ఈ బైక్ లీటరుకు సుమారు 30 కిమీ మైలేజ్ ఇచ్చింది.

6-స్పీడ్ గేర్‌బాక్స్.. కానీ రిఫైన్‌మెంట్ లోపమే!

పాత 411 మోడల్‌తో పోలిస్తే ఇందులో ఇచ్చిన 6-స్పీడ్ గేర్‌బాక్స్ మంచి మార్పు. హైవే రైడింగ్‌కు ఇది ఉపయోగపడుతుంది. క్లచ్ చాలా లైట్‌గా ఉన్నప్పటికీ, గేర్‌బాక్స్ షిఫ్టింగ్ అంత స్మూత్‌గా లేదు. తరచూ 'ఫాల్స్ న్యూట్రల్స్' రావడం రైడర్‌కు కాస్త విసుగు కలిగిస్తుంది. స్క్రామ్ 440లో కనిపించిన రిఫైన్‌మెంట్ హిమాలయన్ 440లో లోపించడం కొంత నిరాశకు గురిచేస్తుంది.

సస్పెన్షన్, ఆఫ్-రోడింగ్ సామర్థ్యం..

రాయల్​ ఎన్​ఫీల్డ్​ హిమాలయన్ 440లో ముందువైపు 41 ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్క్స్ (200 ఎంఎం ట్రావెల్), వెనుకవైపు లింకేజ్-మౌంటెడ్ మోనోషాక్ (180 ఎంఎం ట్రావెల్) సస్పెన్షన్ అందించారు. సస్పెన్షన్ సెటప్ చాలా సాఫ్ట్‌గా ఉండటం వల్ల గుంతలు, చెడు రోడ్లు, ఆఫ్-రోడ్ ట్రాక్‌లను బైక్ చాలా సునాయాసంగా దాటేస్తుంది. 220 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ బైక్‌కు మంచి ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని ఇస్తుంది.

అయితే, ప్లెయిన్ రోడ్లపై వేగంగా వెళ్లేటప్పుడు లేదా మలుపులు తిరిగేటప్పుడు సాఫ్ట్ సస్పెన్షన్ వల్ల బైక్ కాస్త ఊగుతున్నట్లు అనిపిస్తుంది. ఆఫ్-రోడింగ్‌కు ఉపయోగపడే సస్పెన్షన్ సెటప్, ఆన్‌-రోడ్ హెవీ కార్నరింగ్‌కు పూర్తి స్థాయిలో సహకరించకపోవడం చిన్న ప్రతికూలత.

బ్రేకింగ్, సీట్ హైట్..

ముందువైపు 300 ఎంఎం డిస్క్ బ్రేక్ (టూ-పిస్టన్ కాలిపర్), వెనుకవైపు 240 ఎంఎం డిస్క్ బ్రేక్ (సింగిల్-పిస్టన్ కాలిపర్) ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ సౌకర్యం ఉంది, ఆఫ్-రోడింగ్ కోసం వెనుక ఏబీఎస్‌‌ను స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. బ్రేకింగ్ పర్వాలేదనిపించినా, తక్కువ వేగంలో ఉన్నప్పుడు వెనుక ఏబీఎస్ చాలా త్వరగా పనిచేయడం కాస్త అసౌకర్యంగా ఉంటుంది.

ఈ బైక్ అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని 800 ఎంఎం సీట్ హైట్. బైక్ పెద్దదిగా కనిపించినా, తక్కువ ఎత్తు ఉన్న రైడర్లు కూడా సులభంగా నడపవచ్చు. రైడింగ్ పొజిషన్ చాలా బాగుంది. అయితే, సీట్ కుషన్ చాలా గట్టిగా ఉండటం వల్ల సుదీర్ఘ ప్రయాణాల్లో కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు.

చిన్న చిన్న లోపాలు.. చీకట్లో ప్రయాణం కష్టమే!

రైడింగ్ సమయంలో కొన్ని చిన్న సమస్యలు ఇబ్బంది పెడతాయి. విండ్‌‌స్క్రీన్ ఎక్కువగా వైబ్రేట్ అవ్వడం, కొన్ని నిర్దిష్ట స్పీడ్స్ వద్ద మిర్రర్స్, సీట్, ఫ్యూయల్ ట్యాంక్ వద్ద వైబ్రేషన్స్ రావడం గమనించవచ్చు. బైక్ బరువు 199 కేజీలు ఉన్నప్పటికీ, ప్రయాణంలో ఆ బరువు పెద్దగా అనిపించదు.

అయితే ఈ బైక్‌లో అతిపెద్ద మైనస్ పాయింట్ దీని ఎల్‌ఈడీ హెడ్‌లైట్. అడ్వెంచర్ టూరర్ బైక్‌పై సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారికి రాత్రి వేళల్లో మంచి లైటింగ్ చాలా అవసరం. కానీ ఈ హెడ్‌లైట్ ఫోకస్, వెలుగు ఎంతమాత్రం సరిపోదు.!

ఫీచర్లు, యాక్సెసరీలు..

ఈ బైక్‌లో అనలాగ్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, నేవిగేషన్ కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ 'ట్రిప్పర్ పోడ్' ఇచ్చారు. సీ-టైప్ యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. బైక్‌ మరింత లగేజ్ మోసేలా వెనుక భాగాన్ని రీ-డిజైన్ చేశారు. కంపెనీ అధికారికంగా టాప్ బాక్స్, లగేజ్ రాక్స్, ఇంజిన్ గార్డ్స్ వంటి అనేక అడ్వెంచర్ యాక్సెసరీలను అందిస్తోంది.

రాయల్​ ఎన్​ఫీల్డ్​ హిమాలయన్ 440 రివ్యూ..

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 440 ఒక స్పష్టమైన లక్ష్యంతో వచ్చింది. పాత 411 మోడల్ పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని, దానికి 443 సీసీ ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్, మెరుగైన బ్రేకింగ్‌ను జోడించారు. 21 అంగుళాల ఫ్రంట్ వీల్, ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, తక్కువ సీట్ హైట్ ఆఫ్-రోడ్ రైడింగ్‌కు బాగా ఉపయోగపడతాయి.

అయితే గేర్‌బాక్స్ స్మూత్‌నెస్ లోపించడం, వైబ్రేషన్స్, గట్టి సీటింగ్, బలహీనమైన హెడ్‌లైట్ వంటి లోపాలు నిరాశపరుస్తాయి. టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్, సుజుకీ వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ వంటి బలమైన పోటీదారులు ఉన్న ఈ సెగ్మెంట్‌లో హిమాలయన్ 440 మంచి సేల్స్ సాధించే అవకాశం ఉన్నప్పటికీ.. ఫినిషింగ్, రిఫైన్‌మెంట్ విషయంలో రాయల్ ఎన్‌‌ఫీల్డ్ మరికాస్త శ్రద్ధ వహించి ఉంటే బాగుండేదని హెచ్​టీ ఆటో టీమ్ అభిప్రాయపడింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks