...
...
Next Story

Adventure bike : అడ్వెంచర్​ బైక్ లవర్స్​కి అదిరే న్యూస్! క్రేజీ ఫీచర్లతో రాయల్​ ఎన్​ఫీల్డ్​ హిమాలయన్ 750..

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ పాపులర్ అడ్వెంచర్ సిరీస్‌లో అత్యంత పవర్‌ఫుల్ 'హిమాలయన్ 750' బైక్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ట్విన్-సిలిండర్ ఇంజిన్, డ్యూయల్ డిస్క్ బ్రేకులు, అధునాతన ఫీచర్లతో రానున్న ఈ లాంగ్-డిస్టెన్స్ టూరర్ పూర్తి వివరాలను ఇక్కడ పరిశీలించండి..

Published on: Oct 16, 2026, 17:02:52 IST
Advertisement

ప్రీమియం మోటార్ సైకిళ్ల తయారీలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ.. అడ్వెంచర్ రైడర్లకు మరో బిగ్ సర్​ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే భారతీయ రోడ్లపై సంచలనం సృష్టిస్తున్న 'హిమాలయన్ 450' సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో, హిమాలయన్ 440ని ఇటీవలే లాంచ్ చేసిన ఈ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ.. ఇప్పుడు హిమాలయన్ 750 అడ్వెంచర్​ బైక్​ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ప్రొటోటైప్ రూపంలో రోడ్డు పరీక్షలు జరుపుకుంటున్న ఈ బైక్, ఇప్పటికే ఉన్న హిమాలయన్ 450 కంటే మెకానికల్‌గా, డిజైన్ పరంగా భారీ మార్పులతో రూపుదిద్దుకుంటోంది.

హిమాలయన్ 750 అడ్వెంచర్ బైక్..
హిమాలయన్ 750 అడ్వెంచర్ బైక్..

రోడ్డు పరీక్షల్లో ఈ అడ్వెంచర్​ బైక్​కి సంబంధించి పలు కీలక విషయాలు లీక్ అయ్యాయి. వాటిని ఇక్కడ చూసేయండి..

రాయల్ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ 750- ఇంజిన్, పర్ఫార్మెన్స్..

రాయల్ ఎన్‌ఫీల్డ్ వద్ద ఉన్న 648 సీసీ ప్యారలల్-ట్విన్ ఇంజిన్ ప్లాట్‌ఫామ్‌ను మరింత అప్‌గ్రేడ్ చేసి, ఈ హిమాలయన్ 750 కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ కొత్త 750 సీసీ ఇంజిన్ దాదాపు 55 నుంచి 60 హెచ్‌పీ పవర్, 60 నుంచి 65 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. సుదీర్ఘ ప్రయాణాలలో ఇంజిన్ శ్రమ లేకుండా సాఫీగా సాగేందుకు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్‌ను ఇందులో పొందుపరిచారు.

రాయల్ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ 750- సస్పెన్షన్, బ్రేకింగ్..

హిమాలయన్ 450తో పోలిస్తే ఈ 750 సీసీ బైక్‌లో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. ముందుభాగంలో ప్రముఖ షోవా కంపెనీకి చెందిన అప్‌సైడ్-డౌన్ ఫోర్కులు, వెనుక భాగంలో లింకేజ్-టైప్ మోనోషాక్ సస్పెన్షన్ అమర్చారు. ఎక్కువ లగేజీ లేదా పిలియన్ రైడర్‌తో ప్రయాణిస్తున్నప్పుడు సస్పెన్షన్‌ను సులువుగా అడ్జస్ట్ చేసుకోవడానికి 'రిమోట్ రియర్ ప్రిలోడ్ అడ్జస్టర్' సదుపాయం ఇచ్చారు.

రాయల్ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ 450 మోడల్ 21-ఇంచుల ఫ్రంట్, 17-ఇంచుల రియర్ వీల్స్‌తో ఆఫ్-రోడింగ్‌కు ప్రాధాన్యమిస్తే, ఈ కొత్త హిమాలయన్ 750 లో 19-ఇంచుల ఫ్రంట్, 17-ఇంచుల రియర్ వీల్స్‌ను అందించారు. ఈ చక్రాల అమరిక వల్ల గరుకు రోడ్ల కంటే హైవేలపై ఎక్కువ వేగంతో సుదీర్ఘ ప్రయాణాలు చేయడానికి, మలుపుల్లో హ్యాండ్లింగ్ సులువుగా చేయడానికి వీలవుతుంది. టెస్టింగ్ ప్రొటోటైప్‌లలో వైర్-స్పోక్ వీల్స్ కనిపించాయి.

రాయల్ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ 750- ఫీచర్లు..

లాంగ్-డిస్టెన్స్ టూరింగ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కారు తరహా ఫీచర్లను ఈ రాయల్ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ 750 అడ్వెంచర్​ బైక్​లో ఇవ్వడం విశేషం. ఆకర్షణీయమైన ఫ్రంట్ ఫెయిరింగ్, ఎత్తైన విండ్‌స్క్రీన్, సరికొత్త ఇంధన ట్యాంక్ డిజైన్ బైక్‌కు అగ్రెసివ్ లుక్‌ను ఇస్తున్నాయి. రౌండ్ ఫుల్-కలర్ టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, నావిగేషన్ కనెక్టివిటీ, రైడ్-బై-వైర్ త్రోటల్, మల్టిపుల్ రైడింగ్ మోడ్లు, క్రూయిజ్ కంట్రోల్ వంటి ప్రీమియం టెక్నాలజీని ఇందులో పొందుపరిచారు. లగేజ్ బాక్స్‌లను అమర్చుకోవడానికి అనువుగా ప్రత్యేక మౌంటింగ్ పాయింట్లను డిజైన్ చేశారు.

రాయల్ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ 750- ధర, లాంచ్ (అంచనా)..

రాయల్ ఎన్‌ఫీల్డ్ పోర్ట్‌ఫోలియోలోనే ఇది అత్యంత భారీ, ప్రీమియం అడ్వెంచర్ బైక్‌గా నిలవనుంది. అంతర్జాతీయంగా జరిగే ఈఐసీఎంఏ 2026 ఆటో ప్రదర్శనలో (నవంబర్ 3 నుంచి 8 వరకు) ఈ బైక్‌ను ప్రపంచానికి పరిచయం చేసి, అనంతరం భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

భారత మార్కెట్లో ఈ రాయల్ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ 750 ప్రారంభ ధర రూ. 4 లక్షల నుంచి రూ. 4.5 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది.

లాంగ్ డ్రైవ్‌లు, అడ్వెంచర్ టూర్లు ఇష్టపడే తెలుగు రాష్ట్రాల రైడర్లకు ఈ బైక్ డ్రీమ్ వెహికిల్​గా మారనుంది!

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks