Adventure bike : అడ్వెంచర్ బైక్ లవర్స్‌కి అదిరే న్యూస్! క్రేజీ ఫీచర్లతో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750..
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తమ పాపులర్ అడ్వెంచర్ సిరీస్‌లో అత్యంత పవర్ఫుల్ 'హిమాలయన్ 750' బైక్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ట్విన్-సిలిండర్ ఇంజిన్, డ్యూయల్ డిస్క్ బ్రేకులు, అధునాతన ఫీచర్లతో రానున్న ఈ లాంగ్-డిస్టెన్స్ టూరర్ పూర్తి వివరాలను ఇక్కడ పరిశీలించండి..
ప్రీమియం మోటార్ సైకిళ్ల తయారీలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ.. అడ్వెంచర్ రైడర్లకు మరో బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే భారతీయ రోడ్లపై సంచలనం సృష్టిస్తున్న 'హిమాలయన్ 450' సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో, హిమాలయన్ 440ని ఇటీవలే లాంచ్ చేసిన ఈ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ.. ఇప్పుడు హిమాలయన్ 750 అడ్వెంచర్ బైక్‌ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ప్రొటోటైప్ రూపంలో రోడ్డు పరీక్షలు జరుపుకుంటున్న ఈ బైక్, ఇప్పటికే ఉన్న హిమాలయన్ 450 కంటే మెకానికల్‌గా, డిజైన్ పరంగా భారీ మార్పులతో రూపుదిద్దుకుంటోంది.

రోడ్డు పరీక్షల్లో ఈ అడ్వెంచర్ బైక్‌కి సంబంధించి పలు కీలక విషయాలు లీక్ అయ్యాయి. వాటిని ఇక్కడ చూసేయండి..
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750- ఇంజిన్, పర్ఫార్మెన్స్..
రాయల్ ఎన్ఫీల్డ్ వద్ద ఉన్న 648 సీసీ ప్యారలల్-ట్విన్ ఇంజిన్ ప్లాట్‌ఫామ్‌ను మరింత అప్‌గ్రేడ్ చేసి, ఈ హిమాలయన్ 750 కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ కొత్త 750 సీసీ ఇంజిన్ దాదాపు 55 నుంచి 60 హెచ్‌పీ పవర్, 60 నుంచి 65 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. సుదీర్ఘ ప్రయాణాలలో ఇంజిన్ శ్రమ లేకుండా సాఫీగా సాగేందుకు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్‌ను ఇందులో పొందుపరిచారు.
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750- సస్పెన్షన్, బ్రేకింగ్..
హిమాలయన్ 450తో పోలిస్తే ఈ 750 సీసీ బైక్‌లో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. ముందుభాగంలో ప్రముఖ షోవా కంపెనీకి చెందిన అప్‌సైడ్-డౌన్ ఫోర్కులు, వెనుక భాగంలో లింకేజ్-టైప్ మోనోషాక్ సస్పెన్షన్ అమర్చారు. ఎక్కువ లగేజీ లేదా పిలియన్ రైడర్‌తో ప్రయాణిస్తున్నప్పుడు సస్పెన్షన్‌ను సులువుగా అడ్జస్ట్ చేసుకోవడానికి 'రిమోట్ రియర్ ప్రిలోడ్ అడ్జస్టర్' సదుపాయం ఇచ్చారు.
బ్రేకింగ్ వ్యవస్థను గమనిస్తే, ముందు చక్రానికి సింగిల్ డిస్క్‌కు బదులుగా 'ట్విన్ ఫ్రంట్ డిస్క్' (డ్యూయల్ డిస్క్) బ్రేకులను పొందుపరిచారు. ఇది తీవ్రమైన వేగంలో కూడా బైక్‌ను సురక్షితంగా నియంత్రించడానికి దోహదపడుతుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750- వీల్స్..
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 మోడల్ 21-ఇంచుల ఫ్రంట్, 17-ఇంచుల రియర్ వీల్స్‌తో ఆఫ్-రోడింగ్‌కు ప్రాధాన్యమిస్తే, ఈ కొత్త హిమాలయన్ 750 లో 19-ఇంచుల ఫ్రంట్, 17-ఇంచుల రియర్ వీల్స్‌ను అందించారు. ఈ చక్రాల అమరిక వల్ల గరుకు రోడ్ల కంటే హైవేలపై ఎక్కువ వేగంతో సుదీర్ఘ ప్రయాణాలు చేయడానికి, మలుపుల్లో హ్యాండ్లింగ్ సులువుగా చేయడానికి వీలవుతుంది. టెస్టింగ్ ప్రొటోటైప్లలో వైర్-స్పోక్ వీల్స్ కనిపించాయి.
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750- ఫీచర్లు..
లాంగ్-డిస్టెన్స్ టూరింగ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కారు తరహా ఫీచర్లను ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750 అడ్వెంచర్ బైక్‌లో ఇవ్వడం విశేషం. ఆకర్షణీయమైన ఫ్రంట్ ఫెయిరింగ్, ఎత్తైన విండ్‌స్క్రీన్, సరికొత్త ఇంధన ట్యాంక్ డిజైన్ బైక్‌కు అగ్రెసివ్ లుక్‌ను ఇస్తున్నాయి. రౌండ్ ఫుల్-కలర్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, నావిగేషన్ కనెక్టివిటీ, రైడ్-బై-వైర్ త్రోటల్, మల్టిపుల్ రైడింగ్ మోడ్లు, క్రూయిజ్ కంట్రోల్ వంటి ప్రీమియం టెక్నాలజీని ఇందులో పొందుపరిచారు. లగేజ్ బాక్స్‌లను అమర్చుకోవడానికి అనువుగా ప్రత్యేక మౌంటింగ్ పాయింట్లను డిజైన్ చేశారు.
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750- ధర, లాంచ్ (అంచనా)..
రాయల్ ఎన్ఫీల్డ్ పోర్ట్‌ఫోలియోలోనే ఇది అత్యంత భారీ, ప్రీమియం అడ్వెంచర్ బైక్‌గా నిలవనుంది. అంతర్జాతీయంగా జరిగే ఈఐసీఎంఏ 2026 ఆటో ప్రదర్శనలో (నవంబర్ 3 నుంచి 8 వరకు) ఈ బైక్‌ను ప్రపంచానికి పరిచయం చేసి, అనంతరం భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
భారత మార్కెట్లో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750 ప్రారంభ ధర రూ. 4 లక్షల నుంచి రూ. 4.5 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది.
లాంగ్ డ్రైవ్‌లు, అడ్వెంచర్ టూర్లు ఇష్టపడే తెలుగు రాష్ట్రాల రైడర్లకు ఈ బైక్ డ్రీమ్ వెహికిల్‌గా మారనుంది!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


