Election Commission : ఈసీ వర్సెస్ ఈసీ! సీనియర్ అధికారిపై ఫిర్యాదు.. ఆర్టీఐతో బయటపడ్డ సంచలనం

కేంద్ర ఎన్నికల సంఘంలో ఉన్నతాధికారుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి! సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మనీష్ గార్గ్ తీరుపై ఎలక్షన్ కమిషనర్లు సుఖ్‌బీర్ సంధు, వివేక్ జోషి రాసిన రహస్య లేఖల వివరాలు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వెలుగుచూశాయి.

Published on: Oct 23, 2026, 09:11:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాల్సిన భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)లో అంతర్గత విభేదాలు ఉన్నాయనే వార్తలను తాజా పరిణామాలు మరింత బలోపేతం చేస్తున్నాయి! సంస్థలోని ఉన్నతాధికారుల మధ్య విభేదాలు ఏ స్థాయికి చేరిందో ఒక సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) దరఖాస్తు స్పష్టం చేసింది. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ (డీఈసీ) మనీష్ గార్గ్ ఏకపక్ష నిర్ణయాలు, అనుచిత ప్రవర్తనపై ఎలక్షన్ కమిషనర్లు సుఖ్‌బీర్ సంధు, వివేక్ జోషి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాసిన లేఖలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.

కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం..
కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం..

రిటైర్డ్ కమడోర్ లోకేష్ బాత్రా దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు కేబినెట్ సెక్రటేరియట్ ఇచ్చిన సమాధానం ద్వారా ఈ విషయాలు బయటకు వచ్చాయి. కమిషనర్లు రాసిన ఫిర్యాదు లేఖల ప్రతులను కేబినెట్ సెక్రటేరియట్ నేరుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ కార్యాలయానికి, అలాగే సిబ్బంది-శిక్షణ శాఖకు పంపినట్లు వెల్లడైంది.

అంతులేని అధికార పోరు.. అసలేం జరిగింది?

ఈ వివాదానికి ప్రధాన కారణం అధికారుల విధుల పునర్విభజన! జులై 28న అడ్మినిస్ట్రేషన్ విభాగం అదనపు బాధ్యతలు చేపట్టిన మనీష్ గార్గ్, మరుసటి రోజే తనకంటే సీనియర్లు, సమాన హోదా ఉన్న అధికారుల పనివిభజనపై కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ఐటీ విభాగానికి చెందిన కీలక ఫైళ్ల రూటింగ్ ప్రక్రియను ఆయన ఏకపక్షంగా మార్చేశారు. గతంలో డిప్యూటీ కమిషనర్ సంజయ్ కుమార్ వద్దకు వెళ్లాల్సిన ఫైళ్లను వేరే మార్గానికి మళ్లించడంపై మిగతా కమిషనర్లు మండిపడ్డారు.

తమను సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని, 2023 సీఈసీ/ఈసీ చట్టంలోని సెక్షన్ 18(1), 18(2) నిబంధనలను ఉల్లంఘించారని జులై 29న కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్‌కు రాసిన కాన్ఫిడెన్షియల్ లేఖల్లో సంధు, జోషి పేర్కొన్నారు. తమకు కావాల్సిన ఫైళ్లను కూడా అడ్మినిస్ట్రేషన్ విభాగం ఇవ్వకుండా నిలిపివేసిందని వివేక్ జోషి ఆరోపించారు.

రాజ్యాంగ వ్యవస్థలో జోక్యమవుతుందనే వెనకడుగు..

కేబినెట్ సెక్రటేరియట్ ఈ వ్యవహారంపై ఆగస్టు 4న ప్రత్యేక పరిశీలన జరిపింది. ఎన్నికల సంఘం స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ కావడం వల్ల, ప్రభుత్వం నేరుగా ఎలాంటి చర్యలు తీసుకున్నా అది "వ్యవస్థాగత జోక్యం చేసుకున్నట్లు భావించే ప్రమాదం ఉందనడంలో సందేహం లేదు," అని సెక్రటేరియట్ తన నోట్‌లో స్పష్టం చేసింది.

ఈ లేఖలు ఎన్నికల సంఘం అధికారికంగా పంపినవి కావు. కమిషనర్లు తమ వ్యక్తిగత హోదాలో రాసినందున ప్రభుత్వం నేరుగా చర్యలు తీసుకోలేమని భావించింది. అందుకే లేఖలు అందినట్లు ఆగస్టు 5న కమిషనర్లకు రసీదు పంపి, ఆ ప్రతులను సీఈసీ జ్ఞానేష్ కుమార్, సిబ్బందిశాఖ కార్యదర్శికి అందించింది.

ఐటీ విభాగం వివాదం.. ఓటర్ల జాబితా లొసుగులు

ఈ అధికారుల వివాదం వెనుక ఐటీ విభాగానికి చెందిన ప్రధాన సమస్య ఉందనే ప్రచారం జరుగుతోంది. ఐటీ డైరెక్టర్ జనరల్ సీమా ఖన్నా ప్రవేశపెట్టిన కొత్త సాంకేతిక వ్యవస్థ వల్ల, ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు బాధ్యతలు చూసే ఓటర్ రిజిస్ట్రేషన్ అధికారులకు ఓటర్ల జాబితా డేటాబేస్ అందుబాటులో లేకుండా పోయిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపైనే అధికారుల మధ్య తీవ్రస్థాయిలో అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.

ఈసీలో కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలను ఎన్నికల సంఘం అధికారికంగా ఖండించింది. నిర్ణయాలన్నీ నిబంధనల ప్రకారమే ఏకగ్రీవంగా లేదా మెజారిటీ ప్రాతిపదికన తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. అయితే, ఆర్టీఐ ద్వారా వెలుగుచూసిన ఈ లేఖలు మాత్రం మరోలా ఉన్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More