“జిన్నా వ్యతిరేకిస్తే- నెహ్రూ తలూపారు”- వందేమాతరంపై లోక్‌సభలో ప్రధాని మోదీ..
వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చ జరిగింది. ఇందులో భాగంగా వందేమాతరంతో పాటు నాటి పరిస్థితులు, అనంతర విషయాలపై ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.
'వందేమాతరం' కు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం పార్లమెంట్‌లో జరిగిన ప్రత్యేక చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ గీతానికి ఉన్న ఘన చరిత్రను, వలస పాలన వ్యతిరేక స్ఫూర్తిని ప్రధాని వివరించారు.

"ఈ రోజు మనం ఈ పవిత్రమైన వందేమాతరాన్ని స్మరించుకోవడం ఈ సభలోని మనందరికీ గొప్ప అదృష్టం," అని ప్రధాని మోదీ లోక్‌సభలో అన్నారు. అయితే, 1937లో కాంగ్రెస్ పార్టీ ఈ గీతం నుంచి కొన్ని పంక్తులను తొలగించిందని, అదే "దేశ విభజనకు బీజాలు వేసింద"ని ప్రధాని మోదీ ఆరోపించడంతో ఈ చర్చ రాజకీయ రంగు పులుముకుంది.
లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగం..
"భారతదేశాన్ని చిన్నచూపు చూడటం ఒక ఫ్యాషన్‌గా మారిన నాటి సమయంలో బంకిమ్ బాబు వందేమాతరం రాశారు," అని ప్రధాని మోదీ వందేమాతరం రచయిత బంకిం చంద్ర ఛటర్జీ గురించి ప్రస్తావించారు.
(ఇక్కడ ఒక బెంగాలీ ప్రతిపక్ష ఎంపీ అడ్డుకుని, 'బంకిం దా' (దా అంటే సోదరుడు) అనకుండా, గౌరవ సూచకమైన 'బంకిం బాబు' అని సంబోధించాలని సూచించారు. ప్రధాని మోదీ వెంటనే తనను తాను సరిదిద్దుకుని, ఎంపీకి అనేకసార్లు 'ధన్యవాదాలు' చెప్పి, 'బాబు' అని ఉపయోగించడం ప్రారంభించారు.)
బ్రిటిష్ వలస పాలన ‘విభజించి పాలించు’ విధానానికి బెంగాల్ ఒక ప్రయోగశాలగా మారిందని మోదీ అన్నారు. "1905లో (బెంగాల్ విభజన) వారు ఆ పాపాన్ని చేసినప్పుడు, వందేమాతరం ఒక పర్వతంలా నిలబడింది. వీధుల్లో పాటగా మారింది. అది ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. బ్రిటిష్ వారు బెంగాల్ ద్వారా విభజన బీజాలు వేశారు. కానీ వందేమాతరం జాతీయ ఐక్యతకు చిహ్నంగా మారింది," అని మోదీ స్పష్టం చేశారు.
వందేమాతరం కేవలం రాజకీయ స్వేచ్ఛ కోసం ఉపయోగించిన ఒక మంత్రం కాదని, అది భారతమాతకు వలసవాద అవశేషాల నుంచి విముక్తి కల్పించడానికి చేసిన పవిత్ర యుద్ధ నినాదం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
బ్రిటిష్ పాలకులు తమ జాతీయ గీతం 'గాడ్ సేవ్ ది క్వీన్' ను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్న సమయంలోనే వందేమాతరం రాయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.
"వందేమాతరాన్ని నిషేధించాలని బ్రిటిష్ వారు ప్రయత్నించారు. ఈ పద్యం ముద్రణ, ప్రచారాన్ని నిరోధించడానికి వారు చట్టాలను తీసుకువచ్చారు," అని మోదీ అన్నారు.
లండన్‌లోని ఇండియా హౌస్‌లో వీడీ సావర్కార్ వందేమాతరం ఆలపించిన విధానాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. "లక్షలాది మంది వందేమాతరం నినాదం చేస్తూ స్వాతంత్య్రం కోసం పోరాడటం వల్లే మనం ఇక్కడ కూర్చున్నాం," అని అనేక మంది స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను ప్రస్తావించిన తర్వాత మోదీ అన్నారు.
ఈ క్రమంలోనే ఇండియాలో విధించిన ఎమర్జెన్సీని సైతం మోదీ ప్రస్తావించారు.
“వందేమాతరం 50 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు దేశం వలస పాలనలో ఉందని, అయితే అది 100వ వార్షికోత్సవం జరుపుకునే నాటికి దేశం ఎమర్జెన్సీలో ఉంది,” అని మోదీ అన్నారు.
"ఆ సమయంలో, రాజ్యాంగాన్ని అణచివేశారు, దేశభక్తి కోసం జీవించిన వారిని జైళ్లలో నెట్టారు. ఎమర్జెన్సీ అనేది మన చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ఇప్పుడు మనకు వందేమాతరం గొప్పతనాన్ని పునరుద్ధరించే అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని వదులుకోకూడదని నేను నమ్ముతున్నాను," అని మోదీ అన్నారు.
“గత శతాబ్దంలో వందేమాతరం గీతానికి కొందరు ద్రోహం చేశారు. ఎవరు చేశారు? అన్నది భావి తరాలకు చెప్పడం మన బాధ్యత. 1937లో మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్ వందేమాతరం గీతానికి వ్యతిరేకంగా క్యాంపైన్ చేసింది. దానిని వ్యతిరేకించాల్సిన కాంగ్రెస్, నెహ్రూలు.. వందేమాతరంపైనే దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు,” అని మోదీ అన్నారు.
“మత సామరస్యం పేరుతో ఇలా చేశారు. జిన్నా నిరసనకు దిగిన 5 రోజుల్లోనే సుభాష్ చంద్రబోస్‌కి నెహ్రూ లేఖ రాశారు. గీతంలోని కొన్ని భాగాలు ముస్లింలకు నచ్చకపోవచ్చు అని అన్నారు. ఇది విని దేశం మొత్తం షాక్‌కు గురైంది. చివరికి, 1937 అక్టోబర్ 26న వందేమాతరాన్ని భాగాలు భాగాలుగా విడదీసింది కాంగ్రెస్,” అని మోదీ అన్నారు.
వందేమాతరం నినాదాలు, కొన్ని అనువాదాలను ప్రస్తావిస్తూ బంగ్లా- తమిళ భాషల్లో కూడా కొన్ని పంక్తులు మాట్లాడారు ప్రధాని మోదీ.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


