కృత్రిమ మేధ (ఏఐ) వైపు ప్రపంచ టెక్ రంగం వేగంగా అడుగులు వేస్తున్న వేళ, యూరప్‌లోని అత్యంత విలువైన సాఫ్ట్వేర్ దిగ్గజం ఎస్ఏపీ (SAP SE) భారీ ఉద్యోగ కోతలకు సిద్ధమవుతోంది. ఏఐ యుగానికి అనుగుణంగా తన సాఫ్ట్వేర్ వ్యాపారాన్ని సమూలంగా మార్చుకునేందుకు కనీసం 10 వేల పోస్టులను తగ్గించే ప్రణాళికను సంస్థ రూపొందిస్తోంది. ఈ పరిణామాలతో సంబంధం ఉన్న వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్ బిజినెస్ ఈ విషయాన్ని వెల్లడించింది.
ప్రతిపాదిత పునర్వ్యవస్థీకరణ వల్ల ఎస్ఏపీ ప్రపంచవ్యాప్త సిబ్బందిలో కనీసం 9 శాతం మందిపై ప్రభావం పడనుంది. ప్రస్తుతం ఈ అంశంపై అంతర్గత చర్చలు కొనసాగుతున్నందున, ఆయా వర్గాలు తమ పేర్లు వెల్లడించడానికి ఇష్టపడలేదు. కోత విధించే ఉద్యోగాల తుది సంఖ్యపై సంస్థ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కార్మిక సంఘాలతో జరిగే చర్చల తర్వాత ఈ సంఖ్యలో మార్పులు జరిగే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థల వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ రంగంలో జర్మనీకి చెందిన ఎస్ఏపీ అగ్రగామిగా కొనసాగుతోంది. భారత్ సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో లక్షలాది మందికి ఈ సంస్థ ఉపాధి కల్పిస్తోంది. మారుతున్న సాంకేతికతకు తగ్గట్టుగా ఏఐ ఆధారిత సేవలపై దృష్టి సారించాలని ఐటీ దిగ్గజాలన్నీ భావిస్తున్న క్రమంలో, ఎస్ఏపీ సైతం తన కార్యకలాపాలను ఆ దిశగా మలుచుకుంటోంది.
ఏఐ వ్యూహంతో నాయకత్వంలో మార్పులు
'ఏఐ-ఫస్ట్' వ్యూహాన్ని వేగంగా అమలు చేయాలని ఎస్ఏపీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) క్రిస్టియన్ క్లెయిన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా జర్మనీలోని వాల్డార్ఫ్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ, ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు తన కార్యనిర్వాహక బోర్డును పునర్వ్యవస్థీకరించింది. ఆరుగురు సభ్యులున్న బోర్డులో ఇద్దరు వచ్చే మార్చిలో సంస్థ నుంచి వైదొలగనున్నారు.
ఉద్యోగాల కోతలపై వస్తున్న వార్తలపై స్పందించేందుకు ఎస్ఏపీ నిరాకరించింది. "మా వ్యూహానికి, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సంస్థ నిర్మాణం ఉండేలా ఎస్ఏపీ నిరంతరం సమీక్షిస్తూ ఉంటుంది" అని ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రొడక్ట్, ఇంజినీరింగ్, సేల్స్ విభాగాలపై గురి
{{/usCountry}}ఉద్యోగాల కోతలపై వస్తున్న వార్తలపై స్పందించేందుకు ఎస్ఏపీ నిరాకరించింది. "మా వ్యూహానికి, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సంస్థ నిర్మాణం ఉండేలా ఎస్ఏపీ నిరంతరం సమీక్షిస్తూ ఉంటుంది" అని ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రొడక్ట్, ఇంజినీరింగ్, సేల్స్ విభాగాలపై గురి
{{/usCountry}}ఈ మార్పుల్లో భాగంగా ఉత్పత్తులను అభివృద్ధి చేసే, విక్రయించే విధానాలను ఎస్ఏపీ నాయకత్వం పూర్తిగా పునఃరూపకల్పన చేస్తోంది. గతంలో ఏఐ ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికి సంస్థ చేసిన ప్రయత్నాలు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాయి. ఆ అనుభవాల నేపథ్యంలో, ఇప్పుడు సంస్థ అప్లికేషన్లలోనే నేరుగా ఏఐ టూల్స్‌ను జోడించేందుకు సీఈఓ క్రిస్టియన్ క్లెయిన్ కృషి చేస్తున్నారు.
ఉద్యోగాల తగ్గింపునకు అవకాశం ఉన్న విభాగాలను గుర్తించాలని సంస్థలోని అన్ని విభాగాలకు ఆదేశాలు అందాయి. ప్రొడక్ట్ అండ్ ఇంజినీరింగ్, సేల్స్ విభాగాలపై నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
సంస్థ ఉన్నత స్థాయిలోనూ కీలక బాధ్యతలు మారాయి. ప్రొడక్ట్ విభాగాధిపతి ముహమ్మద్ ఆలం తన కాంట్రాక్టును పొడిగించుకోకపోవడంతో, ఈ ఏడాది ఆయన బాధ్యతల్లో ఎక్కువ భాగాన్ని క్లెయిన్ స్వయంగా స్వీకరించారు. ఆలం కాంట్రాక్టు మార్చిలో ముగియనుంది. మరోవైపు, ఈ ఏడాది ప్రారంభంలో అదనపు బాధ్యతలు అందుకున్న సేల్స్ చీఫ్ థామస్ సౌరెస్సిగ్, అయోనోస్ గ్రూప్ ఎస్ఈ సీఈఓగా బాధ్యతలు చేపట్టేందుకు ఎస్ఏపీ నుంచి తప్పుకుంటున్నట్లు గత వారం ప్రకటించారు.
2024లోనూ ఇదే తరహా కోతలు.. జర్మనీలో ఉద్యోగ భద్రత
సాధారణంగా ఎస్ఏపీ తన పూర్తి స్థాయి వార్షిక ఆర్థిక ఫలితాలతో పాటు జనవరి చివరి వారంలో భారీ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలను ప్రకటిస్తూ వస్తోంది. చివరిసారిగా 2024లో ఇదే తరహా చర్యలు చేపట్టింది. అప్పట్లో సుమారు 10 వేల పోస్టులను తగ్గించింది. ఏడాదికి పైగా సాగిన ఆ ప్రక్రియకు దాదాపు 3 బిలియన్ యూరోలు (3.3 బిలియన్ డాలర్లు) ఖర్చయింది. స్వచ్ఛంద పదవీ విరమణలు, ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడం ద్వారా ఆ ప్రక్రియను పూర్తి చేశారు. అదే సమయంలో కొత్త పోస్టులకు నియామకాలు చేపట్టడంతో సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో పెద్దగా మార్పు రాలేదు.
ప్రపంచవ్యాప్తంగా ఎస్ఏపీలో 1,10,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. సంస్థకు అత్యధిక మంది సిబ్బంది ఉన్న జర్మనీలో 2028 వరకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ కార్మిక మండలి ఈ ఏడాది ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు, గత వారం మోర్గాన్ స్టాన్లీ సదస్సులో సంస్థ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్ఓ) డొమినిక్ ఆసామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఈ ఏడాది కాలంలో మా సిబ్బంది సంఖ్య కొద్దిగా పెరిగింది. ఆ ధోరణి తిరగబడకపోతే నేను నిజంగా ఆశ్చర్యపోతాను" అని ఆయన వ్యాఖ్యానించారు.
ABOUT THE AUTHOR
ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.